తెలంగాణలోని ఒక గ్రామం 2025 జనవరిలో ప్రవేశించిన వేళ ఏ విధంగా ఉందనే కథనం ఇది. ఆ ఊరు నల్లగొండ జిల్లాలోనిది. కొన్ని కారణాల వల్ల పేరు రాయటం లేదు. అక్కడ కొద్దిరోజులు గడిపిన మీదట గమనించిన విషయాలివి. ఇది అన్ని విషయాల గురించి సమగ్ర సర్వే వంటిది కాదు. కొద్ది రోజులలో అది సాధ్యం కాదు కూడా. పైగా ఉద్దేశం సర్వే కాదు, సమగ్రతా కాదు. అక్కడి పరిస్థితులను వీలైనంత వరకు చూస్తూ పోవటం, ప్రజల నుంచి వింటూ పోవటం వరకే. ఆయా అంశాలపై వారితో చర్చించటమో, వాదించటమో అంతకన్నా కాదు. ఏ విషయాలైనా వివరంగా ప్రస్తావనకు వచ్చాయంటే అవి వారు తమంతట తాము చెప్పినవే. మొత్తం మీద అక్కడ చూసిన, ప్రజలు చెప్పిన విషయాలను బట్టి, అక్కడ వస్తున్న మార్పులు అనేకం ఉన్నట్టు అర్థమైంది. వాటిలో మంచి చెడులు రెండూ ఉన్నాయి.
Telangana | ఆ ఊరి జనాభా కచ్చితంగా ఇంత అని ఎవరూ చెప్పలేకపోయారు. ఇప్పుడిప్పుడే మాజీ అయిన సర్పంచ్‌తో సహా. వేర్వేరు వ్యక్తుల అంచనాలు 1,500 నుంచి 2,000 వరకు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య అంచనాలు కూడా అందుకు వందల తేడాలతో వినిపించాయి. ప్రజలలో అత్యధికులు బీసీలు, ఎస్సీలు. పెద్ద చెరువున్నది. ఎండకాలంలోనూ నీళ్లుంటాయి. బోర్లు కూడా తగినన్ని ఉన్నాయి. వరి, వేరుశనగ, మిరప, మక్కజొన్న ప్రధానమైన పంటలు. కొబ్బరిచెట్లు కూడా చాలా కనిపించాయి. మంచినీరు, కరెంటు, సిమెంటు రోడ్లు, స్కూలు, ఆరోగ్య కేంద్రం, బస్సు రవాణా, సమీప గ్రామంలో పోలీసు స్టేషన్ వంటి వసతులన్నీ ఉన్నాయి. కొద్ది మందికి కార్లు, చాలామందికి మోటార్ బైకులున్నాయి. ఊరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ ఉన్నాయి. కొందరు మాజీ నక్సలైట్లున్నారు. దేని బలం ఎంతన్నది తర్వాత చూడవచ్చు. వాటిలో ఒక పార్టీకి జిల్లా స్థాయి నాయకునిది ఇదే ఊరు.
ప్రజలలో అధికులు రైతులు, వ్యవసాయ కూలీలు, కల్లుగీత వారు, నేతపని వారు. రజకుల వంటి ఇతర వృత్తుల వారూ ఉన్నారు. ఊరిలో పేదరికమన్నది లేదు. అన్ని సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయి. వాటి అమలుతీరులో కొత్త ప్రభుత్వ పాలనలో వచ్చిన తేడాలను మునుముందు చూద్దాము. గ్రామంలో ఎక్కువగా ఉన్నది గ్రామ దేవతలే. ఒకటి, రెండు మాత్రం కాస్త పెద్ద గుళ్లున్నాయి. మరొకటి కట్టాలని ఆలోచిస్తున్నారు. జనాభాలో అతికొద్ది మం ది మాత్రం ముస్లింలు, క్రైస్తవులు. ఊరిలో చాయ దుకాణాలున్నాయి. అంతకన్న ఎక్కువగా బెల్టుషాపులున్నాయి. వాటి సంఖ్య 18. నీరు, విద్యుత్తు, రైతు పథకాల వల్ల మంచి పంటలు, వాటిపై ఆదాయాలు, సంక్షేమ పథకాల నగదు బదిలీ, అనేకులు హైదరాబాద్‌లో పనిచేస్తూ సంపాదిస్తుండటం అనే మూడు కారణాల వల్ల ఊరి వారి చేతిలో పైసలు గలగలలాడుతున్నాయి.
