నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వంసానికి తట్టుకొని రూపాంతరం చెందుతూ ముందుకు సాగేదే మానవ చరిత్ర. ఇది ఇలా ఉందేమి, ఇలా ఉండకూడదనే ప్రశ్నలు కాలం చెల్లినవే. వర్తమానమే ముఖ్యం.
ప్రపంచంలో వార్తా ప్రసార వ్యవస్థలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సాంకేతికత పెరిగి ఇంటర్నెట్ ద్వారా చదివినా తరగనంత సమాచారం అం దుబాటులోకి వచ్చింది. కొన్ని పత్రికలు నెట్లోనే సంచికలు విడుదల చేస్తున్నాయి. పత్రికల్లో పనిచేసినవారు, వాటితో పొసగనివారు, కాలమిస్టులుగా పనిచేసినవారు సొంత యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. కొందరు కేవలం తమకున్న అవగాహన ను నమ్ముకొని నెట్ పత్రికలు, వార్తాఛానళ్లు పెట్టుకుంటున్నారు. వారు కూడా వార్తల సేకరణకు పెన్ను, మైకు పట్టుకొని అవసరం ఉన్న చోటికి వెళ్తున్నారు. ఇలా సమాచార ప్రసారరంగం అవసరాన్ని మించి విస్తృతమైంది. మంచి చెడు అనేది సర్వత్రా ఉన్నట్టే ఇందులో కూడా ఉంది. క్షీరనీర న్యాయమే దీనికి పరిష్కార మార్గం.
పత్రిక ప్రచురణ అంటే భారీ బడ్జెట్‌తో కూడుకున్న పని. సర్క్యులేషన్ పడి పోతు న్న క్రమంలో ప్రకటనల ఆదాయం కూడా అంతంతే. పత్రికలపై రాజకీయ నాయకుల ఆధిపత్యం పెరిగి వారి అవసరాల వైపు మొగ్గక తప్పడం లేదు. మరోవైపు ప్రజల్లో రాజకీయాల పట్ల ఆసక్తిలో సీరియస్ నెస్ తగ్గిపోయి ఓ టైం పాస్‌గా మారిపోయింది. జనం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సమాచార ప్రపంచాన్ని పిడికిట్లోకి తెచ్చింది. చూసిన వెంటనే తోచిన కామెంట్లు పెట్టవచ్చు. ఈ దశలో ఏ మాత్రం జర్నలిస్టు బుర్ర ఉన్న వారైనా ఉన్నదీ లేనిదీ కలిపి కొట్టి ఓ ఛానల్ నడపవచ్చు. చిన్న నిప్పు కనబడ్డా పొగ రాజేయడమే వీరి పని. ఇలా బతికేవారిని ఉన్నతస్థాయిలో ఉన్నవారు పట్టించుకొనే అవసరం లేదు. ‘ఏనుగు నడుస్తుంటే..’ అన్న హుందాతనం కనబరచాలి.
మీడియా పరిస్థితులు ఇలా ఉండగా ఈ మధ్య మన సీఎం రేవంత్ ఒక పత్రిక సమావేశంలో జర్నలిస్టులపై తన అక్కసును వెళ్లగక్కారు. ‘సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలు వేసుకొనే ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. రోడ్ల మీద తిరి గేవాళ్లు జర్నలిస్టులమని చెప్పుకొంటున్నారు. పేరుకు ముందు జర్నలిస్టు అని ఇం టిపేరులా వాడటానికి వారి తాత ముత్తాతలు ఏమైనా జర్నలిస్టులా? ఇలా కనీస అర్హత లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నవాళ్లను సీనియర్లే పక్కనపెట్టా లి’ అని అన్నారు. ఈ మాటల్లో ఎన్నో ఆక్షేపణీయాలు, అంగీకారాలున్నాయి. అయి తే తన హయాంలో కొనసాగుతున్న ఈ దారి తప్పిందనే విధానాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఆయనే పరిష్కరించాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రెస్ అకాడమీకి తగిన సూచనలు చేయవచ్చు. సమాచార చట్టం నిబంధనలను, రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని దాటినవాళ్లపై ప్రభుత్వమే చర్చలు తీసుకోవచ్చు. ఈ సమస్య నుంచి రాష్ర్టాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై నే ఉన్నది. వీరిపై చట్టపర చర్యల ద్వారా రేవంత్ రెడ్డికే కాకుండా మిగతా నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది.
