బడంగ్‌పేట, మార్చి16: విలీన సమయంలో బడంగ్‌పేటలో జరిగిన అవకతవకలపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృ త్వంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం 15 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో తనిఖీలు చేశారు. అధికారులు, సిబ్బంది వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీన సమయంలో వచ్చిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులు పరిశీలించే పనిలో పడ్డారు. గత కొన్ని నెలల నుంచి మీడియాలో వస్తున్న కథనాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణంలోకి తీసుకొని సోదా లు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు, అధికారులు ఎన్ని ఫేక్ ఫైల్స్ పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పనులు చేయ కుండనే బిల్లులు ఎత్తినట్లు ఫిర్యాదులు ఉన్నట్లు చెబుతున్నారు.
బడంగ్‌పేటలో ఇంత పెద్ద ఎత్తున్న నిధుల గోల్ మాల్ కావడా నికి సూత్రధారులు పాత్రదారులు ఎవరన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గంటల తరబడి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కొంత మంది అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం పట్ల ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఏ విధంగానైనా కార్యాలయానికి రావాలని డీసీ ద్వారా ఫోన్లు చేయించినట్లు తెలిసింది. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
గత కొన్ని నెలల నుంచి వివాదాలకు కారణమైన బడంగ్‌పేట సర్కిల్ లో విధులు నిర్వహించాలంటే అధికారులు భయం భయంగా ఉన్నారు. ఎప్పుడు ఏ అధికారులు వచ్చి సోదాలు చేస్తారోనని గత కొన్ని రోజుల నుంచి అధికారులు భయం గుప్పిట్లో ఉన్నారు. సోమవారం 11.45 గంటలకు బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు రావడంతో కొంత మంది అధికారులు, సిబ్బంది పరుగులు పెట్టారు. ఏసీబీ అధికారుల రాకతో సర్కిల్ కార్యాలయం ఒక్క సారిగా గప్ చుప్ అయింది. అధికారుల, సిబ్బంది ఫోన్లు మూగ బోయాయి. జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని భయ పడుతున్నారు.