స్థూలంగా ఆ ఊరి ముఖచిత్రం ఇది. ఇందులో బెల్టుషాపులను, కొన్ని సందర్భాలలో కుటుంబ సంబంధాలలో అవాంఛనీయ మార్పులను మినహాయిస్తే తక్కినవన్నీ సానుకూలమైన పరిణామాలు. ఇది ‘కొద్దిగా’ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో మొదలైనా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో జరిగిందన్నది ఏకాభిప్రాయం. చెరువు గట్టు వెంట, పొలాల వెంట నడుస్తుండగా అందరూ, ఈ పదేండ్లలోనే చెరువు ఇంతగా నిండటం, కాలువలు పారటం, బోర్లలో నీళ్లు, వాటికి కరెంటు అనేవి మొదలయ్యాయన్నారు. దానితో అంతకుముందు పడావు పడ్డ భూములు సాగులోకి వచ్చినట్టు చెప్పారు. నాకూ చూపించారు. ఇవన్నీ ఇక ఎటూ పోయేవి కావు గనుక సుస్థిర ఫలితాలనిస్తున్నాయి. కొన్నింటి విషయంలో మాత్రం గత ఏడాదిగా అస్థిరతలు ఏర్పడ్డాయన్నది అందరి ఫిర్యాదుగా వినిపించింది. అవి, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మహిళలకు నెలకు రూ.2,500 మొదలైనవి. ఇవన్నీ తెలంగాణ అంతటా వినిపిస్తున్న మాటలే.
వాటి పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న మూడు కారణాల వల్ల గ్రామస్థుల చేతిలో డబ్బు గలగలలాడుతూనే ఉంది. దానితో వాళ్లేం చేస్తున్నారు? ఇప్పుడు ఆహారానికి, వస్ర్తాలకు, గృహవసతికి లోటులేదు. చిరిగిన బట్టల వారెవరూ కన్పించలేదు. ఎక్కువగా పెంకుటిళ్లే ఉన్నా, మెల్లమెల్లగా డాబా ఇళ్లు వస్తున్నాయి. కొద్దిమంది సీసీ కెమెరాలు పెడుతున్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ఆ ఊరికే వచ్చి తీసుకుపోయే స్కూలు బస్సులలో పొరుగూరి ప్రైవేటు స్కూళ్లకు పోతున్నారు. చాలామంది హైదరాబాద్‌లో కోర్సులు చదువుతున్నారు. సుమారు డజను మంది విదేశాలలో చదవటమో, ఉద్యోగాలు చేయటమో చేస్తున్నారు. పెళ్లిళ్లు కాని ఇతర ఫంక్షన్ల వద్ద కూడా ఒక మోస్తరు అట్టహాసాలు కన్పించాయి. మరొకవైపు, బాగా భూములున్న ఆసాములు మరింత బాగుపడటం కోసం క్రమక్రమంగా భూములు అమ్ముకొని, లేదా కౌలుకు ఇచ్చి నగరాలకు తరలిపోతుండగా, వారి కన్నా ఇంతకాలం దిగువ స్థాయిలో గలవారు వాటిని ఖరీదు చేయటమో, కౌలుకు తీసుకోవటమో కనిపిస్తున్నది. ఈ లావాదేవీలన్నీ సజావుగానే సాగుతున్నాయి. ఇందులోని ఒక ఆసక్తికర అంశం, బయటికిపోయి బాగుపడిన వారు ఇక్కడి తమ భూములలో కొంత భాగాన్ని, ఇళ్లను పేదలకో, ఊరి ఉపయోగానికో ఉచితంగా బదిలీ చేస్తుండటం. భూముల ధర అక్కడ ప్రస్తుతం ఎకరానికి రూ.30 లక్షలకు చేరినా ఇది కన్పిస్తున్నది. ఇళ్లున్నవారు రోడ్ల విస్తరణ కోసం ఒక అంగుళమైనా వదిలేందుకు ససేమిరా అంటున్న రోజులలో, ఇంటిముందున్న స్థలాలను పరిహారమైనా కోరకుండా వదులుతున్నారు.
ఒక్కొక్క షాపులో సగటు మద్యం అమ్మకాలు నెలకు లక్షకు పైమాటే.
అదనంగా చికెన్ ఆదాయాలుంటాయి. పంటల రాబడి, జీతాల రాబడి,
పింఛన్లు మొదలైన రాబడి సమయాలలో, పండుగలప్పుడు ఇంకా ఎక్కువ.
ఇంత చిన్న గ్రామంలో ఇంత ఖర్చుకు డబ్బెక్కడిదని అడగగా, నీకు చెప్పిన
రకరకాల రాబడులలోనే అందుకు సమాధానం ఉందన్నాడు.
