జల వివక్షపై ఎలుగెత్తి చాటిన గళం
తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో నీరు ప్రకృతి వనరు మాత్రమే కాదు; అది ఈ గడ్డ ఆత్మాభిమానం, అస్తిత్వం, కోట్లాదిమంది రైతుల జీవన్మరణ సమస్య. వలస పాలకుల స్వార్థపూరిత పాలనలో దశాబ్దాల పాటు సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అంకెల గారడీ, సాంకేతిక కుట్రలను శాస్త్రీయంగా ఛేదించి తెలంగాణ సమాజాన్ని నిద్రాణస్థితి నుంచి మేల్కొల్పిన అపర భగీరథుడు ఆర్.విద్యాసాగర్‌రావు.
తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో నీరు ప్రకృతి వనరు మాత్రమే కాదు; అది ఈ గడ్డ ఆత్మాభిమానం, అస్తిత్వం, కోట్లాదిమంది రైతుల జీవన్మరణ సమస్య. వలస పాలకుల స్వార్థపూరిత పాలనలో దశాబ్దాల పాటు సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అంకెల గారడీ, సాంకేతిక కుట్రలను శాస్త్రీయంగా ఛేదించి తెలంగాణ సమాజాన్ని నిద్రాణస్థితి నుంచి మేల్కొల్పిన అపర భగీరథుడు ఆర్.విద్యాసాగర్‌రావు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా సాగునీటి రంగంలో సాగించిన అలుపెరగని పోరాటం, మలిదశ ఉద్యమానికి ఆయన అందించిన మేధోసంపత్తిని విశ్లేషించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ కనీస బాధ్యత.
1939 నవంబర్ 14న నల్గొండ జిల్లా, జాజిరెడ్డిగూడెంలో లక్ష్మమ్మ, రాఘవరావు దంపతులకు విద్యాసాగర్‌రావు జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన తండ్రి రాఘవరావు ఆ గ్రామంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తొలి వ్యక్తి కావడం, వారి కుటుంబంలో చదువుకు ఉన్న ప్రాధాన్యత, విద్యాసాగర్‌రావు ఎదుగుదలకు బలమైన పునాది వేసింది. ఆ గ్రామం నుంచి మొట్టమొదటి ఇంజినీరింగ్ పట్టభద్రుడిగా నిలిచిన ఆయన, 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. 1979లో రూర్కీ విశ్వ విద్యాలయం (ప్రస్తుత ఐఐటీ రూర్కీ) నుంచి జలవనరుల అభివృద్ధిలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.
1983లో అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్ సిస్టమ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందారు. 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకోవడం ఆయన మేధోపటిమకు నిదర్శనం. ఈ అసాధారణ విద్యా నేపథ్యమే అంతర్రాష్ట్ర జల వివాదాలు, ట్రిబ్యునల్ తీర్పులను చట్టబద్ధంగా, సాంకేతిక కోణంలో విశ్లేషించే తిరుగులేని శక్తిని ఆయనకు ప్రసాదించింది. 34 ఏండ్లపాటు కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్ వంటి అత్యున్నత హోదాల్లో పనిచేసిన విద్యాసాగర్‌రావుకు దేశవ్యాప్త నదీ పరీవాహక ప్రాంతాల గమనశీలత, నీటి కేటాయింపుల సూత్రాలపై అపార అవగాహన ఉండేది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలో ఏవిధంగా పకడ్బందీగా కోత విధిస్తున్నారో ఆయన నిశితంగా గమనించారు.
ఉద్యోగ విరమణ అనంతరం విద్యా సాగర్‌రావు తన శేషజీవితాన్ని తెలంగాణ జలహక్కుల పోరాటానికే అంకితం చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు ప్రధాన జలవనరుల సలహాదారుగా ఉంటూ, ప్రతి ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమకాలంలో కేసీఆర్ చేసే ప్రసంగాల్లోని జల గణాంకాల వెనుక విద్యాసాగర్‌రావు మేధస్సు దాగి ఉండేది.
ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, నీటి కేటాయింపుల విషయంలో ఆయన సలహాలు ఉద్యమ నాయకత్వానికి దిక్సూచిలా పనిచేసేవి. అందుకే కేసీఆర్ ఆయనను ‘జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు‘ అని సగర్వంగా కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా జయశంకర్ దిశానిర్దేశం చేస్తే, సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల కండ్లకు కట్టినట్లు చూపిన ఘనత విద్యాసాగర్‌రావుకే దక్కుతుంది.‘నీళ్లు-నిజాలు’ పేరుతో ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ ప్రజల కండ్లు తెరిపించాయి. పత్రికల్లో ఆయన విశ్లేషణలు చదివిన సామాన్య రైతుకు కూడా తన నీటి హక్కుల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వెనుక విద్యాసాగర్‌రావు మార్గదర్శకత్వం ఉన్నది. ముఖ్యంగా ‘మిషన్ కాకతీయ’ ద్వారా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ జరుగాలని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన బలంగా విశ్వసించేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, ప్రాజెక్టుల ఎత్తు, నీటి లభ్యత వంటి అంశాల్లో ఆయన సూచనలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌లో సభ్యుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు, మన దేశ 12వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలోనూ విలువైన సలహాలు అందించారు.
2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆయనను ‘లీడింగ్ ఇంజినీరింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా’గా గౌరవించటం వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. 2016 నవంబర్‌లో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక సెమినార్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ రంగం భవిష్యత్తు అంతా సాగునీటి ప్రాజెక్టుల విజయవంతంపైనే ఆధారపడి ఉన్నదని స్పష్టం చేశారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడి 2017 ఏప్రిల్ 29న విద్యాసాగర్‌రావు తుదిశ్వాస విడిచారు.
ఆయన వదిలిన మేధోసంపత్తి తెలంగాణకు ఎప్పటికీ రక్షాకవచమే. తెలంగాణ ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న ఆయన కల సాకారమవుతుండటం ఆయనకు నిజమైన నివాళి. సాగునీటి అన్యాయంపై ఆయన ఎలుగెత్తి చాటిన గళం, తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవటం అంటే కేవలం ఒక వ్యక్తిని స్మరించుకోవటం కాదు, తెలంగాణ జల సార్వభౌమాధికారం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేయటమే.
– రామకిష్టయ్య సంగనభట్ల 9440595494
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

