ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పన్నేండేండ్లు అయింది. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆంధ్రను తెలంగాణతో బలవంతంగా కలిపితే ఏం జరిగిందో స్పష్టంగా తెలిసి వచ్చింది. అయితే చరిత్ర పునరావృతమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేండ్లలో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఎదిగింది. ఇక ఏపీ మాత్రం దేశంలోనే అధిక లోటు రాష్ర్టాల్లో ప్రథమ స్థానానికి చేరుకొన్నది. ఈ స్వల్ప చరిత్రనే చెప్తున్నది. ఏ ప్రాంత ప్రాముఖ్యత ఏందో. అసలు సంగతి అట్లా ఉంటే ఆంధ్ర రాజకీయ నాయకులు, హైదరాబాద్‌లో తిష్ట వేసుకొన్న ఆంధ్ర ప్రముఖులు, తెలంగాణ మొత్తం బాగు పరిచింది మేమే, బువ్వ తినిపించింది మేమే, ఎవసాయం నేర్పింది మేమే , మా జేబుల్లో నుంచి డబ్బులు పెట్టి హైదరాబాద్‌ను, హైడ్రాబాడ్ను చేసింది మేమే, సదువు నేర్పింది తామేనంటూ ప్రచారం చేస్తుంటారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై 58 ఏండ్లపాటు వివక్ష కొనసాగింది. ఏపీ గొప్ప, తెలంగాణ తక్కువ అని ఆంధ్ర వాళ్లు హేళన చేశారు. జరిగిందేదో జరిగి పోయింది. మంచికో చెడుకో కలిసి ఉన్నాం. వారు మనకు చేసిన మంచి చెడులు తెలుసుకున్నాం. వద్దు మహాప్రభో మీ గొప్పతనం మాకు వద్దు, మా బతుకు మేం బతుకుతాం అని కొట్లాడినాం. తొలి, మలి దశ ఉద్యమాల్లో కలిపి 1500 మందికి పైగా అమరులయ్యారు. ఎట్లనో గట్ల మా రాష్ట్రం మేము సాధించుకొన్నాం. మా రాష్ట్రంలో మేం బతుకుతున్నాం. వారు కూడా వారి రాష్ట్రంలో బాగుపడాలని కోరుకొంటున్నాం. కానీ తెలంగాణను రాజకీయంగా, ఆర్థికంగా అస్థిర పరచే అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉండి మన రాజకీయాల్లో కలుగజేసుకొంటున్నారు. మన మీద పెత్తనం చలాయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ప్రింట్, డిజిటల్ మీడియా ఇక్కడే పెట్టి ఆధిపత్యం చేస్తూ, మీడియాను డబ్బులిచ్చి చెడ గొడుతున్నారు.
ఆర్బీఐ, కాగ్, నీతి అయోగ్ వంటి సంస్థలు 2014 నుంచి 2025 వరకు అధికారిక సమాచారం ఇస్తూనే ఉన్నాయి. మేధావులు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఏపీ సొంత రెవెన్యూ 52 శాతానికి మించడం లేదు. అప్పులు జీడీపీలో 36 శాతం ఉన్నాయి. తెలంగాణ సొంత రెవెన్యూ 75 శాతం పైనే ఉంటే, అప్పులు జీడీపీలో తెలంగాణలో 27 శాతం ఉన్నాయి. ఏపీ ఆర్థిక, రెవెన్యూ లోటులు పెరుగుతూనే ఉన్నాయి. అతి ఎక్కువ ఉన్న రాష్ర్టాలతో పోటీ పడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవన్నీ వారు తెలుసుకోవలసిన అవసరం లేదా? లేక వారిప్రపంచ స్థాయి రాజధాని, క్వాంటం కంప్యూటర్స్, ఏఐ పరిపాలన వగైరా అర చేతి వైకుంఠం చూస్తూనే సంబరపడుతుంటారా? సంబురపడితే పడాలి.. కానీ తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకు?