ఆర్థిక పరిస్థితులు బాగుపడుతుండటంతో నేరాలు తగ్గిపోయాయి. ఒకప్పటి వలె పంటలకు, ధాన్యం కుప్పలకు కాపలా కాసుకోవటం లేదు. వ్యవసాయరంగంలో యాంత్రీకరణ వేగంగా పెరుగుతున్నది. ట్రాక్టర్లు మొదలుకొని హార్వెస్టర్ల వరకు అనేక యంత్రాలు ఆ ఊరిలో, దానిచుట్టుపక్కల గ్రామాలలో కన్పించాయి. అయినా కూలి పనులు చేసుకునేవారికి పనుల కొరత మాట వినిపించలేదు. సంక్షేమ పథకాలను కలుపుకొని వారి జీవితాలు సాఫీగానే సాగుతున్నాయి. దళితులపై అత్యాచారాల సూచనలు లేవు. అంటరానితనం పోయింది. అయితే దేవాలయ ప్రవేశం వంటి విషయాలలో వివక్ష ప్రశ్నపై నాకు స్పష్టత రాలేదు. కొందరు ఉందనగా కొందరు లేదన్నారు. నేరుగా వారితో మాట్లాడేందుకు వీలవలేదు. అయితే ఇతర చోట్ల వలె ఇక్కడ దళితులు ఇతర మతాలలో చేరిన సందర్భాలు అరుదు. దానిని ఒక సూచికగా తీసుకుంటే, వివక్షలు అంతగా లేవనుకోవాలి. వాళ్ల పిల్లలు స్కూళ్లలో అందరితో కలిసే కూర్చుంటున్నారు, ఆడుకుంటున్నారు.
ఆర్థిక మార్పుల వల్ల కొన్ని వృత్తులపై ప్రభావం ఉంటున్నది. కొత్త తరం ఉనికిలోకి రావటం కూడా అందుకు ఒక కారణం. ఉదాహరణకు, ఊరిలో తాటిచెట్లు విరివిగా ఉన్నాయి. కల్లు తాగేవారు ఎక్కువే. ఇంకా చెప్పాలంటే అత్యధికులు తాగేవారే మహిళలతో సహా. కానీ, గీతకార్మికుల సంఖ్య బాగా తగ్గింది. కొత్త తరం వారు బయటకుపోగా మిగిలిన యువకులు కూడా చెట్లెక్కడం లేదు. నేత పరిశ్రమ కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నది. వారు పెద్ద సంఖ్యలో సూరత్, షోలాపూర్‌లకు పోగా ప్రస్తుతం ఇద్దరు మాత్రం చిన్న చిన్న పవర్‌లూమ్‌లు నడుపుతున్నారు. వయస్సు పైబడినవారు చాలామంది ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. అయినా అందులో చాలామంది ఏవో పనులు చేస్తూనే ఉన్నారు.
పార్టీలలో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు తోచింది. కాంగ్రెస్ ఇతరత్రా కూడా తక్కువ కాగా, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన తీరు వల్ల ప్రజలకు దానిపై గురి కుదరటం లేదు. బీజేపీ నామమాత్రం. గతంలో కమ్యూనిస్టులు, నక్సలైట్లు బలంగా ఉండినా వారు కూడా నామమాత్రమయ్యారు. కనుమరుగయ్యారనటం ఇంకా సరిగా ఉంటుంది.
నేను బస చేసిన మిత్రుని ఇంటికి సరిగా ఎదురుగా ఒక బెల్ట్‌షాప్ ఉంది. అక్కడి 18 షాపులలో అది ఒకటి. యజమానితో మాట్లాడి, గిరాకీ ఎవరు లేని ఒక మధ్యాహ్న సమయంలో లోపలకు వెళ్లి చూశాను. తనంతట తానే చాలా విషయాలు చెప్పాడు. ఇంకా తెల్లవారకముందు 4 నుంచి, రాత్రి 12 దాటిన తర్వాత వరకు వస్తూనే ఉంటారట. స్కూలు పిల్లలు కూడా అలవాటు పడుతున్నారని చెప్పి చాలా బాధపడ్డాడు. లోగడ బర్త్‌డేల వంటి సందర్భాలలో తమ కిరాణా షాపులో బిస్కెట్లు, చాక్లెట్లు కొని పంచేవారు. ఇప్పుడు అక్కడే కూర్చొని తాగుతారు, లేదా ఊరి బయటకుపోతారు. పిల్లలకు ఇదేం అలవాటంటే, మీకెందుకు అదంతా అని మాట్లాడతారు. కొందరు గృహిణులు కూడా ఫోన్ చేసి తెప్పించుకుంటారు. ఇతరుల మాటైతే చెప్పనక్కరలేదు. అయితే ఆరోగ్యాలు చెడిపోవటం, అకాల మరణాలు పెరుగుతున్నాయి. తాగిన గొడవలు అరుదు. స్టోర్ రూమును చూపించాడు. స్టాక్స్ బాగానే ఉన్నాయి. మొత్తం 18 బెల్ట్‌షాపుల పరిస్థితీ ఇదేనన్నాడు.
