సుమారు పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ దుష్టపాలనతో విసిగిపోయిన ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నెన్నో ఆశలు కల్పించింది. అడ్డగోలుగా హామీలు గుప్పించింది. మధ్యతరగతికి, నిరుద్యోగ యువతకు అరచేతిలో వైకుంఠం చూపింది. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఇమేజీని సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది. ఈ మాయోపాయాలన్నిటితో పన్నెండేండ్ల క్రితం ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా ఏనాడూ ఎంపీగా కూడా గెలువని మోదీని నేరుగా ప్రధాని పదవిలో కూర్చోబెట్టింది. మొదటి విడత కంటే రెండో విడత ఎక్కువ మెజారిటీ రావడం ప్రజలు బీజేపీకి దిద్దుబాటుకు ఇచ్చిన అవకాశం. దీన్ని అర్థం చేసుకోకుండా విర్రవీగడంతో అసహనానికి గురైన ప్రజలు మూడో విడత మెజారిటీ దిగువకు తోసేశారు. అయినా మిత్ర పక్షాల సాయంతో బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది.
ఈ పన్నెండేండ్లలో దేశ ప్రజలు బావుకున్నది ఏమైనా ఉన్నదా? అంటే హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా అనే చెప్పుకోవాలి. ఎడాపెడా గుప్పించిన హామీలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మరోవైపు అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఉన్నది కాస్తా ఊడిపోయి సర్వమంగళం పాడినట్టుగా నానాటికీ దేశ పరిస్థితి మోదీ నేతృత్వంలో తీసికట్టుగా మారింది. సరిగా పన్నెండేండ్ల క్రితం మే నెల 26న ప్రధానిగా నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్’ తెస్తాననే బాసతో పదవీ ప్రమాణం చేశారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రజలు ఆ అచ్చే దిన్ ఎప్పుడా అని చాతక పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నారు. అది జరగకపోగా సకల రంగాల వైఫల్యంతో సర్వభ్రష్టత్వం సంప్రాప్తం చెంది చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్క మంచి పని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజల సమస్యకు మోదీ సర్కార్ ఏ పరిష్కారం చూపలేకపోయింది. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చరిల్లితే బీజేపీ హయాం అసమర్థతకు గీటురాయిగా నిలిచింది.
అనాలోచిత నిర్ణయాలకు మోదీ పాలన కేరాఫ్‌గా మారింది. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను, అతలాకుతలం చేసి తిరోగమనానికి కారణమైంది. కరోనా కల్లోల కాలంలో హఠాత్తుగా ప్రకటించిన లాక్డౌన్ ప్రజల జీవితాలతో, ముఖ్యంగా వలస బతుకులతో చెలగాటమాడింది. వీటిని ప్రత్యేక ఘట్టాలుగా చూసినా, ఇతర అంశాల్లో పరిపాలన ఏమైనా మెరుగ్గా ఉన్నదా అంటే అదీ లేదు. కార్పొరేట్లు ప్రభుత్వానికి దగ్గరి చుట్టాలయ్యారు. ప్రజాసంక్షేమం కొండెక్కింది. రైతుష్టాలు రెండింతలైనాయి. అసలు వ్యవసాయాన్నే కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తెచ్చిన నల్లచట్టాలను వదిలించుకొనేందుకు రైతులు రక్తతర్పణం చేయాల్సి వచ్చింది. సర్కార్ సాయం లేక రోజుకో రైతు ఉసురు తీసుకొనే రోజులు వచ్చాయి. మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. బేటీ బచావో- బేటీ పఢావో నినాదం నీరుగారి ఆడపిల్లలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు పెరిగిపోయి అభద్రత నిరంతరం వెంటాడుతున్నది.
ధరల పెరుగుదల, రుణభారం, అథఃపాళానికి రూపాయి పతనం ప్రజల దైనందిన జీవితం మీద తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దేశపౌరుల్లో ప్రతిఒక్కరి తలపై రూ.1.48 లక్షల రుణభారం వేలాడుతున్నది. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, పేపర్ లీకులతో యువత ఆగమైపోతున్నది. అంతరంగిక భద్రత గాల్లో కలిసి క్రమం తప్పకుండా ఉగ్రదాడులు జరుగుతూ సవాల్ చేస్తున్నాయి. మోదీ సూటూబూటూ వేసుకుని ఖరీదైన కండ్లద్దాలు పెట్టుకుని జరిపే విదేశీ యాత్రలు విహార యాత్రలుగా తయారయ్యాయి. ప్రజాధనం వేలకోట్లలో ఖర్చు చేసినా అంతర్జాతీయంగా దేశానికి ఒరిగింది ఏమీలేదు. ఇవాళ విశ్వవేదికపై భారత ప్రతిష్ట దెబ్బతిన్నది. స్వతంత్ర విదేశాంగ విధానం ఎక్కడో దారితప్పింది. ఒక అగ్రరాజ్యానికి మన పాలక పెద్దలు జీ హుజూర్ అంటున్నారు.
మరోవైపు దౌత్య వైఫల్యంతో మిత్రులందరూ చేజారిపోయి చుట్టుముట్టూ శత్రువులు పెరిగిపోయారు. 50కి పైగా ప్రగతి సూచీల్లో దేశం అథమస్థానానికి పడిపోవటంతో విశ్వగురు ప్రచారం వట్టి డొల్లగా తేలిపోయింది. ఇదివరకటి యూపీఏ ప్రధానిని మౌనమునిగా బీజేపీ ఎద్దేవా చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ పత్రికా సమావేశాల నుంచి మోదీ పలాయనంతో పరువు పోతున్నది. దాని మీద బీజేపీ నోరువిప్పదు. పోయిన ఎన్నికల్లో బీజేపీని మెజారిటీ మార్కు దిగువకు దించిన ఓటర్లు, ఈసారి పూర్తిగా ఇంటికి పంపే అవకాశాలే మెండుగా కనిపిస్తుండటంలో ఆశ్చర్యం ఏమున్నది?