పాకిస్థాన్‌తో సాయుధ ఘర్షణలో భారత సైన్యానిది స్పష్టంగా పైచేయి అయిన దశలో కాల్పుల విరమణకు ప్రధాన మంత్రి మోదీ ఎందుకు అంగీకరించారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. విశేషం ఏమంటే అందుకు గల కారణాలనైనా ఎవరూ ఊహించలేకపోతున్నారు. కారణం ఫలానా అని ఏదైనా సూచన వచ్చినా ఆమోదించటం లేదు. తన జోక్యం వల్లనే విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఒకటికి రెండుసార్లు ప్రకటించినా ఒప్పుకొనేందుకు మనస్కరించటం లేదు. ఇదంతా దేశంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి అద్దం పడుతున్నది. మోదీ అంగీకారానికి తగు కారణాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన అమెరికాతో వాణిజ్యం ఒక్కటే కాదు, ఇంకా అనేక బంధనాలలో చిక్కుకొని ఉన్నారు గనుకనే ట్రంప్‌ను కాదనలేకపోయారు.
అమెరికా అధ్యక్షుడు రెండవసారి చెప్పిన మాటలను ఒకసారి గమనించండి. కాల్పుల విరమణ అంగీకరానికి ‘ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. కానీ వాటిలో వాణిజ్యం చాలా ముఖ్యమైనది’ అన్నారాయన. ఇందులో ‘ఇంకా చాలా కారణాలు’ అన్న మాట ప్రత్యేకంగా గమనించదగినది. అవి ఏమిటో ఆయనకు తెలియదనుకోలేం. కానీ, బహిరంగంగా చెప్పలేరు. అవేమిటో అర్థం చేసుకొనేందుకు మనమే ప్రయత్నిద్దాం. మోదీకి అనేక బంధనాలు అంటున్నది దీనిగురించే. ఆ విషయం కొద్దిసేపు అట్లుంచితే, స్వయంగా పెద్ద వ్యాపారి అయిన ట్రంప్ అంతర్గత విధానాలు, విదేశాంగ విధానాలు అన్నీ కూడా సూర్యుని చుట్టూ గ్రహాల వలె వాణిజ్యం చుట్టూ తిరుగుతుండటం చూస్తున్నాం. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అవి కనిపిస్తున్నవే. అదే ప్రకారం భారత్-పాక్ ఘర్షణలోనూ ఆ ప్రస్తావన తేవటంలో ఆశ్చర్యం లేదు. వాణిజ్యం కార్డును ప్రయోగించి చాలా చేస్తున్నానని ఈ సందర్భంలోనూ ఆయన అన్నారు.
భారత్-పాక్ ఘర్షణ విషయానికి వస్తే, రెండు దేశాలనూ ఒకే విధంగా ఒత్తిడి చేసి ఒప్పించగల కార్డు వాణిజ్యమని ఆయన భావించారు. ప్రస్తుతం భారత, పాకిస్థాన్‌లు రెండూ ట్రంప్ టారిఫ్‌ల ఒత్తిడిలో ఉండి, రాజీల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటం తక్షణ సమస్యగా మారి ఆయనకు కలిసివచ్చింది.
విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేద ని భారత ప్రభుత్వం నిరాకరించబూనింది గా ని, మరి అసలు కారణమేమిటో చెప్పలేని స్థితి లో ఈ నిరాకరణకు విలువుండదు. పైగా అమెరికా అధ్యక్షుడంతటి వాడు బహిరంగంగా అన్నప్పుడు. మేము మీతో చాలా వాణిజ్యం చేయాలనుకుంటున్నాము, కాల్పులు విరమించని పక్షంలో వాణిజ్యం ఎంతమాత్రం ఉండబోదని కూడా హెచ్చరించినప్పుడు.
ఘర్షణ ఈ దశలో ఆగనట్టయితే అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఏర్పడిందనే సమాచారం తమకు నిఘా వర్గాల నుంచి వచ్చిందనే మరొక మాట కూడా ట్రంప్ ఈ రెండవసారి ప్రకటనలో అనటం గమనించదగినది. మొదటిసారి ప్రకటన సమయానికే ఆయనకు ఆ సమాచారం ఉంది. అందుకే, ‘మిలియన్ల కొద్దీ అమాయకుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం’ అన్నారు. అణ్వాస్ర్తాలనే మాటను ఉపయోగించకపోయినా, తన ఉద్దేశం అదేనని భావించవచ్చు. మామూలు యుద్ధంలో లక్షలాది మంది చనిపోరు కదా. అణు యుద్ధ ప్రమాదం నిజంగా ముంచుకొచ్చిందీ లేనిదీ తెలియదు గాని, ‘యుద్ధంతో మాకు సంబం ధం లేదు, అది వారిద్దరి సమస్య’ అంటూ వచ్చిన ట్రంప్ బృందం, అకస్మాత్తుగా రెండు పక్షాలతో రాత్రింబవళ్లు ఫోన్ సంభాషణలు సాగించి కాల్పుల విరమణకు ఒత్తిడి చేసి మరీ ఒప్పించటానికి వేరే కారణం కనిపించదు.
