అందరిని కొన్నిసార్లు మోసగించవచ్చు. కొందరిని అన్నిసార్లూ మోసగించవచ్చు.. కానీ అందరినీ, అన్నిసార్లూ మోసగించలేం అనేది నానుడి. తెలంగాణ గ్రామాల్లో ఎగసిపడుతున్న తిరుగుబాట్లకు ఇది చక్కగా వర్తిస్తుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ జిత్తులమారి హామీలను ఎక్కువగా నమ్మింది అమాయక గ్రామీణ ప్రజలే. ఇప్పుడు మోసపోయి గోసపడుతున్నామని తెలుసుకున్నదీ వారే. తగుదునమ్మా అంటూ కాంగ్రెస్ సర్కారు పెడుతున్న గ్రామసభల్లో తిరగబడి విరగబోట్లు పొడుస్తున్నదీ ఆ గ్రామీణులే. ‘పల్లెలెట్లా కదుల్తున్నయంటే’ అన్నట్టు తయారైంది పరిస్థితి. రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం, అదీ తూతూమంత్రంగా జరిపిన గ్రామసభలు ప్రజాగ్రహ వ్యక్తీకరణకు వేదికలు కావడం చూస్తున్నాం. ఊరూరూ సర్కారు పెద్దలపై, అధికార్లపై ప్రజలు మర్లవడుతున్నారు. ఎంపికలే ఎజెండా అయినప్పటికీ కోతలపై, ఎగవేతలపై గ్రామీణులు భగ్గుమంటున్నారు. మంత్రులను నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ను ప్రజలు తరిమివేశారు. రెచ్చిపోయిన ప్రజలు ఒకచోట టెంట్లు పీకేస్తే, మరోచోట అధికారిపై చేయిచేసుకునే దాకా పోవడం ప్రజల్లో రగులుతున్న కోపానికి నిదర్శనం. దాంతో గ్రామసభలు రసాభాసగా మారి బాహాబాహీలతో సంగ్రామసభలుగా పరిణమిస్తున్నాయి. మొదటిరోజు కన్నా రెండోరోజు, అదీ పోలీసు పహారా మధ్యన నిరసనల తీవ్రత పెరగడం గమనార్హం.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు సర్కారు హామీలు చట్టుబండలయ్యాయి. అమలు కాని గ్యారెంటీలపై ఎవరిని, ఎక్కడ, ఎలా అడగాలో తెలియక ఇన్నాళ్లుగా తికమక పడుతున్న గ్రామీణులకు ఈ సభలతో ఒక మంచి అవకాశం దొరికినట్టయింది. ఏడాదికాలంగా సర్కారుపై వారిలో గూడుకట్టుకున్న ఆగ్రహం ఈ సభల్లో కట్టలు తెంచుకున్నది. ఓ పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘నేను ఎంపిక చేసినోళ్లే లబ్ధిదారులు అవుతారని’ మీసం మెలేసి చెప్తుంటే ఇంకా ఈ సభలు ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిలదీస్తుండటం గమనార్హం. ఎంపికల్లో అవకతవకలను ప్రజలు ఎండగడుతున్నారు. అర్హులను వదిలేసి అస్మదీయులను ఎంపిక చేసేటట్టయితే ఈ తతంగమంతా దేనికి అనేది వారి వాదన. చాలాచోట్ల ప్రజలు లబ్ధిదారుల ఎంపిక సంగతి పక్కన పెట్టి గ్యారెంటీల గురించి ఒక్కుమ్మడిగా నిలదీయడంతో పాలక పక్షీయులు ఊపిరాడక సతమతమయ్యారు. కల్యాణలక్ష్మికి తులం బంగారం ఎప్పుడు జతచేస్తరు? రుణమాఫీ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వారికి తెలిస్తే కదా చెప్పడానికి. ప్రశ్నించినవారిపై పోలీసు జులుం ప్రయోగించడం, రైతుభరోసాపై నిలదీసిన రైతులను బయటకు నెట్టేయడం ఏ తరహా ప్రజాపాలనో అర్థం కావడం లేదు. ఆందోళనలతో గ్రామసభలను అర్ధాంతరంగా ముగించాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
స్థానిక కాంగ్రెస్ నేతలకే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ నిరసన సెగలు తప్పలేదు. పొట్టచేతపట్టుకుని వేరే ఊరికి వలస పోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అంటున్నారు. మూడంచెల్లో ఇలాంటి అలవిమాలిన అర్హతలతో వడపోస్తారట. ఇక రేషన్ కార్డుల ప్రహసనం వేరే సంగతి. గొరగంగా మిగిలిం ది జుట్టు అన్నట్టు 6.6 లక్షల మందికే కార్డులిస్తారట. మిగిలినవారి గతి ఏమిటి? ప్రజాపాలన పేరిట సేకరించిన దరఖాస్తుల మాటేమిటి? ఆత్మీయ భరోసా కూడా అరకొరగానే అమలు అవుతుందనేది తేలిపోయింది. లబ్ధిదారుల సంఖ్య ఎలాగైనా తగ్గించేందుకే సర్కారు నానా కొర్రీలు పెడుతున్నది. మరోవైపు అన్ని నియమాలూ తుంగలో తొక్కి తమవారికే కట్టబెట్టేందుకు బరితెగిస్తున్నది. ఆపై కంటితుడుపుగా గ్రామసభలు పెడితే ప్రజలకు కోపం రాకుండా ఉంటుందా? ప్రభుత్వానికి శాపం కాకుండా ఉంటుందా?