రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. 2015 అక్టోబర్ 22న అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో కేసీఆర్ ఏం మాట్లాడుతారా? అని అందరూ ఎదురుచూడసాగారు. అప్పుడు కేసీఆర్ ‘ఒకే శరీరానికి రెండు కండ్లు తెలంగాణ, ఆంధ్ర’ అని అన్నారు. ఆ మాట అన్నది మొదలు..అప్పటి నుంచి మా నాయకుడు కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రజలు అదే భావనతో ఉన్నాం.
‘ప్రాంతాల వారీగా వేరవుదాం. అన్నదమ్ములుగా కొనసాగుదాం’ అని మా నాయకుడు కేసీఆర్ కూడా ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెప్పారు కూడా. రాష్ర్టాల మధ్య సోదరభావాన్ని మా నాయకుడు కేసీఆర్ ఎల్లప్పుడూ కోరుకొన్నారు. ఎందుకంటే, ఈ రెండు రాష్ర్టాల బలాలేమిటో, తెలుగు రాష్ర్టాలు కలిసి పనిచేస్తే ప్రజలకు జరిగే ప్రయోజనమేమిటో కూడా కేసీఆర్‌కు తెలుసు. అయితే, రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణలు కూడా చెప్తాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే.. తల్లిని చంపి బిడ్డను బతికించారని, తలుపులు మూసి రాష్ర్టాన్ని విభజించారని గత 12 ఏండ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు.
విభజన బిల్లును మరింత మెరుగ్గా తీసుకురావడానికి గడిచిన పన్నెండేండ్లలో ఎన్ని సవరణలు చేశారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. దీనికి సంబంధించి నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. ఆ రికార్డుల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు సవరణలు మాత్రమే చేశారు. మొదటి సవరణలో ఏంచేశారో తెలుసా? తెలంగాణలోని ఖమ్మం నుంచి 7 మండలాలను విడదీసి ఏపీలో కలిపారు. దీనికి మా ప్రభుత్వం నుంచి అనుమతిని కూడా తీసుకోలేదు. అసెంబ్లీలో అసలు చర్చే జరుగలేదు. జబర్దస్తీతో ఏపీలో కలిపేశారు. మా అనుమతి లేకుండా ఏపీకి ఇచ్చిన ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణకు వెనక్కి ఇవ్వాలని ఇప్పుడు నేను అడుగుతున్నా.
మహాభారతంలో పాండవులు నాడు ఐదు ఊళ్లు అడిగినట్టుగా నేడు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపాలని అభ్యర్థిస్తున్నా. భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఈ ఐదు గ్రామాలు తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయి. భద్రాద్రి రామాలయ భూములు ఆ గ్రామాల్లోనే ఉన్నాయి. ఏపీ ప్రగతి పథంలో సాగాలని, అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకొంటున్నాం. అయితే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బిల్లుగా మార్చవద్దని ఈ సందర్భంగా కోరుకొంటున్నా.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ.. దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా మా నాయకుడు కేసీఆర్ తీర్చిదిద్దారు. ఇక్కడ కూర్చున్న ప్రతీ మంత్రి, వారికి సంబంధించిన అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా మారాలని మా నాయకుడు కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వరిని పండిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని ఆ రోజు బడ్జెట్లో మీరే చెప్పారు. దానికి కారణం తెలంగాణే. వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంతో ఈ రికార్డు సాకారమైంది.
కేంద్రప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందకపోయినా.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు చాలా ఆవేదనతో కొన్ని మాటలు చెప్తున్నా.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆ రోజు ఏమన్నారు అధ్యక్షా..? లక్ష కోట్లు నీటిలో ఒక్కసారిగా కొట్టుకుపోయాయని అంటారా?? ఇది ముమ్మాటికీ సభను తప్పుదోవ పట్టించడమే! ఈ క్రమంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమిటో ఈ సభ ద్వారా యావత్తూ ప్రజానీకానికి నేను చెప్పదలుచుకొన్నా. కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు.. అది మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 15 వేల కిలోమీటర్ల పైప్లైన్లు, 25 టన్నెళ్లు, ఇంకా మరెన్నో సబ్స్టేషన్లతో కూడిన అతిపెద్ద వ్యవస్థ.
అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల కేవలం ఒకే ఒక్క వానతో ఆ బరాజ్‌లోని కేవలం రెండే రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. దానిని రిపేరు చేయడానికి కేవలం రూ.300 కోట్లు అవసరమవుతాయి. ఆ కొద్దిపాటి నిధులు వెచ్చించి ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. కేంద్రం సహాయం చేయకున్నా కేసీఆర్ దార్శనికతతో కాళేశ్వరం పూర్తిచేయడం వల్లే నేడు తెలంగాణ దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ విజయానికి తెలంగాణ రైతాంగం, బీఆర్ఎస్ ప్రభుత్వం పడిన శ్రమ కారణం.
ఈ వాస్తవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రమంత్రి రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ ఎలా మాట్లాడుతారు అధ్యక్షా?! దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్‌ను నేను పంపిస్తున్నాను. దయచేసి వాస్తవాలను గ్రహించి, తప్పులను సవరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్లు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలి. అలాగే, కేంద్రమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించిన మంత్రిపై సభా హకుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం.
ఏపీ అభివృద్ధికి మా వంతు సాయం ఉంటుందని మేం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే తెలుగు ప్రజల సామర్థ్యం, బలాబలాలు ఏంటో మాకు తెలుసు. ఏపీకి అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నది. ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరమూ ఉన్నది. ప్రపంచ యవనికపై ఆ రాష్ర్టానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకీ ఎంతోమంది ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌లో నివాసాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారు. అందరికీ హైదరాబాద్ ఫేవరెట్. ప్రతీనెలా ఎంతో మంది ఏపీ మంత్రులు, సీఎం కూడా హైదరాబాద్‌కు వస్తారు. అందుకే, ఏదైనా బిల్లు తీసుకొస్తున్నప్పుడూ కేవలం ఏపీ గురించే కాకుండా తెలంగాణ వైపునుంచి కూడా ఆలోచించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి నేనే స్వయంగా ఎన్నోమార్లు ప్రైవేటు బిల్లును ప్రతిపాదించా. ఏపీ పునర్నిర్మాణానికి మద్దతు ఇస్తున్నట్టే, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను, జాతీయ హోదాను కూడా నెరవేర్చాలని కోరుతున్నా.
ఏపీలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టే, ఇటు తెలంగాణలోని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా. ఐటీఐఆర్‌ను కూడా తెలంగాణకు తిరిగి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి చట్టబద్ధమైన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలి. కేసీఆర్ ఆనాడు చెప్పినట్టు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకే శరీరానికి రెండు కండ్లు వంటివి. కేంద్రం కూడా రెండు రాష్ర్టాలను సమానంగా చూడాలి.