తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆహార, పోషకాహార భద్రత మొదలైనవి పటిష్ఠపరచడం నేల ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగాఢంగా విశ్వసించారు. అందుకే స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అదే సంవత్సరం 2014లో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ప్రపంచ నేల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) తీర్మానించింది.
మన ఆహార వ్యవస్థలకు భూమి పునాది. అంతేకాకుండా సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి, ఆహార భద్రతకు, వివిధ రకాల ఆహార పంటలకు విలువ జోడింపు భూమి నుంచే ప్రారంభమవుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 శాతం నేలలు సారవంతం కోల్పోయి క్షీణించాయి. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మట్టిని ఉత్పత్తి చేయడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. నేలలు సారవంతం కోల్పోవడం వల్ల గత 70 ఏండ్లుగా మనం పండిస్తున్న వివిధ ఆహార పంటల్లో పోషకాలు, విటమిన్ల లభ్యత తగ్గిపోయాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం కూడా పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వివిధ సూక్ష్మ పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా, 2050 నాటికి ప్రపంచ ఆహార డిమాండ్‌ను తీర్చడానికి మన వ్యవసాయ ఉత్పత్తులు సుమారు 60 శాతం పెరగాలి. భవిష్యత్తులో స్థిరమైన నేల నిర్వహణ ద్వారా 58 శాతం వరకు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తేనే ఆహార భద్రత కోసం పాటుపడవచ్చు. కాబట్టి నేలల సంరక్షణ, పర్యవేక్షణ తక్షణావసరం. ప్రపంచ ఆహార భద్రత, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది కుటుంబాల జీవనోపాధి, సమస్త భూమండలంపై నివసిస్తున్న మానవుల ఆరోగ్య శ్రేయస్సు తదితర అంశాలపై ప్రపంచ నేలల దినోత్సవం దృష్టిపెడుతుంది.
నేలల సంరక్షణ కోసం కేసీఆర్ విభిన్నమైన పథకాలను రూపొందించారు. భూమికి జీవసత్వాలు అందించడమే కాదు, సహజ వనరులను అభివృద్ధి పరుస్తూ జాతీయస్థాయిలో రైతు సంఘాల నాయకులు కూడా ఊహించని, రైతుకు అవసరమైన అనేక పథకాలను రూపొందించారు. తద్వారా రైతు బాంధవుడిగా కేసీఆర్ ప్రజలందరి మన్ననలు పొందారు. వ్యవసాయాభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి మూలంగా పదేండ్లలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2.38 కోట్ల ఎకరాలకు చేరింది. తెలంగాణ రాకముందు వానకాలంలోనే ఎక్కువగా పంటలు పండించేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్ సర్కార్ వచ్చాక మూడు కాలాల్లో విభిన్నమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రాష్ట్ర రైతులు చేరుకున్నారు. తద్వారా రాష్ట్ర సాగు విస్తీర్ణం 1.7 కోట్ల ఎకరాలకు పైగా (సుమారు 81.6 శాతం) పెరిగింది. 2014లో తెలంగాణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా, అందులో ఉద్యాన పంటల సాగు నామమాత్రమే. పాలిహౌజ్‌లు మచ్చుకైనా కనిపించేవి కావు.
2014-15 నాటికి తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి అది రికార్డు స్థాయిలో సుమారు 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2022-23 వరకు రూ.1.33 లక్షల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
మొదటి ప్రపంచ నేల దినోత్సవం జరుపుకొన్న తర్వాత మిషన్ కాకతీయ పథకానికి కేసీఆర్ అంకురార్పణ చేశారు. ఆ పథకం ద్వారా సుమారు రూ.5,349 కోట్లతో వేల చెరువులను పునరుద్ధరించారు. 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. అంతేకాదు, చెరువులలో పేరుకుపోయిన మట్టిని తీసి పంట పొలాల్లో చల్లి నేల సారవంతమయ్యేందుకు కృషిచేశారు. తద్వారా గ్రామీణ వ్యవసాయాన్ని పటిష్ఠపరిచారు.