ఇంతకూ జరిగిందేమిటి? ఈ నెల 6-7 తేదీల మధ్యరాత్రి పాకిస్థాన్‌పై ఇండియా దాడులు మొదలు కాగా, 7న మధ్యాహ్నం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తమ చర్య ‘నాన్ ఎస్కలేటరీ’ అని ప్రకటించారు. అనగా, లోగడ సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్ దాడుల తరహాలోనే ఈసారి కూడా ఉగ్రవాదులపై దాడికే పరిమితమవుతామని, పాకిస్థాన్ సైన్యంపైనో ఇతరత్రా నో దాడులకు విస్తరించబోమన్నది అర్థం. కానీ పాకిస్థాన్ వైపు నుంచి అట్లా జరుగలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు బయట పంజాబ్‌లో గల బహావల్పూర్, మురిద్కేలపై కూడా దాడులు, మసీదులపై దాడులు, పౌరుల మరణం అనే కారణాలు చూపుతూ వారు అదే రాత్రి దాడులకు దిగారు. దానితో ‘నాన్ ఎస్కలేటరీ’ అన్నది కాస్తా ‘ఎస్కలేటరీ’ కావటం మొదలైంది. డ్రోన్లు, క్షిపణులు సరిహద్దులను దాటగా, యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా సొంత భూ భాగాల నుంచే రంగంలోకి వచ్చాయి. ఒకరి సైనిక స్థావరాలపై ఒకరు దాడులు మొదలుపెట్టారు. సరిహద్దుల వద్ద కాల్పులు సాగాయి. రెండు దేశాలూ సరిహద్దులలోకి సైన్యాలను కదిలించటం, యుద్ధ నౌకల మోహరింపులు చేయటం కనిపించింది.
ఈ సమాచారాలన్నీ అమెరికాకు చేరుతుండగా సరిగా ఆ దశలో ఒక ప్రమాదకర పరిణామం చోటుచేసుకున్నది. పాకిస్థాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ 10వ తేదీ ఉదయం నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) సమావేశాన్ని పిలువనంపారు. ఆ సంస్థ అణ్వస్త్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. దానిని సమావేశపరచవలసిన అవసరం ఏమి వచ్చిందో తెలియదు గాని, ఆ సమాచారం తెలిసిన ట్రంప్ బృందం మాత్రం తీవ్ర ఆందోళనతో వెంటనే జోక్యం చేసుకొని ఆ సమావేశాన్ని రద్దు చేయించింది. యుద్ధంతో మాకు సంబంధం లేదంటూ వచ్చిన ఆ బృందం రెండు దేశాలకు వరుసగా ఫోన్లు చేసి చివరికి కాల్పుల విరమణను ప్రకటింపజేశారు.
