బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది..’ అన్నట్టుగా, రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం మిగిలేది ‘చివరి గింజే’ అని తేలుస్తున్నది. చివరిగింజ వరకు కొంటాం.. ఆఖరి గింజను కొన్న తర్వాతే అన్నీ ముగిసినట్టు ప్రకటిస్తామని ప్రభుత్వ పెద్దలంతా ఆర్భాటం చేస్తున్నారే గానీ, మార్కెట్‌కు వచ్చిన ధాన్యానికి దిక్కు లేదు. వడ్ల కుప్ప దగ్గర పడిగాపులు కాస్తున్న రైతన్నను పట్టించుకున్న నాథుడే లేడు. అకాల వర్షాలు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుతో ఆ చివరి గింజే మిగిలుతుందేమో అన్న అనుమానం వస్తున్నది.
ఆరుగాలం పడ్డ కష్టమంతా కండ్లముందే కొట్టుకుపోతుంటే., పెండ్లాం పిల్లల గోస వరద రూపంలో కొట్టుకుపోతుంటే ఏడ్వటానికి కన్నీళ్లు లేని దుస్థితి. వడ్లు మడికట్టు దాటి, రోడ్డెక్కితే చాలు కొని తరలించేందుకు అన్నీ సమకూర్చుకున్నామని సర్కార్ పెద్దలు వరి కోతలకు ముందే విపరీతంగా మాటలతో కోటలు కట్టేశారు. అయితే ప్రభుత్వం మాటల్లో ఎంతటి ఆర్భాటం కనిపించిందో, ఆచరణలో మాత్రం అడుగు పడింది లేదు. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా, వరదలో కొట్టుకుపోతున్న గింజలే తెలియజేస్తున్నాయి. మార్కెట్‌కో, కొనుగోలు కేంద్రానికో తరలిన ధాన్యం మాయిశ్చర్ రావడం లేదనో, మరేదో సరికాదనో.. కొనేటోళ్లంతా కుప్పను తొక్కుకుంటూ వెళ్తుంటే ఎవరిని ఏమనాలో తోచక, అలమటిస్తున్న కర్షకుడి తీరు దయనీయం.
వానకాలం కోతలు, యాసంగి నార్లు పోసేయాళ్ల కాంగ్రెస్ సర్కార్ అన్నదాతకు ధాన్యం కొనుగోలు విషయం, సాగుకు చేయూతనిచ్చే ముచ్చట్లు మస్తు చెప్పింది. ఎంతైనా పండించండి, సన్నాలకు 500 బోనస్ ఇస్తాం.. అని ఆశ పెట్టి మరీ వరి సాగుకు ప్రేరేపించారు.
వడ్ల గింజ కూడా తరుగు పోవద్దని, అన్నదాత ఆనందంగా ఇంటికి చేరాలని సీఎం అండ్ టీం పబ్లిసిటీ, సాగుకు యంత్రాంగం కల్పించిన ప్రేరణతో యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా నాట్లు పడ్డాయి. దొడ్డు వడ్లు, సన్నాలు కలుపుకొని సుమారు 1.21 కోట్ల టన్నుల దిగుబడి లక్ష్యమని ప్రభుత్వం అంచనాలు కూడా వేసుకున్నది. స్వయంగా సర్కార్ పెద్దలే హామీలిస్తుంటే తమకొచ్చిన ఇబ్బంది ఏమిటని రైతులంతా నాట్లేశారు. భారీగా దిగుబడి సాధించారు. ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తుంటే సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. వచ్చే దిగుబడిలో ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు కలిపి సుమారు 50 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేస్తే మిగిలిన ఆ 70 లక్షల టన్నుల వరకు కేంద్రాల ద్వారా సేకరిస్తామని అధికారులూ అంచనాలు కట్టారు.
ఏప్రిల్ నెల నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్న సర్కార్ ధాన్యమంతా తామే ఉంచుకొని దొడ్డు బియ్యాన్ని మాత్రమే కేంద్రానికి ఇస్తామని భీష్మించుకున్నది. 35 లక్షల టన్నుల బియ్యం అంటే సుమారు 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయిస్తామని ఎఫ్‌సీఐ ప్రకటించినా ఆ మిగిలిన 70 లక్షల టన్నుల ధాన్యం కొనే దిక్కులేని దౌర్భాగ్యం. రోజూ కురుస్తున్న వర్షాలకు ఆరబోసిన ధాన్యం వరదపాలవుతుండగా, కంటిమీద కునుకు లేని అన్నదాత కొట్టుకుపోతున్న గింజలను దోసిళ్లతో ఆపుకొనే ప్రయత్నంలో విఫలమైపోతున్నాడు. అటు ప్రకృతి పగ, ఇటు కాంగ్రెస్ సర్కార్ దగా ముందు నిలువునా నీరవుతున్నాడు.
లెక్క తప్పితే మొదటికే మోసం అనే మాట మరిచినట్టుగా కనిపిస్తున్నది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా వరి సాగు ఎంత? దిగుబడి రాకడెంతా.? సమకూర్చాల్సిన అవసరాలేంటి., యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలేమిటనేది చూసుకోలేదు. అకాల వర్షాలకు అన్నదాత ఆగం కాకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లలో ఒక విజన్‌తో ముందుకెళ్లాల్సిన తరుణంలో అలసత్వం వహిస్తున్నది. కొట్టుకుపోగా మిగిలిన చివరి గింజలు కొంటాం అన్న చందంగా వ్యవహరిస్తున్నది.
-రాజేంద్రప్రసాద్ చేలిక