ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆగ్రహం ఆయన మాటలు.. వాళ్ళకిచ్చిన సమాధానంతో నన్ను ఉద్వేగంగా మార్చి అంత ఉత్సాహపరిచిం ది.
నాయకుడికి సహనం వుండాలి.. నిజమే. కానీ, హద్దూ అదుపూ లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతిని కండ్లా రా చూసిన మాలాంటి వాళ్ళకి అరికాలిమంట నెత్తికెక్కుతుంది. ఇన్నాళ్లకు సరైన మాటలతో ‘రిటార్ట్’ ఇచ్చినందుకు సంతోషం కలిగింది.
రాజకీయాలను చిల్లర దందాగా మార్చుతున్న వేళ న్యాయస్థానంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చట్టాలను మార్చి, కఠినశిక్షలు పడేలా సవరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. భవిష్యత్ తరాలు దుష్ట సంస్కృతినే నేర్చుకోవాల్సి వస్తుంది. లేత మెదళ్ళలో ఒక ‘రాంగ్ మెస్సేజ్’ పాతుకుపోకుండా చూడవలసిన బాధ్యత మనతరంపై కచ్చితంగా ఉన్నది. దానికితోడు సోషల్ మీడియాను ఒక ‘మాఫియా’లా ఆక్రమించింది బీజేపీ. దాన్ని ఎవరూ ఢీ కొట్టలేని, పోటీ ఇవ్వలేని స్థాయికి ఆ ‘మాఫియా’ విస్తరించేసింది. ఆ సోషల్ మీడియా పుణ్యమాని మోదీని గెలిపించుకున్నారు. అదే ఎత్తుగడలో కేసీఆర్ను దించాలని పథకం ప్రకారం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఈ ట్రిక్కులు ఇక్కడ.. ఈ చైతన్యపూరితమైన తెలంగాణ సమాజం ముందు చెల్లవు. అయినా సోషల్ మీడియా ప్రచారాలను, వెర్రిమొర్రి వాగుళ్ళను ఉక్కుపాదంతో అణచివేయాల్సిందే. ఇక యుద్ధం మొదలైనట్లే. కేంద్రంలో సరైన ప్రతిపక్షం లేక మీడియాను అడ్డం పెట్టుకొని ఇన్నాళ్లూ మీ దాష్టీకాలు సాగినయి. ఇక సాగవు. తెలంగాణ గడ్డ మీద హిందు ముస్లింలు గంగా జమునా తెహజీబ్ల్లా కలిసి మెలిసి ఉన్నాం, ఉం టున్నాం. మంచి, మానవత్వం, మానవ ప్రేమకు ఒక ఉదాహరణ.. తెలంగాణ.
హిందూ అయినా, ముస్లిం అయినా మత ఉన్మా దం నాశనకారే. ఇలాంటి తీవ్రవాదాన్ని ‘ఫెనెటిజం’ అంటారు. ఫెనెటిజం ఏ మతంలో ఉన్నా ఏరిపారేయాల్సిన అవసరం సమాజానికి ఉన్నది. తెలంగాణ సమాజమా… తస్మాత్ జాగ్రత్త..! మతోన్మాద భావజాలంతో యువతను రెచ్చగొట్టి తెలంగాణ యూనివర్సిటీలను రక్తసిక్తం చేసినకాలం, హత్యారాజకీయాలతో విద్యార్థులను రోడ్డున పడేసిన దుష్టకాలం నాకింకా గుర్తున్నది. అప్రమత్తత అవసరం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘రాముడు మావాడే.. గుడి కడ్తాం’ అంటూ ఓట్ల కోసం రథయాత్రలు చేసేవాళ్లకు.. దక్షిణభారతంలో ముఖ్యంగా తెలంగాణలో అది చెల్లదు. గనక కొత్త పోకడలతో కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయినా ఎవరు చెప్పారు రాముడు మీ వాడని? రాముడు అందరివాడు.