భవిష్యత్తు గురించిన తక్కిన చర్చలోకి వెళ్లేముందు, మొదట అనుకున్నట్టు, ‘అనేక బంధాలలో మోదీ’ అనే మాటకు అర్థమేమిటో చూద్దాం. సైనికంగా పై చేయి లభిస్తున్న స్థితిలో కాల్పుల విరమణకు ప్రధాని మోదీ అంగీకరించటానికి కారణాలు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్న వాణిజ్యం, అణుయుద్ధ ప్రమాదమేనా ఇంకేమైనా ఉండవచ్చునా? వాణిజ్యం హెచ్చరిక దేశ ప్రయోజనాలకు మించినదా? అణ్వస్ర్తాలు ఇండియా వద్ద కూడా ఉన్నప్పుడు, తాము సైతం సర్వనాశనం కాగల అటువంటి దుస్సాహసానికి పాకిస్థాన్ నిజంగా పాల్పడి ఉండేదా? నిజానికి సాయుధ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికైనా చేరలేదు ఇంకా. రెండు దేశాల త్రివిధ బలాలు సర్వ సన్నద్ధతలో ఉన్నాయి గాని, ఎస్కలేషన్ స్థాయి ఇంకా డ్రోన్లు, క్షిపణుల స్థాయికే పరిమితమై ఉన్నది. పూర్తిస్థాయి యుద్ధానికి ఎస్కలేట్ అయి అందులో పాకిస్థాన్ ఓటమి పరిస్థితి వచ్చినప్పుడు అణుయుద్ధ స్థాయికి ఎస్కలేట్ కావచ్చు. పైగా, అన్ని అణ్వస్త్ర దేశాల వలెనే పాకిస్థాన్‌కు కూడా ‘అణ్వస్త్ర ప్రయోగ విధానం’ (న్యూ క్లియర్ డాక్ట్రిన్) అనేది ఒకటుంది. అందులోని నాలుగు అంశాల ప్రకారం చూసినట్టయితే, అణ్వస్ర్తాలు ప్రయోగించే పరిస్థితి అంటూ ఏదీ వారి దృక్కోణం నుంచి కూడా కనిపించదు. అయినప్పటికీ ప్రయోగిస్తే ప్రయోగించవచ్చు గాక. కానీ, ఆ పరిస్థితి లేదని, అమెరికాను కాదని ఆ పని చేయగల సాహసమూ లేదని మాత్రం చెప్పవచ్చు.
మోదీ ప్రభుత్వపు వ్యూహకర్తలు గ్రహించలేనివి కాదు ఇవన్నీ. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వపు సూచనకు లేదా ఒత్తిడికి వెంటనే ఎందుకు అంగీకరించినట్టు? కశ్మీర్ విషయంలో బయటి జోక్యాన్ని అంగీకరించబోమన్న చిరకాలపు విధానానికి, ఆ మేరకు పాకిస్థాన్‌తో 1972లో జరిగిన షిమ్లా ఒప్పందానికి విరుద్ధమైన రీతిలో? అమెరికా జోక్యం చేసుకునే ప్రయత్నాలను ఇందిరాగాంధీ స్పష్టంగా, నిర్భయంగా ధిక్కరించిన దానికి విరుద్ధంగా? భారతదేశ చరిత్రలోనే తమంతటి జాతీయవాద ప్రభుత్వం లేదని అనునిత్యం చాటుకుంటున్నప్పుడు? పహల్గాం మారణకాండ నుంచి 6-7 తేదీల రాత్రి దాడి వరకు మధ్యకాలంలో చేసిన పలు భీషణ ప్రతిజ్ఞలు, ప్రకటించిన లక్ష్యాలలో ఇంకా ఏవీ నెరవేరనపుడు?
అన్నింటికీ భిన్నమైన రీతిలో అకస్మాత్తుగా ట్రంప్ జోక్యానికి ఎందుకు తల ఊపవలసి వచ్చిందన్నది ప్రశ్న. ఆ సమయంలో అటునుంచి వచ్చిన సూచన ఏమిటి? అందుకు ప్రతిగా మోదీ ప్రభుత్వం ఏమైనా వాదనలు చేసిందా, చేస్తే ఏమిటి? చివరికి ఎందువల్ల అంగీకరించారన్నవి దేశ ప్రజలకు తెలియవలసిన విషయాలు.
ఇందిరాగాంధీ వలె గాక నరేంద్ర మోదీ ఈ విధంగా అంగీకరించటానికి కొన్ని బలమైన కారణాలున్నట్టుగా భావించవలసి ఉన్నది. ఆమె వలె గాక తను అమెరికాతో అనేక బంధనాలలో చిక్కుకుపోయి ఉన్నారు. అప్పటినుంచి ఆరు దశాబ్దాల కాలంలో పరిస్థితులు కూడా చాలా మారాయి. ఇవన్నీ గమనిస్తే తప్ప, మోదీ లొంగుబాటుకు గల కారణాలు మనకు అర్థం కావు. అవేమిటో చూద్దాం. ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి స్వాతంత్య్రోద్యమ కాలాన్ని చూసినవారు. అప్పటి స్ఫూర్తి, ఆత్మగౌరవం, దేశాభిమానం, స్వతంత్ర ధోరణులు, దేశ ప్రయోజనాల పట్ల పూర్తి నిబద్ధత గలవారు. ఆ కారణాల వల్ల బయటి జోక్యాలను సహించనివారు. ఆ తరాలకు చెందిన జనసంఘ్, బీజేపీ నాయకుల సంస్కృతి, రాజనీతి కూడా అటువంటిదే. దేశ ప్రయోజనాల కోసం అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి బయటి దేశాల సహకారం అవసరమైతే ఆ మేరకు పరస్పర సహకారాలున్నాయి గానీ, వారి నిర్దేశాలను అంగీకరించలేదు.