ఇకపోతే భాష, తెలుగు అంటే అది కాదు ఆంధ్రనే అసలు తెలుగు అంటున్నారు. అదేదో సామెత చెప్పినట్టు ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములువాడి అన్నట్టు, గుర్తింపు పొందిన 22 భాషలలో ఉండి, 4 పురాతన ద్రావిడ భాషలలో ఒకటిగా ఉన్న తెలుగు కంటే, వాళ్లకై వాళ్లు, ఏర్పరచుకొన్న, కేంద్రంతో గుర్తింపులేని ప్రాంతీయ ఆంధ్ర భాష ఎక్కువ అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
వాళ్లు తెలుగులో సంస్కృతం కలుపుకొని ఆంధ్ర అని పేరు పెట్టుకొని అదే అసలు భాష అని దాష్టీకం చెయ్యవలసిన అవసరమేమిటి? వాళ్లు కావాలనుకొంటే ఆ భాష వాడుకోవచ్చు, వాళ్ల రాష్ట్రం పేరు పెట్టుకోవచ్చు, వారి భాష పేరు పెట్టుకోవచ్చు, కొన్ని హిందీ నుంచి వచ్చిన మైథిలి వగైరా భాషల లెక్క. కానీ తెలుగు భాష తెలుగు ప్రజలది. తెలంగాణ తెలుగుకు ఆంగణం, తెలుగునాడు అని చెప్పవచ్చు. తెలుగు భాష వారి విడదీయలేని వారసత్వం. దానిని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. తెలంగాణ (తెలుగునాడు) మాతృభాషను కాదని వారి సొంత రూపాంతర భాషకు పట్టం కడతామంటే ఎట్లా? ఇంగ్లాండ్ వాళ్లకు ఇంగ్లీష్, పంజాబ్ వాళ్లకు పంజాబీ, తమిళనాడు వాళ్లకు తమిళ్ ఎట్లనో తెలంగాణ వాళ్లకు తెలుగు భాష అట్లా. తెలుగు ప్రజలకు ఆంధ్ర భాష ప్రాస కుదరదు. తెలంగాణ అంటేనే ఆంధ్ర వాళ్లకు ఎంత చిరాకో, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర లేదా సమైక్యాంధ్ర అనడం తెలంగాణ ప్రజలకు అంతే చిరాకు.
ఆంధ్ర రాజకీయ నేతలు, కార్పొరేట్, రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలు, ప్రముఖులు సరే సరి. హైద్రాబాద్‌లో ప్రభుత్వం, దాని మీద పెత్తనం, ప్రభుత్వ కాంట్రాక్టులు కోల్పోయామనే వారి దుగ్ధ వారికి ఉన్నది అనుకొందాం. మరి ఘనత వహించిన ఆంధ్ర సభ్య సమాజం సంగతేమిటి? తెలంగాణ కంటే ఉద్దండ పండితులం, మేధావులం అని అనుకొంటూ ఉంటారుగా, మరి వారి తెలివి తేటలు ఏమైనాయి? వారి గౌరవాన్ని, గొప్పతనాన్ని ఈ ఆంధ్ర ప్రముఖుల తెలంగాణ సిండ్రోమ్ రక్షిస్తున్నదా? ఇనుమడింపచేస్తున్నదా? కనీసం వారి గౌరవ మర్యాదల గురించి అయినా వీటి మీద ఆలోచించాలి కదా. అలా మౌనంగా ఉండటమెందుకు? లేదా ఆ అసంబద్ధాలను సమర్థించడం ఎందుకు? అది అంధ్ర సభ్య సమాజ గౌరవాన్ని పెంచుతున్నదా?
దేశంలో అనేక రాష్ర్టాల విభజన జరిగింది. అన్ని రాష్ర్టాలు ఇట్లా ఆవేశకావేశాలతో కుస్తీ పడు తూ బతుకుతున్నాయా? 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 1966లో పంజాబ్, హరియాణా, 2000లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్; బీహార్, జార్ఖం డ్; యూపీ, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు విడిపోయా యి. ఒకరి రాష్ట్రం మీద మరొకరు ద్వేషం, అసహనం, అతిశయం పెంచుకొని కొట్లాడుతున్న యా? మరి మన దగ్గర ఎందుకు ద్వేషపూరిత రాజకీయాలు?, తెలంగాణను అస్థిరపరిస్తే, క్రుంగిపోతున్న ఆంధ్రఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా? ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేని ఏపీలో నేతలు తమ సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టుకోవాలి.
– జనుంపల్లి జనార్దన్ రెడ్డి