రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటీ చేయలేదు సరికదా కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను అటకెక్కించి సంక్షేమ పథకాలను సామాన్యులకు అందకుండా చేసింది. ఆత్మస్తుతి పరనింద తప్ప పరిపాలన చేయలేకపోతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల ఆశలు అడుగంటి పోతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాలను గాలికొదిలేసిన కాంగ్రెస్ రాజకీయ గ్రహాలు ప్రతీకార‘కక్ష‘ వెంటే పరిభ్రమిస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రసంగాల్లో పరిపాలనకు సంబంధించిన ఒక్క ఉదాత్తమైన, నిర్మాణాత్మకమైన అంశం వినిపించలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వైఫల్యాలను ఒప్పుకునే సంస్కారం మచ్చుకైనా కనిపించడంలేదు. ఉదయాస్తమానాలు కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఆడిపోసుకోవడం, అసత్యాలు, అర్ధసత్యాలు, దుర్భాషలు తప్ప ఇంకేమీ ఉండటంలేదు. గత ప్రభుత్వ జ్ఞాపకాలను తుడిచేయాలన్న దుగ్ధ తప్ప, పాలనపై తమదైన ముద్ర వేసి భవిష్యత్తు తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలన్న సోయి ప్రభుత్వ పెద్దలకు లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఏ కేసులో ఇరికిద్దామా? సిట్, కమిషన్ విచారణల పేరుతో ఎలా వెంటాడుదామా? అనే లక్ష్యంతోనే పరిపాలన సాగిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇందుకేనా కాంగ్రెస్ గెలిచింది అని ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
తెలంగాణ సకలార్థ ప్రదాయిని కాళేశ్వరం అంటేనే కాంగ్రెస్‌కు కండ్ల మంట. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పియర్స్‌కు పగుళ్లు ఏర్పడితే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు గంగలో కలిసిపోయాయని హస్తం పార్టీ నేతలు ప్రచారం చేశారు. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాళేశ్వరం నిర్మాణాలు చెక్కుచెదరలేదు. సుప్రసిద్ధ అంతర్జాతీయస్థాయి డిస్కవరీ చానెల్, అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక, వాటర్మాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాజేంద్రసింగ్, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించాయి. కానీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదవిలోకి వచ్చిన తొలినాళ్లలోనే శపథం చేసిన రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టు వల్ల ఎలాంటి లాభం లేదని, అది కూలిపోతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీళ్లు రావని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేండ్ల నుంచి అదే గాయి మాటలు మాట్లాడుతున్నారు. పోయిన వానకాలంలో తెలంగాణ ఒక జలప్రళయం చూసింది. అయినా మేడిగడ్డ చెక్కుచెదరలేదు. కేసీఆర్‌ను మాత్రం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు నిలబెట్టి కాంగ్రెస్ పాలకులు పైశాచిక ఆనందం పొందారు. ఒకవైపు కాళేశ్వరం నీరు అన్నిరకాలుగా ఉపయోగపడుతుంటే, అనుబంధ నిర్మాణాలకు కొబ్బరికాయలు కొడుతూ పూలు చల్లుతూ మరోవైపు కాళేశ్వరంపై బురదజల్లడం సీఎం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఎట్టకేలకు బీఆర్ఎస్ సహా జలవనరుల నిపుణులు, ప్రజల ఒత్తిడితోప్రభుత్వంలో కదలిక వచ్చింది. కాళేశ్వరం విలువ తెలియ వచ్చింది. ప్రపంచ సుందరీమణుల పోటీలకు, మెస్సీ ఫుట్‌బాల్ ఆటకు చేసిన ఖర్చుతో కాళేశ్వరం మరమ్మత్తు ఎప్పుడో పూర్తయ్యేది. రైతులు బాగుపడేవారు. కక్షపూరిత రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో చెప్పేందుకు కాళేశ్వరం పునరుద్ధరణలో రెండేండ్ల జాప్యం ఒక మచ్చుతునక.