మోదీ సమయం వచ్చేసరికి ఈ మౌలికతలు మారే పరిస్థితులు వచ్చాయి. ఆయన విదేశాంగ విధానం స్వతంత్రతను పూర్తిగా వదిలివేసిందని అనటం లేదు. కానీ, అందుకు భంగం కలిగే పరిస్థితులు కొన్నింటిని తనకు తానే సృష్టించుకోవటం మొదలుపెట్టింది.
ఆ పరిస్థితులు ఏర్పడిన కొద్దీ కొనసాగిన కొద్దీ అమెరికాతో సాన్నిహిత్యం పెరగటం, ఆ సాలెగూడులో చిక్కటం, స్వతంత్రతను ఆ మేరకు కోల్పోతుండటం, అయినప్పటికీ అంతా మన ప్రయోజనాల కోసమేననుకోవటం జరుగుతూ వస్తున్నది. ఈ విధమైన బంధనాలు నరేంద్ర మోదీ మొదటిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచే (2014) మొదలయ్యాయి. ముఖ్యంగా ఒబామా తర్వాత ట్రంప్, బైడెన్, తిరిగి ట్రంప్ కాలాలలో. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ ఆలింగనాలు ఫలించి మధ్యలో బైడెన్ వల్ల కొంత రసభంగం కలగకుండా ఉన్నట్టయితే ఎట్లుండేదో గాని, అయినప్పటికీ బైడెన్‌తో మౌలికంగా మిత్రభేదం ఏమీ కలగలేదు.
విషయం ఏమంటే, ట్రంప్ వలెనే మోదీకి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిత్వ కాలం నుంచే ‘ధనమేరా అన్నిటికీ మూలం అయ్యింది’. అనగా వ్యాపారాలు, తన వ్యాపార మిత్రులూ అని. ప్రధాని కావటంతో అది జాతీయస్థాయికి విస్తరించింది. గతం నుంచే గల ఆర్థిక సంస్కరణలు అందుకు ఉపకరించాయి. ఈ లక్ష్యాలకు అమెరికాతో, యూరప్‌తో సాన్నిహిత్యం ఎప్పటికప్పుడు పెరగటం అవసరమైంది. రష్యాతో ఆయుధాలు, చమురు వంటి వనరులు, వాణిజ్యం సజావుగానే ఉన్నా, ఆర్థికరంగం, సాంకేతిక సహకారాలలో, భౌగోళిక వ్యూహాలు, పైచేయి సాధనలలో ‘అంతులేని’ అవకాశాల కోసం అమెరికాతో బంధాల పెరుగుదల తప్పనిసరి అయింది. చైనాకు సంబంధించి వాణిజ్యం బాగానే జరుగుతున్నా, సరిహద్దు సమస్య వల్ల, ఇతరత్రా భౌగోళిక రాజకీయ వ్యూహాలను బట్టి వారు అప్రకటిత ప్రత్యర్థులయ్యారు. ఆ విధంగా మిగిలింది అమెరికా.
అమెరికాకు పాకిస్థాన్‌తో ఒకప్పుడు ఉండిన వ్యూహాత్మక సంబంధం ప్రధానంగా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ దశల తర్వాత బాగా తగ్గిపోయింది. అమెరికా ప్రత్యర్థి అయిన చైనాకు పాకిస్థాన్ చేరువైంది. కనుక అమెరికాకు భారత్‌పై ప్రేమ పెరిగింది. అంతమాత్రాన ఒక అగ్రరాజ్యం పాకిస్థాన్ వంటి ఒక భాగస్వామిని పూర్తిగా ఎప్పుడూ వదులుకోదు. అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకుంటుంది. అదే సమయంలో ఇండియా పట్ల మొగ్గు పెరుగుతుంది. ఆ లెక్కలలో ఇండియాకు, అనగా మోదీకి, అమెరికా పట్ల మరింత మొగ్గు కలుగుతుంది. అది మరొక బంధం అవుతుంది.