‘జర్నలిస్టు కాలు మీద కాలేసుకుని’ అనే మాట పూర్తిగా అభ్యంతరకరమే. ఓనమాలు తెలిసినవారు కూడా కాలు మీద కాలేసుకొనే కూర్చొని ప్రశ్నలు సంధిస్తారు. అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. బానిస మాత్రమే చేతులు కట్టుకొని వంగి నిలబడతాడు.
రాష్ర్టానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ముందు ఏ పౌరుడూ బానిస కాదు. తన ప్రజల్లో భాగమైన కొందరికి తన ముందు కాలు మీద కాలేసుకుని కూర్చొనే అధికారం లేదనడం సరికాదు. సంభాషణల వివరాలు రాసుకోవడానికి ఆ భం గిమ అనుకూలమని, అందుకోసం ఎవరి ముందైనా విలేకరులు అలా కూర్చోక తప్పదని ఒకరు స్పష్టతనిచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎవరెవరు ఆయన ముందు అలా కూర్చొని ప్రశ్నలు వేశారో అనే చిత్రాలు సోషల్ మీడియా లో వస్తున్నాయి. ‘అలా కూర్చున్నవాళ్లను కొట్టాలనిపిస్తుంది’ అనడం మరీ దారు ణం. కొట్టేంత కసి వ్యక్తిపైనా లేక వారు అడిగే ప్రశ్నపైనా అనే స్పష్టత అవసరం. ప్రశ్నలో తప్పుంటే సరిచేయవచ్చు. దానికి తగిన సమాచారం లేకపోతే తెలుసుకో వచ్చు. ఇచ్చిన హామీల్లో తప్పిదాలు ఎత్తిచూపితే సంయమనంతో సమాధానం ఇయ్యాలి. బ్యాంకు లోన్ మాఫీ కాక అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కొడు కును తలచుకుంటూ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్న తల్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఉంది. ఆమె వేదనలో ఉన్న ఓనమాలు ముందు ప్రభుత్వానికి అర్థం కావాలి.
ఇలా కాలు మీద కాలు వేసుకొనేవాళ్లను సీనియర్ విలేకరులు పక్కన పెట్టాలన్నారు. వీరిలో వీరికి గొడవలు పెట్టడమెందుకు, ఆ పక్కకు పెట్టే విధానాన్ని ముఖ్యమంత్రి పరివారం చూసుకోవాలి. ఇందుకోసం వారికి ఉన్న అధికారాలను వినియోగించాలి. ఇక భాష విషయంలో పాఠాలు మన నేతల దగ్గర నేర్చుకొనే స్థాయిలో విలేకరులెవ్వరూ లేరని చెప్పవచ్చు. రాజకీయ నేతలపై విమర్శ నెహ్రూ కాలం నుంచే ఉన్నది. ఆ విమర్శ వెనుక ఉన్న కారణాన్ని వారు వెతికారు తప్ప విమర్శను తప్పుపట్టలేదు. ‘అ, ఆ’లు కూడా రాని జర్నలిస్టులను ఓనమాలు తెలిసిన నాయకులు ఎదుర్కోవడం కష్టమైన పని కాదు. అర్థం లేని ప్రశ్నలకు నేతల పరిపక్వతే సరైన అస్త్రం. అయితే అడిగే ప్రశ్నకు జవాబు లేకపోవడమే అసలు సమస్య.