‘మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చలేదు. కానీ, ఇండియా, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు’.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో అన్న మాటలివి. అగ్రరాజ్య అధినేత మాటల్లో ఎన్ని వైరుధ్యాలున్నాయో ఇప్పుడు అమెరికా, భారత్ మధ్య అన్ని సంక్లిష్ట అంశాలున్నాయి. ఇండియా ఎగుమతి చేసే సరకులు, సేవలపై పన్నులను మొదట పాతిక శాతం, ఆ తర్వాత 50 శాతానికి ట్రంప్ ఇటీవల పెంచేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నదంటూ భారత్‌పై రికార్డు స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో ఏ అమెరికా నాయకుడూ చేయనంత హాని ఇండియాకు జరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. దీనికి ముఖ్యంగా ప్రధాని మోదీ బాధ్యత కూడా లేకపోలేదు.
ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యమైన భారత్ మధ్య సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా క్షీణించాయి. ప్రచ్ఛన్న యుద్ధ శకం ముగిశాక 1990ల్లో అమెరికాతో మైత్రిని బలోపేతం చేసుకుంది భారత్. డెమొక్రాట్లు అధికారంలో ఉన్నా, ఇప్పటిలా రిపబ్లికన్లు రాజ్యమేలినా రెండింటి మధ్య బంధం, ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు, ఇంకా చెప్పాలంటే రాజకీయ బంధాలు బలపడుతూనే వచ్చాయి. దీనికి తోడు ఐటీ విప్లవం కారణంగా 21వ శతాబ్దంలో భారత్ నుంచి వలసల్లో అనూహ్య వేగం పుంజుకున్నది. దీంతో అమెరికాలో భారత సంతతి ప్రజల సంఖ్య 40 లక్షలకు చేరుకున్నది. అయితే, 2017లో మొదటిసారి అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టాక ఇండియాతో, ప్రధాని మోదీతో అమెరికా మైత్రీ బంధం బలోపేతమైనట్టుగానే కనిపించింది.
2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ను ట్రంప్ ఆరంభించారు. వెంటనే ఆసియా వాణిజ్య దిగ్గజం చైనాతో వ్యాపార కీచులాటలకు తెరతీశారు. అంతటితో ఆగకుండా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఇండియాపై విరుచుకుపడ్డారు. గ్లోబలైజేషన్ కారణంగా తయారైన వస్తువులు, సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ, దేశంలో వస్తూత్పత్తి రంగాన్ని అమెరికా దాదాపు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాణిజ్య లోటును సాకుగా చూపించి చైనాను అగ్రరాజ్యం ‘శిక్షించబోతున్నదని’, ఇక ముందు ‘డ్రాగన్’ స్థానాన్ని ఇండియా నెమ్మదిగా కైవసం చేసుకుంటుందని అంచనా వేశారు.
ఈ జోస్యం నిజం కావడానికి అవకాశాలు తక్కువని అతి త్వరలోనే తేలిపోయింది. చైనాపై కంటే భారత్ మీదే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం రోజూవారీగా ‘వెల్లడవడం’ దేశంలో మొదట్లో ఆందోళనకు, తర్వాత అలజడికి కారణమైంది. మోదీ గొప్పవాడని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ నిన్నగాక మొన్న ఉక్రెయిన్ష్య్రా పోరు ‘మోదీ యుద్ధం’ అనే వరకూ వెళ్లారంటే, రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు ఏ దిశగా పయనిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ ప్రజలను ఊచకోత కోస్తున్న రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపేయాలన్న ట్రంప్ హెచ్చరికను వెంటనే అమలు చేయడం చాలా కష్టం. వాస్తవానికి మన కంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా. కానీ, ఈ విషయంలో చైనాను ట్రంప్ చూసీచూడనట్టు వదిలేశారు. అంటే, రష్యా చమురు దిగుమతి అన్నది సాకు మాత్రమేనని స్పష్టమవుతున్నది.
ముడిచమురు దిగుమతుల విషయంలో గతంలో పశ్చిమాసియా దేశాలపై ఎక్కువ ఆధారపడిన ఇండియా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలయ్యాక తన విధానం మార్చుకుంది. ఉక్రెయిన్ పోరు ఆరంభమయ్యే వరకూ రష్యా నుంచి ఇండియా క్రూడాయిల్ దిగుమతులు రెండు శాతం కంటే తక్కువే. ఈ యుద్ధ పర్యవసానాల కారణంగా చవకగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు భారత్ చేసుకునే ఆయిల్ దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే కావడం గమనార్హం. రష్యా ఆయిల్‌ను ఎవరూ కొనకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతాయని, అది అమెరికా ప్రయోజనాలకు హానికరమని తెలిసే బైడెన్ సర్కారు అప్పట్లో ఆంక్షలు విధించలేదు. ఫలితంగా, అమెరికాకు భారత ఎగుమతులు 8,700 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదు. 2014లో మోదీ గద్దెనెక్కినప్పటి నుంచీ అమెరికాతో వాణిజ్య కార్యకలాపాలు పెంచుకోవడం, అగ్రరాజ్యానికి ఎగుమతులు ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరించారు. నిరంతరం మారుతూ ఉండే ట్రంప్ విధానాల వల్ల ఇండియా భారీగా నష్టపోయే పరిస్థితులు దాపురించాయి.
