దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధికి గీటురాయి ఏమంటే.. ఆయా దేశాల్లో, రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానమే. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలిచింది. కానీ, అబద్ధాల ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. నేడు విద్యారంగాన్ని వినాశనం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించక, సరైన పర్యవేక్షణ లేక మొత్తం విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 29,268 సర్కార్ పాఠశాలలు ఉండగా.. ఆ సంఖ్యను కేసీఆర్ 30,022కు పెంచారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలోనూ వెల్లడైంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కేసీఆర్ కల్పించారు. దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగింది. అనేక సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, రెండు జతల బట్టలు, పుస్తకాలూ పేద విద్యార్థులకు అందించింది. ఈ పథకాన్ని తమిళనాడు కూడా అమలు చేసింది.
విదేశీ విద్య ఉన్నత వర్గాలకు మాత్రమే కాదు, పేద విద్యార్థులకు కూడా అందాలని నాడు కేసీఆర్ సంకల్పించారు. విదేశీ విద్యానిధి పథకం ద్వారా లక్షల మంది విద్యార్థులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. దీన్ని కొనసాగిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేసీఆర్‌ను గుర్తుపెట్టుకుంటారనే అక్కసుతో ఈ పథకాన్ని రేవంత్‌రెడ్డి నిలిపివేశారు. తద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల ఆశలను సమాధి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బకాయి పెట్టిన రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బీఆర్ఎస్ సర్కారు చెల్లించింది. అంతేకాదు, పదేండ్లలో రూ.24 వేల కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేటాయించింది. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చదివిన 94 మందికి ఢిల్లీ ఐఐటీలో సీట్లు వస్తే.. రేవంత్‌రెడ్డి వచ్చాక 90 మంది విద్యార్థులు చనిపోయారు. జిల్లాకో మెడికల్ కాలేజీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2,700 మెడికల్ సీట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మౌలిక సదుపాయాలు లేవని జాతీయ వైద్య విధాన మండలి తెలంగాణ సర్కార్‌కు నోటీసులు ఇవ్వడమే అందుకు కారణం.
విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్న రేవంత్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న అధికారులు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ‘విద్యార్థులతో టాయిలెట్లు కడిగిస్తే తప్పేమిటి? అని సంక్షేమ గురుకుల ఉన్నతాధికారి మాట్లాడారు. వసతులు కల్పించకుండా విద్యార్థులతో పనులు చేయిస్తే, వారి చదువులపై ప్రభావం చూపదా? ఇదీ విద్యా విధానంపై సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి. విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవడం ఎంత సత్యమో.. ధ్వంసం చేసిన వ్యక్తిగా సీఎం రేవంత్ చరిత్రలో మిగిలిపోవడం అంతే సత్యం.