తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉండకూడదని, దానిని మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పలురకాల గుర్తులను మార్చడం సరైన పని కాదు. దీనివల్ల అదనపు ఖర్చు తప్ప, మరేం ఉపయోగం ఉండదు. దేశాన్ని పాలించిన రాజులందరూ చెడ్డవారు కాదు. అశోకుడు, అక్బర్, శివాజీ వంటివారు ఎంతో పేరు గడించారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాకతీయులకు ఘనమైన చరిత్ర ఉన్నది.
రుద్రమదేవి వంటి వీర నారీమణులకు ఆనాడే గొప్ప స్థానం లభించింది. శాతవాహనులు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను, గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించారు. 2000 నాటి అమరావతి స్థూపం నాగోపాధ్యాయ అనే ఉపాధ్యాయుని కొడుకు విధికుడు చిత్రీకరించిన, రైతులు ధాన్యం దాచుకునే పూర్ణకుంభం అనే చిహ్నం 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి రాజముద్రగా ఉన్నది. ఆ గుర్తు దాదాపు ఆరు శతాబ్దాల నుంచి తెలంగాణ కోటలో కూడా ఒక ముద్రగా కనుగొనబడింది. అది రైతులకు, సమాజంలో అత్యంత కడు నిర్లక్ష్యం చేయబడినవారికి, ఆనాటి గొప్ప విశిష్ఠతను తెలిపే గుర్తు. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న కాకతీయ తోరణాన్ని తొలగించడం మంచిది కాదు.
– యం. రాంప్రదీప్, 94927 12836