‘మా తండ్రి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి చూస్తే నీళ్లు లేవు. విద్యుత్తు కోత వల్ల మోటార్ పనిచేయడం లేదు. తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయలేని దానికన్నా మించిన దురదృష్టం ఉంటుందా?’ ఈ మాటలు వింటే పాపం దురదృష్ట వంతుడని జాలి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి అనుభవించిందెవరో అనామకుడు, సామాన్యుడు కాదు. స్వయంగా ఇప్పటి మన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి. ఇది ఎవరో పరిశోధించి కనుక్కొన్న విషయం కాదు. స్వయంగా ఆయనే అసెంబ్లీలో చెప్పిన విషయం. అసెంబ్లీ రికార్డుల్లో ఉన్న విషయం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెల పరిస్థితి ఇది. గ్రామంలో తమకున్న పలుకుబడితో విద్యుత్తు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగోలా స్నానం చేశానని ఉమ్మడి రాష్ట్రంలో నిండు సభలో టీడీపీ శాసనసభ్యునిగా స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ఇది. పాడి పంటల మాట అటుంచి తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని దశ నుంచి దేశంలోనే అత్యధికంగా వరి పండించి రికార్డు సృష్టించిన స్థితికి తెలంగాణ ఊరకనే చేరుకోలేదు.
2014లో తెలంగాణ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది. రైతుల ఆత్మహత్యలు, కరువు, విద్యుత్తు సంక్షోభం. పదేండ్లలో తెలంగాణ రూపు రేఖలు ఊరకనే మారిపోలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో కూర్చున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో బీడు భూములు కనిపించలేదు. కనీసం మంచినీళ్లు ఇవ్వాలనే జాలి కలుగలేదు. నల్లగొండ జిల్లాలో జిల్లా ఎస్పీ, కలెక్టర్ 1993-94 ప్రాంతంలో హైదరాబాద్‌కు కారు పంపి మరీ రోజూ మంచినీళ్లు తెప్పించుకునేవారు. నల్లగొండ నీళ్లు తాగితే ఫ్లోరోసిస్ బారిన పడతామనే భయంతో. ఆ మధ్య ఒక మహిళ ‘పెండ్లయినా పిల్లలను కనేవాళ్లం కాదు, పిల్లలు పుడితే ఫ్లోరోసిస్ బారిన పడతారనే భయం వల్ల’ అని టీవీలో చెప్తుంటే విన్నవాళ్లకు ఒళ్లు జలదరించింది. సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అర్థమైంది. అలాంటి గ్రామాలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సురక్షితమైన మంచి నీళ్లు ఊరకనే రాలేదు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడా నాయకులు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు పొందడంలో విజయం సాధించారు కానీ, ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు ఇవ్వలేక పోయారు.
కాంగ్రెస్ చేయలేని పనిని కేసీఆర్ పదేండ్ల పాలన చేసి చూపించింది. గెలుపు కూటములకు కులం, మతం వంటి అనేక అంశాలు పనిచేస్తాయి. కళకళలాడుతున్న చెరువులు, ప్రాజెక్టులు, కోట్ల రూపాయలు పలుకుతున్న తెలంగాణ భూములు, మూడు లక్షలు దాటిన తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచాయి.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడి జైలుపాలైన తర్వాత రేవంత్ రెడ్డి కక్షగట్టి కమిషన్ వేయడం మినహా తెలంగాణకు మేలు చేయాలని కాదు. కాళేశ్వరంపై తొలుత కమిషన్ వేస్తే- కమిషన్ ఏ ఉద్దేశంతో, ఎందుకు వేశారో తెలుసు కాబట్టి విచారణ జరపకముందే కమిషన్ మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని ప్రకటించి నవ్వులపాలైంది. ఈ కమిషన్ ముందే ఒక నిర్ణయానికి వచ్చిందని, తమకు ఈ కమిషన్‌పై నమ్మకం లేదని బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. చివరికి కోర్టు సైతం ఈ అభిప్రాయాన్ని అంగీకరించడంతో ప్రభుత్వం పరువూ పోయింది. ఉద్దేశం తెలిసింది. దానితో తిరిగి రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేశారు.
