‘ముందుగా స్త్రీలకు విద్యనందించి, వారి స్వేచ్ఛ వారికివ్వండి. అప్పుడు తమకు అవసరమైన సంస్కరణలుఏమిటో వారే మీకు చెబుతారు. నాడు స్వామీ వివేకా నంద, నేడు మహిళా బంధుగా కేసీఆర్ స్ఫూర్తితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘రేపటి మహిళలు’ అన్న ఇతివృత్తంతో జరుపుకొంటున్నాం.
ఈ ప్రపంచాన్ని జీవించదగినదిగా, ప్రేమించదగినదిగా.. వర్ణమయం చేసింది నిస్సందేహంగా మహిళలే. ఐక్య రాజ్యసమి తి నివేదిక ప్రకారం 2021 సెప్టెంబర్ నాటికి ప్రపంచంలో 25 దేశాలు మహిళల పాలనలో వుండటం హర్షనీయం. నేటి సమాజంలో మహిళ లేని రంగం లేదు. రాజకీయ, కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కుతూ, అన్ని సంకెళ్ళనూ తెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
నిన్నటి వరకూ కేవలం ఇంటికీ, వంటకీ పరిమితమైన మహిళ, నేడు తనదైన అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అన్నింటిలో తానూ సగమని నిరూపించుకుంటున్నది. తమ ప్రగతిలో ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, వాటిని ఛేదించుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నది. సమాజంలో సగమైన మహిళలు ఇంకా ఎంతో పురోగతిని సాధించాల్సి ఉంది. మహిళల్లో వస్తున్న చైతన్యాన్ని గుర్తించి, వారి పురోగతిని కాంక్షించి ఎన్నో వినూత్న పథకాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్.
ఆయన ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, షి-టీమ్స్, తెలంగాణ బంగారు తల్లి, ఒంటరి మహిళలకు పింఛను పథకాలు సమర్ధవంతంగా అమలవుతున్నాయి. అన్ని రంగాల్లో మహిళకు ప్రాధాన్యం ఇచ్చి మహిళల పట్ల తనకున్న ఆదరణను, గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళల ప్రగతికి తన పథకాల ద్వారా పెద్ద పీట వేస్తున్నారు.
మహిళ కోసం ప్రభుత్వాలు ఎంత పాటుపడుతున్నా, సామాజిక కట్టుబాట్లు ఇంకా అడ్డుపడుతూ, సమాజంలో ఇంకా చోటు చేసుకోవలసిన సంస్కరణల అవసరాన్ని పట్టిచూపుతున్నాయి. మాకు మేమే సాటి అని ధైర్యం.. అందించే నేపథ్యంలో విద్యతో పాటుగా, సమాజంలో మార్పుకు తోడ్పడే విద్య, భావజాలం కావాలి. వాటిని పెంచాలని ఇంగ్లీషు భోధన పాఠశాల నుంచే విలువలను అందించి, వాటిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ‘రేపటి మహిళలు’ అన్న ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఇతివృత్తాన్ని మహిళలంతా అందిపుచ్చుకుని, సాకారం చేసుకునే స్ఫూర్తితో అడుగులు వేయాలి.
– అట్లూరి రమాదేవి
87906 02121
అవనిలోని అద్భుతం!
విశాల విశ్వాన్ని జయించింది అతడు అయితే, అతన్ని జయించింది ఆమె. అందుకే She లో he ని, woman లో man ని తనలో అతడిని దాచుకుంది ఆమె.
woman అంటే…
W- Wonderful mother
O- Outstanding friend
M-Marvelous Daughter
A- Adorable sister
N- Nicest gift to men
from god.. అన్నారు.
చెప్పడానికి నోరు, రాయడానికి భాష, వినడానికి
చెవు లు, అంతరంగాన్ని చూడటానికి కండ్లు చాలని ఓ మహిళా.. అవనిలోని అద్భుతం నువ్వు! నీకు శతకోటి వందనాలు!!
– నామాని సుజనా దేవి
కట్టుబాట్లను తెంచేస్తూ..
ఆడది నిద్రలేచాకే సూర్యుడికి తెలవారుతుంది. మానవ నాగరికతా వికాసంలో అన్నింటా ముందున్న స్త్రీ నేడు అడుగడుగునా అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నది. పురుషుడితో సమానంగా చదువుతున్నది, పోటీపడి సంపాదిస్తున్నది. ఎల్లలు దాటి ముల్లెలు పట్టుకొస్తున్నది. నాయకురాలిగా ,శాస్త్రవేత్తగా ఎన్నో రంగాల్లో ఆమె దూసుకుపోతున్నది. ఎంత పురోగతి సాధించినా స్త్రీలపై అనేక రకాల అణచివేతలు కొనసాగుతున్నాయి. హింసాదౌర్జన్యాలు పెరుగుతున్నాయి. ఈ దుస్థితి పోవాలి. మహిళ పెదవి మీద చిరునవ్వుల వెలుగులు విరజిమ్మాలి.
