మోదీ సర్కార్ తీరును ప్రశ్నిస్తే చాలు.. ఆ వ్యక్తి రాజకీయ ప్రత్యర్థిగానీ, జర్నలిస్టుగానీ, ఆఖరికి సినీపరిశ్రమకు చెందిన వాళ్లయినా వారికి వేధింపులు తప్పవు. అకస్మాత్తుగా వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు జరుపుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి సంస్థలు కేసులు నమోదు చేస్తాయి. ఈ ధోరణి ఏ స్థాయికి చేరుకున్నదంటే.. ఒక ప్రభుత్వ అధికారి తన విధుల్లో భాగంగా అధికారపక్షాన్ని నిలదీసినా కూడా ఆ అధికారి మీదా కేసుల మోత. అక్కడితోనే ఆగదు.. ఆయావ్యక్తుల కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల మీదా కేసులు, చర్యలు. మోదీ హయాంలో గత ఏడేండ్లలో నమోదైన ఈ తరహా కేసుల గురించి ఎన్డీటీవీ జరిపిన విశ్లేషణ ఇది.
మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుండి 570 మంది రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై దర్యాప్తుసంస్థలు కేసులు పెట్టాయి. వీరిలో విపక్ష రాజకీయనేతలు, వారి కుటుంబసభ్యులు, బంధువులు, కార్యకర్తలు, లాయర్లు, స్వతంత్ర మీడియా సంస్థలు, జర్నలిస్టులు, సినీపరిశ్రమకు చెందినవాళ్లు ఉన్నారు. అధికారపార్టీ వైఖరిని ప్రశ్నిస్తే ఏకంగా ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు పెట్టారు. మొత్తమ్మీద బాధితుల్లో అత్యధికులు రాజకీయనేతలేనని తెలుస్తున్నది. 257 మంది నేతలపై, వారి బంధువులు, అనుచరులు 140 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గత ఏడేండ్లలో.. బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన కేవలం 39 మంది మీద మాత్రమే కేసులు పెట్టారు.
దర్యాప్తు సంస్థల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నవారిలో కాంగ్రెస్‌పార్టీకి చెందినవాళ్లు 75 మంది ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ నేతలు 36 మంది ఉన్నారు. మూడోస్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (కేజ్రీవాల్‌తోపాటు 18 మంది) ఉంది. దాదాపుగా బీజేపీయేతర పార్టీలన్నింటి వెనుకా దర్యాప్తు సంస్థలు పడ్డాయని విశ్లేషణలో తెలుస్తున్నది. కశ్మీర్లో షేక్‌అబ్దుల్లా ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ నుంచి మొదలుపెడితే తమిళనాడులో స్టాలిన్ అనుచరులు, బంధువుల వరకూ బాధితుల్లో ఉన్నారు.
ప్రత్యర్థి రాజకీయనేతల మీద మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని విమర్శించిన ఎవరినీ వదిలిపెట్టని పరిస్థితి ఉంది. వీరి సంఖ్య 121. బాలీవుడ్ హీరోయిన్ తాప్సీపన్ను, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌లు వేధింపులు ఎదుర్కొన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కుటుంబసభ్యులు, బంధువులపై ఆదాయపు పన్ను కేసులు నమోదయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షా ఎన్నికలకోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై వారిద్దరికీ ఎన్నికలసంఘం (ఈసీ) క్లీన్చిట్ ఇచ్చినప్పుడు.. ఈసీలోనే ఒక కమిషనర్‌గా ఉన్న అశోక్ లావాసా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికీ వేధింపులు తప్పలేదు. ఇక బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వామపక్షీయులు, వామపక్ష సానుభూతిపరులపై బోలెడన్ని కేసులు. భీమా కోరేగావ్ అంశంలో వరవరరావు, సుధా భరద్వాజ్ తదితరులపై కేసులు పెట్టడమేగాక అరెస్టు చేసి జైలుకు పంపారు.
విపక్షాలు, విమర్శకుల విషయంలో యూపీఏ-2 ప్రభుత్వంతో పోల్చితే మోదీ హయాంలో కేసులు అనేక రెట్లు పెరిగాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఉన్నప్పుడు 85 మంది వ్యక్తులు లేదా సంస్థలకు కేంద్రదర్యాప్తు సంస్థల నుండి వేధింపులు ఎదురుకాగా.. మోదీ హయాంలో 570 మందిపై కేసులు పెట్టారు. అంటే యూపీఏ-2 ఐదేండ్లలో ఏటా సగటున 17 కేసులు నమోదుకాగా, మోదీ ఏడేండ్ల హయాంలో ఏటా 81 కేసులు పెట్టారు.
