ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ అనుయాయులు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటుంటే తెలంగాణ సమాజం మాత్రం స్తబ్ధుగా ఉంది. సీఎం ప్రసంగాల్లో ఎన్ని కాకి లెక్కలు చెప్పినా ఎవరూ సీరియస్గా తీసుకున్నట్లుగా లేదు. రేవంత్ మాటలు ఎప్పుడైనా ఇంతే.. చేయని విషయాలపై కూడా గట్టిగా, పరుష పదాలతో, మాయమాటలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తారు కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయని తెలిసిన ప్రజలు ఆయన్ని పట్టించుకున్నట్లుగా లేదు. తెలిసో, తెలియకో ఓట్లేసిన పాపానికి ఈయన్ని భరించక తప్పదనే నిర్వేదం ప్రజల్లో పెరుగుతోంది.
ఎన్నికల్లో మీరిచ్చిన హామీలేవి? వాటిని ఏ మేరకు అమలు చేశారు? అనే ప్రశ్నలు, ఆరు హామీలు.. వంద రోజులు అనే పడికట్టు మాటలు కూడా పాతబడ్డాయి. నడుమనే కాడి ఎత్తేసినట్లు రైతు రుణమాఫీ అయిపోయిందన్నారు. జూలై 18న మొదటి విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తూ ఆగస్టు చివరి నాటికి 40 లక్షల రైతు ఖాతాల్లో రూ.31 వేల కోట్లు జమ చేస్తామన్న మాట ఉత్తదైపాయె. ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కనీసం విలువ కూడా ఉండదా? చివరి విడత అంటూ ఈ నెల ఒకటిన రూ.2,747 కోట్లు విడుదల చేసి, మొత్తం రూ.21 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి అయిపోయిందని ఆ ఫైల్ మూసేశారు. మాఫీ అందని రైతుల గగ్గోలుకు సర్కారు చెవులు మూసుకుంటోంది.
రైతు భరోసా కన్నా వడ్లకిచ్చే బోనస్ బాగుందని రైతులు తమతో అంటున్నారని ముఖ్యమంత్రి, సాగు మంత్రి ఈ మధ్య కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆ రెండు కూడా విడిగా ఇచ్చిన హామీలు. అవి కలిసిపోయే ప్రమాదం ఇప్పుడు కనబడుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటు న్నారు. అది కచ్చితమైన కాల వ్యవధి కాదు. రుణమాఫీ మాదిరే ఉద్యోగాల భర్తీలో కూడా అబద్ధాలే ఎక్కువయ్యాయి. 2023 నవంబర్ 30న నమూనా జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఉద్యోగార్థుల నుంచి అప్లికేషన్ ఫీజు కూడా వసూలు చేయబోమని నాడు అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక 2023 డిసెంబర్ 12న సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఫిబ్రవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను 2024 డిసెంబర్లోగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీజీపీఎస్సీ కొత్త బోర్డు ఏర్పడగానే నోటిఫికేషన్లు వస్తాయన్నారు.
ఫిబ్రవరి 1న ఎల్బీ స్టేడియంలో 6,956 నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను పంచి వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. నిజానికి ఆ నోటిఫికేషన్ 2023 ఫిబ్రవరిలో వచ్చింది. అదే ఏడాది ఆగస్టు 2న పరీక్ష జరిగింది. 2023 డిసెంబర్ 18న పరీక్ష ఫలితాలు వచ్చాయి. అలా గత ప్రభుత్వ హయాంలో మొదలైన నియామక ప్రక్రియను కలుపుకొని తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేశామని చెప్పుకొంటున్నారు.
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఆగస్టు 2న వచ్చింది. దానికి జాబ్ క్యాలెండర్ 2024-25 అని పేరు పెట్టారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 జూన్ దాకా 20 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని అందులో ఉంది. అందులో ఏయే పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఉందే తప్ప పోస్టుల సంఖ్యను తెలుపలేదు. 2024 డిసెంబర్ నాటికి విడుదలయ్యే నోటిఫికేషన్లు నాలుగే ఉన్నాయి. అవి గ్రూప్ 1, 2, 3, మెడికల్ డిపార్టుమెంటు ఉద్యోగాలకు సంబంధించినవి. మిగితావి 2025 జనవరి నుంచి 2025 నవంబర్ దాకా సాగుతాయి. తెలివిగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజున దీన్ని విడుదల చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని విపక్షాలు నిలదీయకుండా జాగ్రత్త పడ్డారు. జాబ్ క్యాలెండర్ గురించి చర్చించేందుకు అసెంబ్లీలో స్పీకర్ తనకు మైక్ ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. చివరకు అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఉద్యోగ భర్తీ తప్పుడు లెక్కలను ఆయన ఎండగట్టారు.
రైతు భరోసా కన్నా వడ్లకిచ్చే బోనస్ బాగుందని రైతులు తమతో అంటున్నారని సీఎం, సాగు మంత్రి ఈ మధ్య కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆ రెండు కూడా విడిగా ఇచ్చిన హామీలు. అవి కలిసిపోయే ప్రమాదం ఇప్పుడు కనబడుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటున్నారు. అది కచ్చితమైన కాల వ్యవధి కాదు. రుణమాఫీ మాదిరే ఉద్యోగాల భర్తీలో కూడా అబద్ధాలే ఎక్కువయ్యాయి.
ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగిన సభలో ఒక్క ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే లేదని ముఖ్యమంత్రి పేర్కొంటూ గుజరాత్ ప్రస్తావన తెచ్చారు. నిజానికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే లెక్కలు మనకు అనవసరం. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న కాంగ్రెస్ హామీ ఏమైందనే ప్రశ్నకు సీఎం సమాధానం చెబితే చాలు. దాన్ని దాటవేసేందుకే ఈ గారడీ మాటలు. ప్రధాని మోదీని ప్రత్యేక విమానంలో రప్పించి సచివాలయంలో కూర్చోబెట్టి లెక్కలు మాట్లాడుకుందామా? అని సవాలు విసరడంలో ఏమైనా అర్థముందా? దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య ఉండే ప్రోటోకాల్ గౌరవమైనా పాటించాలి.
తన తప్పును దాచిపెట్టేందుకు పెద్దపల్లి సభలో సీఎం ఒక సామెత కూడా చెప్పారు. బలమైన పిల్లవాడికి పెళ్లి చేసినంత మాత్రాన ఒక్క రోజులో పిల్లాడిని కనలేడు కదా అని. ఈ నేపథ్యంలో వంద రోజుల్లో హామీలు నెరవేర్చుతామని మాట ఇచ్చే రోజున ఈ సామెత గుర్తుకు రాలేదా? అని జనం అడుగుతున్నారు.
రేవంత్ ఏడాది పాలన ఎలా ఉందనే విషయమై ఓటా అనే సంస్థ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 దాకా సర్వే చేసి ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఆరు గ్యారెంటీల్లో కొన్ని మాత్రమే అమలవుతాయని 62 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే రాష్ర్టానికి రేవంత్ కన్నా కేసీఆర్ పాలనయే అవసరమని 9 శాతం ఎక్కువ మంది అంగీకరించారు. ‘రానున్న స్థానిక సంస్థల్లో మీ ఓటు ఎవరికీ?’ అని అడిగితే 4 శాతం ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి ఏడాది పాలన, హామీల అమలుపై విస్పష్టమైన సర్వే జరిపి నిజాలు ప్రజల ముందు ఉంచే అవసరం ఎంతైనా ఉంది.