తెలంగాణ సాధన కోసం ఉద్యమ జెండా ఎత్తి పోరాడిన యువతే నేడు రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి పాలనలో యువతకు ఎక్కడా స్థానం ఉండేది కాదు. రాజకీయాల్లో రాణించాలన్నా, పదవులు పొందాలన్నా అనుభవం పేరుతో యువతకు అవకాశాలు రావడం కష్టంగా ఉండేది. ఒకవేళ అవకాశం వస్తే అది నాయకుల కుటుంబ సభ్యులకే దక్కేవి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లేవు. యువత అన్నింట్లో అగ్రభాగాన ఉంటున్నది. దీనికి ఉద్యమనేత కేసీఆర్ ఆలోచనా దృక్పథమే కారణం.
బడుగు, బలహీనవర్గాల నుంచి వచ్చే యువకులు, నైపుణ్యాలు ఉండి గాడ్ ఫాదర్ లేని యువనేతలు కూడా ఇవ్వాళ పాలనాపగ్గాలు చేపట్టి రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపే యువతకు దారి దీపమై ఉంటున్నది. రాజకీయాలంటే అసహ్యించుకునే యువతరానికి రాజకీయాల్లో రావడానికి టీఆర్ఎస్ గొప్ప అవకాశం కల్పిస్తున్నది. తెలంగాణ నుంచి యువ నాయకత్వం పుట్టుకురావడానికి టీఆర్ఎస్ వేదికగా నిలుస్తున్నది.
తెలంగాణ ఉద్యమం బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎంతోమంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దింది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా బాల్క సుమన్, గ్యాదరి కిషోర్‌లను చెప్పుకోవచ్చు. వీరిపై ఉద్యమ కాలంనాటి అనేక కేసులున్నాయి. ఎన్నికల్లో పాల్గొనే ఆర్థికస్తోమత లేదు. అయినప్పటికీ వీరు ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా స్ఫూర్తిదాయకంగా నిలువటానికి కేసీఆర్ తోడ్పాటునందిస్తున్నారు.
నాటి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యువకులెందరో నాయకులుగా ఎదిగారు. నాడు బాటలు వేరైనప్పటికీ స్వాతంత్య్రం సిద్ధించడమే అందరి నినాదం. తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఉద్యమాన్ని అణచివేయాలని బలీయమైన శక్తులు పనిచేశాయి. కేసీఆర్ తన రాజకీయ చతురతతో రాజకీయాల్లో ఆరితేరినవారిని సైతం జీరోలని చేసి, రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొన్న ఎంతోమంది బడుగు బలహీనవర్గాలకు చెందిన యువకులను నాయకులుగా తీర్చిదిద్ది హీరోలుగా సమాజం ముందు నిలబెట్టారు.
కేసీఆర్ లాంటి మేధావికి యువశక్తి తోడైతే అన్నిరంగాల్లో ముందుంటారని నిరూపించారు. ఆ క్రమంలోనే 125 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం ఇద్దరు సభ్యులతో పార్లమెంట్‌ను ఒప్పించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. సకలజనులను ఏకతాటిపైకి తెచ్చి, రాష్ర్టాన్ని సాధించారు. నేడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత అంత గొప్పది తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. తెలంగాణ జాతిపితగా చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు.
నేటి యువతే రేపటి తరానికి మార్గదర్శకులని గట్టిగా నమ్మే కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. యువనేత కేటీఆర్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం, ఇటీవలే ఐదుగురు యువకులను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం దీనికి సంకేతం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా పనిచేసేందుకు, రాజ్యాంగస్ఫూర్తి ప్రకారం వివక్ష లేకుండా అందరికి ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. అందుకు రాజకీయ, ఆర్థిక, పాలనావ్యవస్థలకు సంబంధించిన అధికారపగ్గాలను వారి చేతిలో పెడుతున్నారు.
నిన్నటివరకు రాజకీయాల్లో పదవులు పొందాలంటే కుల, మత, సామాజిక, ఆర్థిక అంగబలాలు ప్రాతిపదికగా ఉండేవి. ఇప్పుడవన్నీ పోయాయి. రాజకీయాలపై ఆసక్తితో ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే చాలు. అలాంటివారిని గుర్తించి కేసీఆర్ అక్కున చేర్చుకుంటున్నారు. రాజకీయాల్లో యువశక్తికి పట్టం గట్టి నవశకానికి నాంది పలుకుతున్నారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నప్పటికీ వారికి ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కానీ కేసీఆర్ 2001 నుంచి 2014 దాకా యువతీ యువకులకు పెద్దపీట వేశారు. ఇప్పటికీ వేస్తున్నారు. కేసీఆర్ మార్గదర్శనంలో ఇక తెలంగాణలో రాబోయేది యువ నాయకత్వమే. రేపటి తెలంగాణ కోసం పటిష్ఠమైన నాయకత్వాలను అందించాలనే లక్ష్యం కోసం కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఏ యువత ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారో అదే యువతకు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించడం ముదావహం. భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులను కేసీఆర్ వేస్తున్నారనేదానికి ఇది సంకేతం.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు)
కాసర్ల నాగేందర్‌రెడ్డి
+61478311563