ఇంటిని ధ్వంసం చెయ్యగలరు! అద్దాన్ని ముక్కలు చెయ్యగలరు! కానీ, చరిత్రను చెరిపేయలేరు! హామీల అమలెక్కడ? అని ప్రశ్నించినందుకు రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన తన మార్కును గజ్వేల్‌పై చూపించింది. ‘తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ నాయకుడు, రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకా గర్జించలేదు! కన్నెత్తి కూడా మీవైపు చూడలేదు. కనీసం మీ పేరు కూడా ఉచ్చరించలేదు. అయినప్పటికీ గడగడలాడిపోతున్నారు’.
కేసీఆర్ క్యాంపు కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ రంగు వేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం వారి రౌడీయిజానికి పరాకాష్ఠ. తెలంగాణను సాధించాక నీళ్లు లేక, నిధులు రాక, కష్టాలు, కన్నీళ్లతో, కడగండ్లతో అథోగతిగా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన దేశాలు, రాష్ర్టాల సరసన చేర్చారు కేసీఆర్. ఇది ఆయన పరిపాలన మార్క్. ఇది ఎవరూ కాదనలేని సత్యం. చెరిపేస్తే చెరగనిది, దాచేస్తే దాగనిది.
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలన ఆరు గ్యారెంటీల పేరుతో ఆకాశమంతా హామీలిచ్చి ఆవగింజంత కూడా అమలు చెయ్యకపోవటం విఫల పాలనకు నిదర్శనం. అన్నిరంగాల్లో విఫలమైన పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మరొకసారి రౌడీయిజాన్ని చూపించింది.
రేవంత్ సర్కార్ పాలనలో కూల్చిన పేదల ఇండ్లు ఎన్ని? సీఎం, ఆయన పార్టీ నేతలు ఆక్రమించిన భూమి ఎంత? తెచ్చిన అప్పు ఎంత? అని ఒక ప్రహసనంగా కొనసాగుతున్న పరిపాలనపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల వరకు ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది సహించలేని, జీర్ణించుకోలేనివారు దాడులు చేస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ స్వభావం అది కాదు. ప్రజాస్వామ్యంలో ఎదుటి పక్షానికి స్వేచ్ఛ ఉండాలని బీఆర్ఎస్ భావించింది. అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘వారికి అవకాశం ఇవ్వాలి. వారు విఫలమైనప్పుడు మాట్లాడాలి’ అని అన్నారు. అన్నిరంగాల్లో పాలకపక్షం విఫలమైన నేపథ్యంలో మౌనంగా ఉండడం మంచిది కాదని బీఆర్ఎస్ యంత్రాంగం కదులుతున్నది. దీనిని జీర్ణించుకోలేని సీఎం, ఆయన అనుచరగణం విధ్వంసకాండకు పూనుకుంటున్నది. గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగిస్తూనే పాలక పక్షం చేసే తప్పుడు విధాలను సూటిగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారు. దీనిని తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఖండించలేకపోవచ్చు.
కానీ తగిన సమయంలో తగిన విధంగా సమాధానం చెప్తారు. అభివృద్ధిలో కేసీఆర్ అడుగుజాడల్లో నడవకపోయినా సరే..చేసిన అభివృద్ధిని తుడిచే ప్రయత్నం చేయకూడదు. వెలుగుతున్న సూర్యుడిని ఆపలేరు. అది ఎవరివల్ల్లా కాదు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంత చెరపాలని అనుకున్నా చెరిగేది కాదు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద చేసింది దాడి మాత్రమే కాదు. తెలంగాణ మీద, తెలంగాణ నాయకత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడిగా తెలంగాణ సమాజం భావిస్తున్నది. తెలంగాణ ప్రజలు వాస్తవాలు గుర్తిస్తున్నారు. ‘ఇపుడు చేసిన ఈ దాడి మీ ప్రభుత్వంపై మీరు చేసుకున్నదే. మీ కుర్చీని మీరే కూలగొట్టుకొంటున్నారు’. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇది ఒక పునాది. ఇది తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిన ఒకానొక ఘటన. దీనికి కాంగ్రెస్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
– డాక్టర్ సత్య