– తుమ్మల కల్పన రెడ్డి
96404 62142
గెలుపు తీరాలు ప్రతి మహిళ
అవకాశాలు లేవు అనుకోవడం కాదు, ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. అవకాశాలు సృష్టించుకొని క్రియాశీల నిర్ణయాలు తీసుకోగలగాలి. ప్రతి మహిళ తనలో ఉన్న శక్తిని గుర్తించగలగాలి. ‘ఎంపవర్మెంట్’అంటే.. పురుషులతో సమానంగా దుస్తులు ధరించడం, ఇంకేవో పనులు పనిచేయడం మాత్రమే కాదు. భాధ్యతలు తీసుకోవడం కూడా. మంచి ఆహరంతో ‘ఫిజికల్ ఫిట్నెస్’తో పాటు, ప్రతికూల పరిస్థితులకు కుంగి పోకుండా, విజయాలు సాధించినప్పుడు పొంగి పోకుండా ఉండాలి. ఆ సర్వవేళలా.. స్థితప్రజ్ఞతతో మానసిక ఆరోగ్యంతో ఉండాలి. చిన్నపిల్లపై జరుగుతున్న అత్యాచారాలతోనైనా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అన్నింటా సమానత్వం దిశగా సాగిపోవాలి. ఆకాశమే హద్దుగా గెలుపుతీరాలకు చేరాలి.
– పున్న విజయలక్ష్మి
మార్పునకు నాంది..
అంతర్జాతీయంగా మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన మరో సమస్య మానవ అక్రమ రవాణా. ఇందులో అధిక శాతం బాధితులు మహిళలే. ప్రపంచంలో డ్రగ్స్, ఆయుధాల సరఫరా తర్వాత అత్యధికంగా జరిగే నేరాలు మహిళల అక్రమ రవాణా. ఇది ఐదు మార్గాల్లో సాగుతుంది.
1) శ్రమ దోపిడీ, 2) లైంగిక దోపిడీ, 3) పునరుత్పాదక దోపిడీ, 4)మాదక ద్రవ్యాల రవాణా, 5) బిక్షాటన వీరిని సెక్స్ వర్కర్లులుగా, బానిసలుగా, బిచ్చగాలుగా, మాలిక్యూలర్ టెస్టింగ్ సంస్థలో ప్రయోగాలకు వాడుతున్నారు. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో మంది బాలికలు అపహరణకు గురవుతున్నారు .2016 లోనే 16వేల మంది తప్పిపోయిన అమ్మాయిల కేసులు నమోదయ్యాయి. ఈ ఆధునిక కాలంలో కూడా ఇలా జరుగటం విషాదం. దీన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా మహిళల అక్రమ రవాణా నివారణకు ప్రతినబూనుదాం.
-డాక్టర్ ఎస్. నాగవాణి
(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ
మహబూబాబాద్ జిల్లా)
మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
మన సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో లింగవివక్ష తీవ్రమైనది. మహిళలు అడుగడుగునా నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు నేటికీ మహిళలకు అందని ద్రాక్షలాగే ఉన్నాయి. విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయం వంటి అంశాల్లో మహిళలను మన సమాజం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
ఈ వివక్ష , లింగ అసమానతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు వినూత్న రీతిలో అనేక పథకాలకు రూపకల్పన చేశారు సీఎం కేసీఆర్. మహిళాభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ ప్రాధాన్యతా అంశాలుగా కేసీఆర్ పాలన సాగుతున్నది. సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ.
మహిళల సంక్షేమం, అభివృద్ధికోసం కేసీఆర్ తెచ్చిన పథకాలు మహిళా సాధికారత సాధించటంలో భూమికగా మారాయి. మహిళల రక్షణకోసం ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ర్టాల్లో ‘షీ టీమ్’ లను ఏర్పాటు చేయటం గమనార్హం. మహిళల సహాయార్థం సఖి కేంద్రాలతోపాటుగా అన్ని జిల్లాలో భరోసా కేంద్రాలను ప్రారంభించింది. లింగవివక్షలేకుండా పురుషులకు ధీటుగా మహిళల అభివృద్ధి పట్ల కేసీఆర్ చూపిస్తున్న ప్రాధాన్యం అనుసరణీయం, ఆదర్శం.
-ప్రొఫెసర్ తాటికొండ రమేష్, ఉపకులపతి, కాకతీయ యూనివర్సిటి)
మహిళా సాధికారత
విద్య ద్వారా మహిళా సాధికారతకు దారితీసే మార్గాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో వేశారు. అయితే స్త్రీ సాధికారత కేవలం ఆర్థిక స్వతంత్రం ద్వారా మాత్రమే కాదు, బహుముఖ సంక్షేమ అభివృద్ధి పథకాలే స్త్రీ స్థితిని మెరుగుపరుస్తాయనటంలో సందేహం లేదు.
గతంలో ఆడపిల్లల విద్య ప్రాథమిక, మాధ్యమిక విద్యకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య పొందే అవకాశాలు లేకుండా పోయాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల కు చెందిన బాలికలు సౌకర్యాల కొరత కారణంగా అవకాశాలు చాలా నష్టపోయారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యా విధానంతో చేసిన అలుపెరగని ప్రయత్నాలతో ఎక్కువ సంఖ్యలో గురుకులాలు ఏర్పడ్డాయి. మహిళల కోసం 38 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయటం ఉన్నత విద్యా రంగంలో బాలికల విద్యలో భారీ మార్పు వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యార్థినుల కోసం ఇంత భారీ సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయలేదన్నది వాస్తవం. 518 గురుకులాల్లో 2,50,000 మంది బాలికల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ. 3000 కోట్ల బడ్జెట్ను వెచ్చించటం గమనార్హం. తెలంగాణలో మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వ గురుకులాలు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల తరుపున అభినందనలు.
– డాక్టర్ సత్య శ్రీదేవి దాట్ల
9949500463