మూడేండ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ రేసర్లు ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌లో కొలువుదీరారు. సాధారణంగా నిబంధనలు సంతృప్తికరంగా పాటిస్తే తప్ప, ఎక్కడపడితే అక్కడ ఈ-కార్ రేస్ పోటీలకు అంతర్జాతీయ సంస్థలు అంగీకరించవు. అప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రిగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ పట్టుదలతో ఈ-కార్ రేస్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఈవెంట్‌ను కొనసాగించి ఉంటే రాష్ర్టానికి పేరు ప్రతిష్ఠతోపాటు ఎంతో లబ్ధి చేకూరేది. కానీ ఈ-కార్ రేస్ కొనసాగించడం సంగతి అటుంచితే, ఏదో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు ఆ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు. వాస్తవానికి డబ్బు లావాదేవీలన్నీ పారదర్శకంగా బ్యాంకుల ద్వారానే జరిగాయి. అయినా రేవంత్ ప్రభుత్వం ఏసీబీ కేసు బనాయించి కేటీఆర్‌ను విచారణ అధికారుల ఎదుట నిలబెట్టింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కొనసాగిస్తే దాన్ని ప్రారంభించిన కేటీఆర్ పేరు పునరావృతం అవుతుందన్న దుగ్ధతోనే తెలంగాణ ప్రతిష్ఠను ఇనుముడింపజేసే ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి రేవంత్ ప్రభుత్వం మంగళం పాడింది.
రేవంత్ ప్రభుత్వం అంతటితో ఆగలేదు. నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ హరీశ్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు రప్పించింది. ఫార్ములా ఈ-కార్ కేస్‌లో కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించినట్టే హరీశ్‌రావును కూడా ఏడున్నర గంటలు సిట్ విచారించింది. హరీశ్‌రావు మాజీ మంత్రి, రెండు దశాబ్దాలకు పైగా శాసనసభ్యునిగా అజేయంగా కొనసాగుతున్న ప్రజాప్రతినిధి. ఆయన ఎక్కడికీ పారిపోరు. అయినా ఆగమేఘాల మీద రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి నోటీస్ పంపించారు. అప్పుడు హరీశ్‌రావు సిద్దిపేటలో ఉన్నారు. కనీసం వచ్చే వరకైనా ఆగాలి కదా. సిబ్బంది చేతికిచ్చి తెల్లారి 11 గంటలకే సిట్ ముందు హాజరుకావాలని హుకుం జారీ చేయడం ఎంత దుర్మార్గం! కొన్నాళ్ల కిందట ఇదే హరీశ్‌రావుపై సిద్దిపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో ముందుగా హైకోర్టును, తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులు హరీశ్‌రావుపై మోపిన అభియోగాన్ని కొట్టివేశాయి. సంబంధం లేకపోయినా రేవంత్ ప్రభుత్వం ఈ కేసులో తలదూర్చి అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించి, చివరికి అభాసుపాలయింది.. ప్రజాధనం వృథా అయిం ది. ఆ అక్కసుతో మరో ఫోన్ ట్యాపింగ్ అభియోగంలో సిట్‌ను ప్రయోగించింది. తాజాగా కేటీఆర్‌కు కూడా ఫోన్‌ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం ఆ కక్షల పరంపరలో భాగమే. ఈ మూడు ఉదంతాలలో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కాదు కదా కనీసం ఎలుక తోకను కూడా పట్టుకోలేకపోయింది. ఈ కేసులలో పసలేదన్న విషయం రేవంత్ ప్రభుత్వానికి తెలియనిది కాదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల సిద్ధాంతం ఈ చర్యల వెనుక దాగి ఉన్నది. ఒకటి.. నానాటికి తీవ్రమవుతున్న ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడం. రెండు, కేసీఆర్ కుటుంబంపై కక్ష తీర్చుకోవడం. మొదట్లో మైకు ముందుకొచ్చిన ప్రతి సందర్భంలో ఇదిగో జైలు.. అదిగో జైలు అంటూ బెదరగొట్టడానికి ప్రయత్నించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలు.. ఏ విచారణకైనా సిద్ధమేనని, న్యాయపోరాటం చేస్తామని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కేసులు, జైళ్లు కొత్త కాదని, ఉద్యమంలో చూసినవేనని మొక్కవోని ధైర్యంతో ప్రకటిస్తూ ఉండటంతో రేవంత్ ప్రభుత్వం ఎటూ పాలుపోని స్థితికి చేరుకున్నది.
