దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ స్ఫూర్తితో తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆదర్శప్రాయంగా ఉండవలసినవారు పరిధులను అతిక్రమిస్తున్నారు. వారికి రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర ప్రతిపత్తి, విచక్షణాధికారాలు దారి తప్పుతున్నాయి. వరుసగా సంభవిస్తున్న ఈ అవాంఛనీయ పరిణామాలు పౌర సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవానికి సార్థకత లేకుండా పోతుందేమోనని భయమవుతున్నది.
గత మే నెలలో సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ న్యాయస్థానాలపై విరుచుకుపడిన తీరు ప్రజలను నిరుత్తరులను చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి నివేదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా విపరీతమైన కాలయాపన చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు చెప్తూ రాష్ట్రపతి ముందుకువచ్చిన బిల్లులపై మూడు నెలల్లోపు, రాష్ట్రపతికి నివేదించాల్సిన బిల్లులపై గవర్నర్ నెలలోపు నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిం ది. లేకుంటే ఆ బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
వివిధ రాష్ర్టాలలో ఆయా అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులు చట్టరూపం దాల్చే క్రమంలో తలెత్తుతున్న విపరీత ధోరణులకు ఇదొక హెచ్చరిక. అంతేకాదు, తిరిగి రెండవసారి అసెంబ్లీ పంపిన బిల్లు గవర్నర్ ఆమోదించాల్సిందేనని తీర్పుచెప్పింది. ఈ తీర్పు మమ్మాటికీ సమంజసమైనది. కానీ, ఈ తీర్పు ఎందుకనో ఏ మాత్రం సంబంధం లేని అప్పటి రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కడ్కు అసహనాన్ని కలిగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-142 ప్రకారం న్యాయవ్యవస్థకు సంక్రమించిన అధికారాలు ప్రజాస్వామ్య శక్తులపై అణ్వాయుధ క్షిపణి కాకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం సంగతేమిటని ఎదురుదాడికి దిగారు.
రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న ధన్కడ్ సుప్రీంకోర్ట్ తీర్పుపై ఆ స్థాయిలో స్పందించిన వైనం ఒక సంచలనాన్ని సృష్టించింది. విశేషమేమంటే పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ధన్కడ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెట్టా రు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిరూపమైన చట్టసభలు లేదా సభ్యులు వివిధ సందర్భాల్లో స్పీకర్, గవర్నర్ చర్యలపై కోర్టులను ఆశ్రయించే దారులు నానాటికి విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ముంబైలో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ సభలో మాట్లాడుతూ… చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలని ఆ మూడింటికంటే రాజ్యాంగం సర్వోన్నతమైనదని స్పష్టం చేశారు.
చట్టసభలకు సంబంధించి ఇటీవల సుప్రీం వెలువరించిన రెండు సంచలన తీర్పులకూ కేం ద్ర బిందువు తెలంగాణ కావడం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది అధికార కాంగ్రెస్ వైపు జారుకున్న వివాదం ఒకటైతే, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ఉదం తం రెండవది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదులు అంది నెలలు గడుస్తున్నా ఉలు కు పలుకు లేకపోవడంతో బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదంపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు మూడు నెలల గడువు విధించింది. ఇక తెలంగాణ స్పీకర్ నిర్ణయం కోసం దేశ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ గవర్నర్ జారీచేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఇటీవల రద్దుచేసింది. ఈ వ్యవహారంలో గవర్నర్ చర్య పట్ల కోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ కేసులో వెలువడే తుది తీర్పు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల చరిత్రలో కొత్త అధ్యాయం కాగలదని న్యాయ నిపుణులు ఆశిస్తున్నారు.
దేశ చరిత్రలో అధికారం కోసం, రాజకీయాల కోసం జరిగే పార్టీల పెనుగులాటలో దశాబ్దాలుగా తలదూరుస్తున్న గవర్నర్ల అసెంబ్లీ స్పీకర్ల పాత్ర తరచుగా వివాదాగ్రస్థమవుతున్నది. గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ నిర్ణయించేది కేంద్ర మంత్రివర్గం. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు తమ పార్టీకి చెందినవారికి లేదా విధేయులకు రాజకీయ పునరావాసంలో భాగంగా గవర్నర్ల నియామకాలు చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతమైన పెద్ద మనుషులను గవర్నర్లుగా నియమించాలన్న సర్కారియా కమిషన్ సిఫారసు అటకెక్కింది.
పూర్వాశ్రమ రాజకీయ వాసనలు వదలని గవర్నర్లు తమ చర్యలతో యథాశక్తి స్వామిభక్తిని ప్రకటిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి సమూహంలో లేని పార్టీల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను సతాయించే కొందరు గవర్నర్ల వ్యవహార శైలి నిరంతరంగా వివాదాలకు కారణమవుతున్నది. ఎన్నికైన మరుక్షణం నుంచి అసెంబ్లీలో అందరి పెద్దగా మన్ననలు పొందాల్సిన స్పీకర్ నిర్ణయాలు వివిధ సందర్భాల్లో తీవ్ర వివాదాలకు దారితీశాయి. పూర్వాశ్రమ రాజకీయ సంబంధాలను పూర్తిగా తెంచుకోలేని బలహీనత స్పీకర్ వ్యవస్థను వెంటాడుతున్నది.
ఈ అనర్థాలకు మరో కారణం స్పీకర్లకు, గవర్నర్లకు సంక్రమించిన విచక్షణాధికారం. ఆ అధికారానికి హేతుబద్ధమైన పరిధి, పరిమితి ఉంటే బాగుండేది. రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్, గవర్నర్ వ్యవస్థలకు అపారమైన గౌరవం ఇచ్చారు. వారిపై నమ్మకం ఉంచారు. అందుకనే విచక్షణాధికారాల లోతుల్లోకి పోలేదు. ముందు కాలాలలో ఇలా రకరకాల వైపరీత్యాలు సంభవిస్తాయని వారనుకోలేదు. ఇంత జరిగినా కేంద్రం సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయాలకు కాల పరిమితి విధించడం తగదని నివేదించింది. దేశంలోని అత్యున్నత రాజ్యాంగవ్యవస్థల మధ్య వైవిధ్యం సరే, వైరుధ్యం మంచిది కాదు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని విచక్షణాధికారాల విషయంలో సమంజసమైన విధివిధానాల రూపకల్పనకు పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణకు ముందుకురావాలని ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయశాస్త్ర కోవిదులు కోరుకుంటున్నారు. కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు నుంచి నిన్నమొన్నటి తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం కేసుల వరకు వివిధ కీలక సందర్భాల్లో కోర్టులు ఒక అడుగు ముందుకువేసి ప్రజాస్వామ్యాన్ని పదిలపరిచాయి. త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలగించిన 65 లక్షల ఓటర్ల వ్యవహారంలో వివరాలు కోరుతూ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు జారీచేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఏదేమైనా రాజ్యాంగ వ్యవస్థలు రచ్చకెక్కడం, న్యాయవ్యవస్థను బలహీనపరచాలనుకోవడం దేశానికి క్షేమదాయకం కాదు.
కొసమెరుపు: ఇటీవల తమిళనాడులోని మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జీనా జోసెఫ్ అనే విద్యార్థిని గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా తీసుకోవడానికి నిరాకరించారు. అదేమని మీడియా ప్రశ్నించగా, ‘గవర్నర్ తమిళనాడు రాష్ర్టానికి, ప్రజలకు వ్యతిరేకి. అందుకే అని సమాధానమిచ్చారు. ఇదే సంక్షోభానికి సంకేతం?
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238