ముంబై : ఇటీవలే భారత్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అమ్మాయిల విన్యాసాలను మరిచిపోకముందే మరో మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. భారత మహిళా క్రికెట్ గతిని మార్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు వేళైంది. శుక్రవారం (జనవరి 08) నుంచి ఈ టోర్నీ 4వ సీజన్ షురూ కానుంది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్లను రికార్డు ధరలకు దక్కించుకున్న ఫ్రాంచైజీలు.. ఇక టైటిల్ వేటలో ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. సుమారు నెల రోజుల (జనవరి 08 నుంచి ఫిబ్రవరి 05 దాకా) పాటు వివిధ దేశాల మహిళా క్రికెటర్లు ఫ్యాన్స్‌కు పసందైన క్రికెట్ మజాను అందించబోతున్నారు. ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ కూడా (జూన్-జులైలో) ఉన్న నేపథ్యంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి యువ క్రికెటర్లకు ఈ టోర్నీ ఒక సువర్ణావకాశం.
ఈసారి డబ్ల్యూపీఎల్ రెండు వేదికల్లో జరుగనుంది. టోర్నీలో ఐదు జట్లు 22 మ్యాచ్‌లు (20 లీగ్, ఎలిమినేటర్, ఫైనల్) జరుగనుండగా తొలిదశ 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా తర్వాత దశలో మ్యాచ్‌లు వడోదరలో జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. డబుల్ హెడర్స్ (జనవరి 10, 17న)ను మినహాయిస్తే మిగతా మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి.
నాలుగు సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో టైటిల్ వేటలో ఉండగా చివరి మూడు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారైనా ఫైనల్ గండాన్ని దాటి కప్పును ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈసారి ఆ జట్టు మెగ్ లానింగ్‌ను తప్పించి యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇక యూపీ వారియర్స్ కూడా జట్టులో కీలక మార్పులు చేసుకుని లానింగ్‌ను సారథిగా నియమించుకుంది. ఢిల్లీకి టైటిల్ అందివ్వలేని ఈ ఆసీస్ మాజీ దిగ్గజం.. యూపీ కలను నెరవేరుస్తుందా? లేదా? అన్నది చూడాలి. తొలి రెండు సీజన్ల కంటే నిరుడు మెరుగ్గానే రాణించిన గుజరాత్ జెయింట్స్‌ను ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ ఏ మేరకు నిలబెడుతుందనేది ఆసక్తికరం. ఇక రెండో సీజన్లో కప్పు కొట్టిన ఆర్సీబీ.. నిరుడు దారుణంగా నిరాశపరచగా ఈ సీజన్లో మాత్రం ట్రోఫీయే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.