ఇటీవలి బొగ్గు కుంభకోణం సహా సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం, మద్యం సీసాల లేబుళ్ల పంచాయితీ, వివిధ లావాదేవీల్లో తుపాకులు చూపించి బెదిరిస్తున్నారని ఓ మంత్రి కూతురు చేసిన ప్రకటన, కాంట్రాక్టులు, కమీషన్ల పంపకాలలో మంత్రుల మధ్య రచ్చకెక్కిన తగాదాలు, రైతుల ఆత్మహత్యలు, గురుకులాల్లో పిల్లల మరణాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఘోషలు, నేరాలు ఘోరాలు ఇలా వీటన్నింటిపై కూడా విచారణ కమిషన్లు, సిట్లు ఏర్పాటు చేయాలి.
కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే వేరే పనిలేనట్టు ప్రతీకార రాజకీయాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార ముద్రలో కాకతీయ శిలాతోర ణం, చార్మినార్ లేకుండా చేయాలని యత్నించా రు. తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతల ప్రతిఘటనలతో సర్కార్‌కు అది సాధ్యం కాలేదు. ఇక టీఎస్‌ను టీజీగా మార్చారు. ఎవరికోసమో ఎందుకోసమో దానివల్ల లాభమేంటో ఎవరికీ తెలియదు. అంతేకాకుండా హస్తం పార్టీ నేతలకు కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని ప్రజలపై, ప్రజల ఆరాధ్య దైవాలపైనా చూపించారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. తెలంగాణ కిరీటాన్ని తీసేశారు. తల్లి చేతిలో బతుకమ్మను లేకుండా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా లేకుండా చేస్తున్నారు. పేదింటి ఆడబిడ్డకు ప్రసూతి సమయంలో ఇచ్చే అత్యంత ఆవశ్యకమైన కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దుచేశారు.
కేసీఆర్ మీద కోపాన్ని బాలింతలు, శిశువులపై కూడా చూపిస్తున్నారంటే కాంగ్రెస్ నేతల పగ, ప్రతీకారం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ ప్రజలను బలి పశువులను చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొన్న కేసీఆర్, ఆయన ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించారు. తెలంగాణలో స్థిరపడ్డ ఇతర రాష్ర్టాల ప్రజల మనోభావాలను గౌరవించారు. సంస్కారం అంటే అది.
ఇటీవలి బొగ్గు కుంభకోణం సహా సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం, మద్యం సీసాల లేబుళ్ల పంచాయితీ, వివిధ లావాదేవీల్లో తుపాకులు చూపించి బెదిరిస్తున్నారన్న ఓ క్యాబినెట్ మంత్రి కూతురు ప్రకటన, కాంట్రాక్టులు, కమీషన్ల పంపకాలలో మంత్రుల మధ్య రచ్చకెక్కిన తగాదాలు, రైతుల ఆత్మహత్యలు, గురుకులాల్లో పిల్లల మరణాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఘోషలు, నేరాలు ఘోరాలు ఇలా వీటన్నింటిపైనా కమిషన్లు, సిట్లు ఏర్పాటు చేయాలి. కానీ అవన్నీ వదిలేసి ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం తగని పని. ముఖం బాగాలేదని అద్దాన్ని పగలగొడితే ప్రయోజనం ఏమిటి?