తెలంగాణ ఘనకీర్తిని ఈసారి మన పల్లెలు దేశానికి చాటిచెప్పాయి. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పేరిట పార్లమెంటులోని దాదాపు 800 మంది ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు అభివృద్ధి ప్రాతిపదికన కేంద్రం ర్యాంకులను ప్రకటించింది. వీటిలో టాప్-10లో ఏడు, టాప్-20లో 11 స్థానాలను తెలంగాణ గ్రామాలు కైవసం చేసుకొని మన రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మహత్తర మార్పులకు సమున్నత సంకేతంగా నిలిచాయి. యావత్ తెలంగాణ గర్వించాల్సిన గొప్ప విజయమిది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్ల ఇది సాధ్యపడింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెల్లో పనులు అంటే ఓ రోడ్డును మంజూరు చేయటమో, ఓ వాటర్‌ట్యాంకును కట్టటమో అన్నట్లుగా సాగిపోతుండేది వ్యవహారం. అది కూడా అడిగినవారికి అంతోఇంతో దక్కితే, అడగని వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్లే ఉండేది. కానీ స్వరాష్ట్రం తెలంగాణలో, సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన దృక్కోణమే సమూలంగా మారిపోయింది. పల్లెను ఒక యూనిట్‌గా తీసుకొని సర్వతోముఖాభివృద్ధి జరుపటం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి ప్రణాళిక అయ్యింది. నిధుల మంజూరు, పనులపై పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, అలసత్వం వహించినవారిపై చర్యలు- ఒక నిరంతర యజ్ఞంలా ‘పల్లె ప్రగతి’ కొనసాగింది. వీరికి వారికి అని తేడా లేకుండా, ఇక్కడ అక్కడ అని బేధం లేకుండా.. తెలంగాణలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావటానికి సీఎం, మంత్రులు, అధికారులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం జరిపిన మహత్తర కృషి ఇది. పల్లెప్రగతిని రాష్ట్రప్రభుత్వం ఒక కార్యక్రమంగా కాకుండా, ఒక చైతన్యదీప్తిగా, ఒక స్ఫూర్తిగా, ఒక తపస్సుగా తీసుకోవటం వల్లనే నేడు తెలంగాణ పల్లెలు దేశానికే దారి చూపుతున్నాయి.
‘భారతదేశ ఆత్మ మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కూడా గ్రామాల్లోనే ఉన్నది. గ్రామస్వరాజ్యంతోనే దేశ సౌభాగ్యం సాధ్యమవుతుంది’ అని జాతిపిత మహాత్మాగాంధీ ఉద్బోధించారు. ఆయన బోధన ఏ మేరకు ఆచరణలోకి వచ్చిందన్నది దేశవ్యాప్తంగా అభివృద్ధిలేమికి, వివక్షకు చిహ్నంగా ఉన్న లక్షలాది గ్రామాలను చూస్తే తెలుస్తుంది. ఇది కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల చేతగానితనానికి నిదర్శనం. దేశాన్ని ఏలిన ప్రధానమంత్రుల్లో నరేంద్రమోదీని మించినవారు లేరంటూ ప్రగల్భాలకు పోయే పాలకపక్ష నాయకులు, మోదీ అభిమాన గణం ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారు? మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి అధికారంలోకి వచ్చారు. ఇదే ఎనిమిదేండ్లలో తెలంగాణ గ్రామాలు రాష్ట్ర సౌభాగ్యానికి వన్నె తెస్తుంటే, దేశంలో అసంఖ్యాక గ్రామాలు కనీస సదుపాయాలు లేక వెలవెలబోవటానికి కారణమేమిటి? దేశాభివృద్ధిపై, గ్రామీణవికాసంపై మోదీ సర్కార్‌కు చిత్తశుద్ధి లేకపోవటం కాదా? సంకుచిత రాజకీయాలే తప్ప పురోభివృద్ధి ప్రణాళికలు లేని అవగాహన రాహిత్యం కాదా? తెలంగాణను చూసి కేంద్రం నేర్చుకుంటే ఇకనైనా దేశంలోని గ్రామసీమలు బాగుపడే అవకాశం ఉంది.