ఉత్తరం వైపు గమనిస్తే చైనాతో మనకు గల సమస్యలు ఒకటి కాగా, వారితో అమెరికాకు గల సమస్య మరొకటి. ఈ రెండింటికి కలిపి ఆ ప్రభావాలతో ఇంకా వేర్వేరు కోణాలు ఏర్పడుతాయి. భారత్-చైనా సరిహద్దు వివాదంలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని చెప్తూనే, సరిహద్దు ప్రాంతాలకు వారి ప్రతినిధుల పర్యటనను, ప్రకటనలను ఆమోదిస్తాం. పసిఫిక్‌లో, దక్షిణ చైనా సముద్రంలో ‘క్వాడ్’ కూటమి రూపంలో, ఇతరత్రా సన్నిహితంగా వ్యవహరిస్తాం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ పట్ల అంటీముట్టనట్టు ఉంటాము. ఇవన్నీ దేశ ప్రయోజనాలకు అవసరం కాదా అంటే కాదనలేం. అదే సమయంలో, ప్రస్తుత చర్చకు సంబంధించి గమనించవలసిందేమంటే, మొత్తం మీద, అంతిమ విశ్లేషణలో, అమెరికాతో మోదీ ప్రభుత్వ సాన్నిహిత్యం పెరుగుతూ, బంధాలు విస్తరిస్తూ, వాటిలో చిక్కుకుపోతుండటమనేది కనిపిస్తున్నది. ఇండియా పట్ల అమెరికా దృష్టి కూడా అదే విధంగా ఉన్నది. అటువంటి బంధనాలలో చిక్కుకున్నప్పుడు, సాధారణ విషయాలైతే వేరుగాని, పాకిస్థాన్ వంటి పొరుగు దేశంతో ఘర్షణ, అణుయుద్ధ అనుమానాల వంటి పరిస్థితిలో, ఇందిరాగాంధీ వంటివారు గాక నరేంద్ర మోదీ వంటివారు, ఆ బంధనాలను కాదని స్వతంత్రంగా వ్యవహరించటం తేలిక కాదు. శాస్త్రి, ఇందిరలకు దేశ ప్రయోజనాలు ఉన్నా ఇటువంటి బంధనాలలోకి ప్రవేశించలేదన్నది గమనించవలసిన విషయం.
స్వతంత్రంగా వ్యవహరించగల పునాదులు, నేపథ్యం, స్వభావం, దేశ ప్రయోజనాల దార్శనికత, అవన్నీ కలిగించే ధైర్య సాహసాలూ లాల్‌బహదూర్, ఇందిరలకు ఉన్నట్టు మోదీకి లేవు. ఆయన పునాదులు, నేపథ్యం, ప్రయోజనాలు, లక్ష్యాలు ఏమిటో పైన చెప్పుకొన్నాం. అందువల్ల, తార్కికంగా చూసినప్పుడు, ట్రంప్‌ను కాదనగల ధైర్యం తనకు ఉండదు.
పాకిస్థాన్‌తో భవిష్యత్తు సంబంధాలు ఏమిటన్నది ప్రశ్న. సరిహద్దులలో సైన్యాల తగ్గింపు, కాల్పులు జరుపుకోకపోవటం అనే అంగీకారాలు సైన్యాధికారుల మధ్య 12వ తేదీన జరిగాయి. అది ఎంతకాలం నిలుస్తుందన్నది వేరే ప్రశ్న. పాకిస్థాన్‌తో చర్యలు టెర్రరిజం గురించి, పీఓకే గురించి మాత్రమేనని ప్రధాని ప్రకటించారు. సింధూలో నీరు వది లేది లేదన్నారు. మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ సూచించగా అందుకు అంగీకరించబోమన్నారు. అనగా సమీప భవిష్యత్తులో చర్చలన్నవి ఉండబోవన్న మాట. ఇక, బాలాకోట్‌లో అంతం చేశామనుకున్న టెర్రరిజం తిరిగి మొలకలు వేసినట్టు, ప్రస్తుత దాడులు, ధ్వంసం తర్వాత తిరిగి మొలకలు వేయబోదన్న హామీ లేదు. ఆ పని కశ్మీర్లో అంతర్గతంగా జరుగుతుంది. అది 13వ తేదీకే కనిపించింది కూడా. అట్లాగే పాకిస్థాన్‌లో కొత్త శిబిరాలు వెలుస్తాయి. కొందరు ఉద్వేగంతో అవాస్తవిక వైఖరి తీసుకుంటూ పీవోకే ఆక్రమణ, బలూచిస్థాన్తో పాటు ఖైబర్ ఫక్తూన్ ఖ్వాలను విడగొట్టమంటున్నారు. ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గం. అది ఏది కావచ్చునన్నది వేరే చర్చ.