ఇక ఢిల్లీలో రైతు ఆగ్రహం గురించి మాట్లాడుదాం. చలికి, వర్షాలకు, ప్రాణాలు తీసేస్తున్న కరోనా రోగానికి భయపడకుండా, తలదించకుండా, వృద్ధాప్యాన్ని కూడా లెక్కచేయకుండా ఢిల్లీ రోడ్లమీద తిరుగుబాటు బావుటా ఎగరేసి దీర్ఘకాలం పోరాడిన రైతు గుండె ఎంత మండి ఉండాలి? ఈ పట్టుదలకు దారితీసిన మానసిక క్షోభ ఎంత భయంకరమైనది అయి వుండాలి? ఈ దేశపు అన్నదాతకు చేతులెత్తి దండం పెట్టుకొందాం!
ఎంత మొండిగా వ్యవహరించాడు మోదీ. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాలను సవరించనన్నవాడు. ఇప్పుడు ఆ చట్టాలను రద్దుచేసుకుంటున్నామని దేశ రైతాంగం ముందు నిస్సిగ్గుతో తలదించి క్షమాపణలు కోరాడు. దాష్టీకంతో తిరస్కరించిన అప్పటి ధిక్కారం ఇప్పుడేమైంది? ఐదు రాష్ర్టాల్లో జరగబోతున్న ఎన్నికలే దానికి పురికొల్పాయా? రైతు వ్యతిరేక చట్టాలపై తిరుగుబాటు స్వరం దేశవ్యాప్తంగా విస్తరించింది. రాష్ర్టాల ఎన్నిక ఇప్పుడొక వాత బీజేపీకి. అక్కడ ఓడిపోతే తిరుగుప్రయాణమే. తెలంగాణ నుంచి కూడా ‘దేశవ్యాప్త రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తాన’ని కేసీఆర్ ప్రకటించడం.. అన్నీ కలిపి హడావుడి ప్రకటనకు దారితీసింది. కేసీఆర్ ఎంత మొండివారో, ఎంత రైతు పక్షపాతో.. నీళ్ళ రూపంలో ఎందరి రైతుల ఇళ్ళలో దీపం అయ్యారో దేశమంతా తెలుసు. మోదీకి మరీ తెలుసు.
మోదీ ‘ప్రకటన’ నమ్మించే ప్రయత్నమే తప్ప నమ్మదగ్గ నిజం ఎంతమాత్రం కాదు. అది గ్రహించిన పంజాబ్ రైతులు ఉద్యమం ఆగదని ప్రకటించారు. మాయచేసే దారులు ఇంకెన్ని వెతుకుతారో చూడాలి. రాజ్యాంగబద్ధ చర్చ జరగకుండా బిల్లు హడావుడిగా ఎలా ఆమోదించుకున్నారో అంతే హడావిడిగా చర్చ లేకుండా బిల్లు రద్దు ప్రకటించారు! ఇది వాళ్ళ దొంగబుద్ధికి నిదర్శనం. ఎన్నికల్లో గెలవడం కోసం ఆడిన నాటకం. రజాకార్ల రాజ్యం నుంచే మొన్నమొన్నటి రాష్ట్రం సాధించుకొనే ఉద్యమం దాకా శత్రువును పరుగులు పెట్టించిన తెలంగాణ ఇది. ఇక్కడ మీ వేషాలు చెల్లవు.. చెల్లనివ్వం.!!
రైదు ఉద్యమం నేపథ్యంలో ఎంతమందిని చంపేశారు. ఎంత చావగొట్టారు.. ఎంత మందిని ట్రాక్టర్లతో తొక్కించారు.. ఢిల్లీ రోడ్లనడిగితే రక్తధారల కథలు కన్నీళ్ల పర్యంతమై చెప్తాయి! తమకు అనుకూలంగా వుండి డబ్బు సంచులు అందించే పారిశ్రామికులతో కుదుర్చుకున్న ఒప్పందం కోసం ఇంతటి దుర్మార్గమా..?
–రావులపల్లి సునీత