Donald Trump | న్యూఢిల్లీ, జనవరి 8: గ్రీన్‌లాండ్‌ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే దశాబ్ద కాలంగా సైనిక పాలనలో ఉన్న డానిష్ సైనికులు ముందు కాల్చులు జరిపి ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతారు. ఇది డెన్మార్క్ చేసిన హెచ్చరిక కాదు. 1952లో చేసిన నిబంధన. ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా తక్షణమే శత్రు సేనలపై కాల్పులు జరపాలన్నది డానిష్ సైనికులకు అమలులో ఉన్న ఆదేశాలు.
ప్రాంతంలో రష్యా, చైనా సేనల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే తన ఆకాంక్షను బయటపెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ నిబంధనను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
1952లో చేసిన నిబంధన ప్రకారం దురాక్రమణ జరిగిన సందర్భంలో పైస్థాయి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా శత్రు సైనికులపైకి డెన్మార్క్ సైనికులు ఏమాత్రం ఆలోచించుకోకుండా వెంటనే కాల్పులు ప్రారంభించాలి. ఈ నిబంధన ఇప్పటికీ అమలులో ఉందని డానిష్ రక్షణ శాఖ బుధవారం డానిష్ వార్తాపత్రిక బెర్లింగ్స్కేకి ధ్రువీకరించింది.
ఇటీవలి కాలంలో గ్రీన్‌లాండ్‌ను కొనడం ద్వారా లేక బలప్రయోగం ద్వారా చేజిక్కించుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్లాండ్ అమెరికాకు చాలా అవసరమని అమెరికా అధ్యక్షుడు వాదిస్తుండగా స్వయంపాలిత భూభాగమైన గ్రీన్‌లాండ్‌ని కొనుగోలు చేయడం గురించి ప్రస్తుతానికి ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం తీవ్రంగా చర్చిస్తున్నట్లు వైట్‌హౌస్ కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధ్రువీకరించారు.
గ్రీన్లాండ్ సార్వభౌమాధికారాన్ని సమర్థించే విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, డెన్మార్క్‌కు చెందిన ఏడు దేశాల యూరోపియన్ నాయకులు మంగళవారం ప్రకటించారు.