ప్రజలు పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం స్వచ్ఛంగా ఉండాలంటే ముఖ్యంగా నేలలు ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ గ్రహించారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయిలో పెరిగింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఏకంగా 632 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. మొక్కలు నాటడం, వాటి పరిరక్షణపై కేసీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. పచ్చదనం గణనీయంగా పెరిగింది. పల్లె ప్రకృతివనాలు, పట్టణ ప్రకృతివనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అటవీ పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో అటవీ విస్తీర్ణం అమాంతం ఎగబాకింది. మరోవైపు బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్లో 1,423 చదరపు కిలోమీటర్లు, మధ్యప్రదేశ్‌లో 285 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. తెలంగాణలో మాత్రం అటవీ విస్తీర్ణం 2015లో 19,854 చదరపు కిలోమీటర్ల నుంచి 2023 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
సహజ వనరుల నిర్వహణ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అవలంబన కోసం వ్యవసాయ యాంత్రీకరణకు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేసింది. సుమారు రూ.963.26 కోట్లతో 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చి రైతాంగానికి అండగా నిలిచింది. అంతేకాదు, పండ్ల తోటల పెంపకం/ పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల సాగుకు పాలీహౌజ్‌ల నిర్మాణాలను ప్రోత్సహించింది. సుమారు రూ.1847.10 కోట్ల సబ్సిడీతో 7.79 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్య సాగుకు ప్రోత్సాహకాలు అందించింది. పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మార్కెట్ యార్డుల అభివృద్ధితోపాటు చేతికొచ్చిన పంటను సురక్షితంగా నిల్వ చేసేందుకు వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యం 39.01 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2023-24 నాటికి 73.82 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యానికి చేరుకున్నది. దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులకు రాని అద్భుత ఆలోచన, రైతు సంఘాల నేతలు కలలోనూ డిమాండ్ చేయని రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా పథకాలకు కేసీఆర్ రూపకల్పన చేశారు. ఈ పథకాల ద్వారా ఆయన తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు.
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున 11 విడతల్లో రూ.72.815 వేల కోట్లు అందించారు. రైతు బీమా పథకం ద్వారా 2022-23 వరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల బీమా పరిహారం చెల్లించారు.
రైతులు విత్తనాలు విత్తకముందే కావలసిన ఇన్పుట్లు కొనుక్కోవడానికి రైతుబంధు ద్వారా వీలు కలిగింది. అన్ని సమకూర్చుకొని రైతులు పంటలు బాగా పండించారు. అందుకే ఈరోజు దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది. ముఖ్యంగా పట్టణ వ్యర్థాలను ఇంధన వనరులు, ఎరువులుగా మార్చడం ప్రారంభించి నేల ఆరోగ్యాన్ని కాపాడారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించడం, వంటనూనె ఉత్పత్తిని పెంచడం పామాయిల్ సాగు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి, వంటనూనెల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని పామాయిల్ సాగును ప్రోత్సహించారు.
ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోని నియమించారు. ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ.572 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలను నిర్మించారు. నిత్యం రైతులకు కావలసిన నేల సంరక్షణ, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ, ఉత్పాదకత పెంపు, ఎక్కువ ఉత్పత్తి, పంట కోత అనంతరం జాగ్రత్తలు మొదలైన అంశాలపై రైతులకు శాశ్వత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన రైతు వేదికల నిర్మాణాలను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలని, ఆయన నాయకత్వంలో ప్రపంచ నేలల దినోత్సవం-2028 జరగాలని, ముఖ్యంగా వన్ హెల్త్ విధానంలో భాగంగా నేల, పశుసంపద- మానవ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించే విధంగా కేసీఆర్ తన ఆలోచనలకు పదును పెడతారని ఆశిద్దాం.