సొంతపార్టీ నేతలు, మిత్రపక్షాల నాయకులపై కేసుల నమోదు విషయంలోనూ ఈ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. యూపీఏ-2 హయాంలో 27 మంది కాంగ్రెస్, యూపీఏ పక్షాల నేతలపై కేసులు పెట్టారు. అంటే, ‘స్వజనులపై’ ఒక కేసు నమోదైతే, ప్రత్యర్థులపై మూడు కేసులు నమోదయ్యాయి. మోదీ సర్కార్ వచ్చిన ఏడేండ్లలో 39 మంది బీజేపీ, మిత్రపక్ష నేతలపై నమోదయ్యాయి. అంటే ‘స్వజనులపై’ ఒక కేసు నమోదైతే, ప్రత్యర్థులపై 15 కేసులు పెట్టారు. అంటే నాటికి నేటికీ ఐదు రెట్ల పెరుగుదల.
కేంద్రం సారథ్యంలో ఉండే సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను విభాగం, ఢిల్లీ పోలీసు, జమ్ము కశ్మీర్ యంత్రాంగం నమోదు చేసిన కేసులు, తీసుకున్న చర్యలకు సంబంధించిన బహిరంగ వివరాలను దాదాపు మూడు నెలలపాటు విశ్లేషించి ఎన్డీటీవీ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆయా కేసుల మంచిచెడ్డలపై ఎటువంటి వ్యాఖ్య లేకుండా గణాంకాలను మాత్రం విశ్లేషించింది. విపక్షాలు, విమర్శకులపై కేసుల అంశాన్ని రాజకీయకోణంలో చూడవద్దంటున్న బీజేపీ వాదనపై ఈ విశ్లేషణ ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఎందుకంటే బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలపై స్వల్పస్థాయిలో మాత్రమే కేసులు ఉండగా.. విపక్షాలపైనే లెక్కకుమిక్కిలి నమోదైనాయి. కేసులు నమోదైన సందర్భాలు కూడా గమనార్హమైనవి. ఎన్నికలు జరగటానికి ముందు, రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు ఈ కేసులు అధికంగా పెట్టారు. దీనికి తాజా ఉదాహరణ.. యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అఖిలేశ్ యాదవ్ అనుచర నేతల మీద ఐటీ అధికారులు ఇటీవల దాడులు జరిపారు.
ఈ ఏడాది పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితులు కనిపించాయి. 14 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబసభ్యులపై కేసులు పెట్టగా, 8 మంది డీఎంకే నేతలు, వారి సన్నిహితులపై చర్యలు చేపట్టారు. వీరిలో డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు, అల్లుడు కూడా ఉన్నారు. కానీ, బీజేపీ నేతలపై సాక్ష్యాధారాలతో సహా ఆరోపణలు వచ్చినా కూడా వాటిని దర్యాప్తు సంస్థలు పట్టించుకోవటం లేదు. రాజస్థాన్ (2020లో), కర్ణాటక (2018లో) రాష్ర్టాల్లో తమ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టటానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ ఆడియో క్లిప్పులను విడుదల చేసింది. కానీ, వాటిపై కేంద్ర సంస్థలు దర్యాప్తు కూడా చేపట్టలేదు.
చేరితే బీజేపీలో చేరాలి.. లేదంటే రాజకీయాలు మానుకోవాలి అన్నట్లుగా ఉంది దేశంలో విపక్ష రాజకీయ నేతల పరిస్థితి. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ పాటిల్ మాటలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాయి. రాష్ట్రంలో 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరుగటానికి ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు ఆయన. ఆ పార్టీలో చేరాక ప్రశాంతంగా ఉందని, ఎటువంటి దర్యాప్తులు లేవని, నిద్ర బాగా పడుతున్నదని ఇటీవల ఓ బహిరంగ కార్యక్రమంలో స్టేజీ మీదే చెప్పారు పాటిల్. మహారాష్ట్రకే చెందిన బీజేపీ ఎంపీ సంజయ్ పాటిల్‌ది కూడా ఇదే మాట. బీజేపీలో చేరిన తర్వాత ఈడీగానీ మరే ఇతర కేంద్రసంస్థగానీ తన వెంట పడటం లేదని వెల్లడించారు.
మీడియాపై ఉక్కుపాదం
ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తూ, విమర్శిస్తున్న 29 మీడియా సంస్థలు లేదా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘దైనిక్ భాస్కర్’, టీవీ ఛానల్ ‘భారత్ సమాచార్’ కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు జరిపాయి. యూపీలో కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవటంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టటమే ఈ మీడియాసంస్థలు చేసిన నేరం.
యూపీఏ-2 (2009-14)
85 కేసులు
17 ఏటా సగటున
మోదీ సర్కార్ (2014-21)
570 కేసులు
81 ఏటా సగటున
(ఎన్డీటీవీ సౌజన్యంతో)