మోదీ తన సొంత రాష్ట్ర ప్రయోజనాలకు, అక్కడి మూలాలున్న రిలయన్స్ వంటి బడా కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారనేది జగమెరిగిన సత్యం. దేశంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం జామ్‌నగర్ రిఫైనరీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వ్యాపారంలో దిగ్గజంగా మారింది. ఫలితంగా ఈ కంపెనీ అధిపతి ముకేష్ అంబానీ ఆసియాలో అతిపెద్ద కుబేరుడయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, గుజరాతీ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు విధానాలు ముకేష్‌ను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. 2021కి ముందు జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ మొత్తం క్రూడాయిల్ దిగుమతుల్లో రష్యన్ ముడిచమురు వాటా 3 శాతమే. 2025లో రష్యా ఆయిల్ దిగుమతులు సగటున 50 శాతానికి ఎగబాకాయి.
ఈ వివరాలను ఫిన్లాండ్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఆయిల్ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) వెల్లడించింది. 2025 మొదటి ఏడు నెలల్లో 1.80 కోట్ల టన్నుల క్రూడాయిల్‌ను రష్యా నుంచి రిలయన్స్ దిగుమతి చేసుకుంది. అంటే మొత్తం మీద రష్యా నుంచి చేసుకునే ఈ దిగుమతులు ఇటీవల 64 శాతం వరకూ పెరిగినట్టు లెక్క. రిలయన్స్ చేసుకుంటున్న రష్యా ఆయిల్ దిగుమతులు, దాని ఎగుమతులను (2021 నుంచి 2025 జులై వరకు) ‘క్రియా’ పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 ఫిబ్రవరి నుంచి కిందటి జూలై వరకు ఈ రిఫైనరీ దాదాపు 8600 కోట్ల డాలర్ల విలువైన తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమంటే రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలకు ఈ మొత్తం ఎగుమతుల్లో 43% వెళ్లాయి.
మూడో వంతు ఎగుమతులు ఈయూకు, 630 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు అమెరికాకు చేరుకున్నాయి. 2025 జూలై చివరి వరకు ఈ రిఫైనరీ నుంచి దాని చమురు ఉత్పత్తుల ఎగుమతుల్లో సింహభాగం అమెరికాకు చేరుకోవడం విశేషం. 2025 ఈ రిఫైనరీ ఆయిల్ ఉత్పత్తుల అతిపెద్ద దిగుమతిదారు అమెరికా అయినప్పటికీ ట్రంప్ పోకడలు, దానికి మోదీ స్పందనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం పరిశీలకులకు వింతగా అనిపిస్తున్నది. ట్రంప్ టారిఫ్‌ల హెచ్చింపు వల్ల భారతదేశం యావత్తూ నష్టపోతుంటే రిలయన్స్ మాత్రం భారీగా లబ్ధి పొందుతున్నది. మరో పక్క రష్యా కంపెనీల మెజారిటీ వాటా ఉన్న నయారా ఆయిల్ కంపెనీకి గుజరాత్‌లోని వాదినర్లో రిలయన్స్ తర్వాత రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇది కూడా రష్యా క్రూడాయిల్తోనే నడుస్తున్నది.
ట్రంప్ సుంకాల పెంపు ఫలితంగా ఇండియాలో కుట్టిన దుస్తులు, వస్ర్తాలు, రొయ్యలు వంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు అమెరికాకు దాదాపు నిలిచిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇండియాలో ఆభరణాలు, టెక్స్టైల్స్ సహా అనేక ఉత్పత్తి, తయారీ రంగాల్లో సంక్షోభం ఏర్పడుతుంది. తిరుప్పూర్, బెంగళూరులోని టెక్స్టైల్ పరిశ్రమలు భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యాపారాలు మూతపడటమే గాక కార్మికులు ఉపాధి కోల్పో యే ప్రమాదం వచ్చింది. పలు పరిశ్రమలు ఇతర దేశాలకు తరలేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆర్థికపరమైన విషయాల్లో మోదీ ఇకపై దాగుడుమూతలు ఆడలేరు. ట్రంప్ ఆయనను ఇరుకున పెట్టారు. ఇకపై రష్యా ముడిచమురుకు బదులుగా అమెరికా నుంచి కొనుగోలు చేయాలన్నా, లేదా మరేదైనా ఏమీ గోప్యంగా ఉంచలేరు. దేశ ప్రజలు ఇప్పటికే ఆర్థిక నిర్వహణలో వైఫల్యాలకు మూల్యం చెల్లిస్తున్నారు. 50 శాతం సుంకాలతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కొవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు వలసపోయినట్టు పరిశ్రమలు మూతబడి నేడు కూడా చిన్నపాటి వలసలు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
ట్రంప్ మొదటి జమానాలో (20172021) అమెరికాలోని టెక్సస్ స్టేట్ హ్యూస్టన్‌లో అప్పటికి కొద్ది నెలల క్రితం రెండోసారి ప్రధాని అయిన మోదీ గౌరవార్థం 2019 సెప్టెంబర్‌లో ‘హౌడీ మోదీ’ పేరిట ఆర్భాటంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. అలాగే, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపును కాంక్షిస్తూ గుజరాత్ పూర్వ రాజధాని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ ట్రంప్‌ను లక్షలాది మంది జనం సమక్షంలో సన్మానించారు. అయితే, ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మరో పక్క ‘మోదీ గొప్పవాడు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించడం ఉభయ దేశాల ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నది. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, వాణిజ్య, వ్యాపార బంధాలు ఆ రెండు దేశాల పాలకుల మధ్య మితృత్వం ద్వారా ముందుకు సాగవని ఇన్నాళ్లకు అమెరికా, ఇండియా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
– నాంచారయ్య మెరుగుమాల