ఒక్కొక్క షాపులో సగటు మద్యం అమ్మకాలు నెలకు లక్షకు పైమాటే. అదనంగా చికెన్ ఆదాయాలుంటాయి. పంటల రాబడి, జీతాల రాబడి, పింఛన్లు మొదలైన రాబడి సమయాలలో, పండుగలప్పుడు ఇంకా ఎక్కువ. ఇంత చిన్న గ్రామంలో ఇంత ఖర్చుకు డబ్బెక్కడిదని అడగగా, నీకు చెప్పిన రకరకాల రాబడులలోనే అందుకు సమాధానం ఉందన్నాడు. ఒకరోజు నా మిత్రునితో కూర్చుని ఉండగా, తనకు ఎప్పుడో పరిచయం ఉండిన గీత కార్మికుడొకరు నడుముకు మోకుతో వచ్చాడు. మాటలు రావు. సైగలు చేస్తూ ఏదో అడుగుతున్నాడు. కొద్ది సేపటికి అర్థం చేసుకున్న మిత్రుడికి బెల్ట్‌షాప్‌కు పోయేందుకు డబ్బు అడుగుతున్నాడని అర్థమై కోప్పడి వెళ్లగొట్టాడు. తను కల్లు గీస్తున్నా లిక్కర్ కావాలనుకున్నాడు. మరునాడు ఉదయం చెరువు గట్టున వాకింగ్‌కు వెళ్లగా, ఒక పండు ముసలి బట్టలు ఉతుకుతున్నాడు.
అతను రజకుడు. కొడుకు హైదరాబాద్‌లో ఏదో పనిచేస్తూ సంపాదించుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తాగుడుకు పైసలడిగి, ఇవ్వకున్నా, ఇవ్వలేకున్నా కొడతాడట. అందువల్ల ఈ వయస్సులో కూడా ఉతుకుడు తప్పడం లేదన్నాడు. మనిషి గొంతులో బాధలేదు. నిర్వేదం ధ్వనించింది.
ఆర్థిక మార్పుల వెనువెంట సామాజిక, సాంస్కృతిక, మానవ సంబంధాల, కుటుంబ సంబంధాల మార్పులు, అంతిమంగా వ్యక్తికి తనతో తనకు ఉండే సంబంధంలోనూ మార్పులు సంభవిస్తాయంటారు సామాజిక శాస్త్రవేత్తలు. ఆ ఊరిలో ఆర్థికపరమైన మార్పులు కనిపిస్తున్నవే. తక్కిన వాటి పరిశీలనకు తగినంత సమయం అవసరం గాని, అయినా కొన్ని సూచనలు పై కథనంలో కనిపిస్తున్నవే. వాటితో పాటు గమనించవలసిన ముఖ్యమైన మార్పు మరొకటి ఉన్నది. అది, సామాన్యులకు ప్రభుత్వం పట్ల, గ్రామానికి చెందిన సంపన్నుల పట్ల ఉండే దృష్టిలో వస్తున్న మార్పులు. సంక్షేమ వ్యవస్థలు అనబడేవి, వాటి వెంట అంతకుమించిన విపరీత ధోరణులతో పాప్యులిజాలు వచ్చిన తర్వాత, సామాన్యుల్లో ఎంత లభించినా మరింత లభించాలనే ధోరణి, ప్రజా భాగస్వామ్యం లేకుండా అన్నీ ప్రభుత్వమే చేయాలనే ధోరణి పెరుగుతున్నట్టు వినటం, చదవటమే గాని, అందుకు ప్రత్యక్ష సూచనలు అక్కడ చూడగలిగాను. అదే మాదిరిగా, గ్రామానికి చెందిన కొందరు బయట ఎక్కడెక్కడో బాగా సంపాదించుతున్నప్పుడు, తిరిగి ప్రజా భాగస్వామ్యంతో నిమిత్తం లేకుండా గ్రామస్థుల కోసం నేరుగా, అట్లాగే గ్రామం కోసం వారే అంతా ఖర్చు చేయాలనటం. ఈ విధమైన ధోరణులు ఒక పద్ధతి ప్రకారం అర్థమయేందుకు సరైన అధ్యయనం అవసరం. అవన్నీ మారుతున్న తెలంగాణ ఆర్థికంతో పాటు మారుతున్న సోషియాలజీని చెప్తాయి.