సమాచార హక్కు చట్టం దుర్వినియోగంపై ఒక కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మంచి ఉద్దేశంతో పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారు. కానీ, ఈ చట్టం పుణ్యమాని అధికారులు పనులు చేసేందుకే భయపడుతున్నారు. పనిచేస్తేనే కదా? సమాచారం ఇవ్వాలి, పనే చేయకపోతే సమాచారం ఇవ్వాల్సిన అవసరమే ఉండదు కదా అని అధికారులు భావించడాన్ని గమనించినట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు కడితేనే కదా? విచారణలు. కాంగ్రెస్ తరహాలో అసలు ప్రాజెక్టులు కట్టకపోతే ఏ విచారణ ఉండదు.
గోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు అనేక గ్రామాల్లో కనిపిస్తాయి. గోదావరి పుష్కరాల్లో చాలామంది ఆయనకు పిండ ప్రదానం కూడా చేస్తారు. విదేశీయుడు, క్రైస్తవుడు అయినా కాటన్‌కు బ్రాహ్మణులు సైతం ఇప్పటికీ అర్ఘ్య ప్రదానం చేస్తారు. గోదావరిపై ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశామలం చేశారని కాటన్‌ను ఇప్పటికీ గౌరవిస్తారు. రెండు వందల ఏండ్ల కిందట కాటన్ చేసిన మంచిని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. అయితే ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆర్థర్ కాటన్ సైతం అవినీతి ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఖర్చుచేశారని, అవకతవకలు జరిగాయని 1857లో బ్రిటిష్ పార్లమెంట్లో ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై విచారణ జరిగింది.
రెండు వందల ఏండ్ల తర్వాత కూడా ప్రజలు కాటన్‌ను దేవుడిలా కొలుస్తున్నారు. కానీ, ఎవరు ఆరోపణలు చేశారు? ఏం ఆరోపణలు, ఎవరు విచారించారు? విచారణలో ఏం తేల్చారనేది ఎవరూ గుర్తుపెట్టుకోరు, పట్టించుకోరు. ఇప్పడు రేవంత్ సర్కార్ సైతం తెలంగాణకు ఏమీ చేయలేక విచారణ కమిషన్ల పేరుతో అవినీతి బురద అంటించాలని ప్రయత్నిస్తున్నది.
తప్పులు వెతకాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కాదు కదా? కనీసం మరుగుదొడ్డి (మరుగు దొడ్లు కాదు. మరుగు దొడ్డి మాత్రమే) కూడా నిర్మించలేరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది మరణిస్తే కనీసం శవాలను కూడా బయటకు తీయలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. టన్నెల్ నుంచి శవాలను తీసే సామర్థ్యం లేని ప్రభుత్వం కాళేశ్వరం లాంటి బాహుబలి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందా?
నాలుగు దశాబ్దాల పాటు జర్నలిస్ట్‌గా చాలామంది నాయకులను దగ్గరినుంచి చూసే అవకాశం లభించింది. తెలంగాణలోని ప్రతి పల్లె గురించి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్. వారిలో ఇతరులకు నచ్చని గుణాలుండవచ్చు కానీ, తెలంగాణ గురించి అవగాహనలో మరే నాయకుడు దరిదాపుల్లోకి రారు. స్వయంగా చూసి చెప్తున్న మాట. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
దానికన్నా ముందే తన ఛాంబర్లో కొద్దిమంది జర్నలిస్ట్‌లకు మొత్తం తెలంగాణ స్వరూపాన్ని స్క్రీన్‌పై చూపించి వివరించారు. శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్‌తో పాటు ఆ రోజు నేనూ ఉన్నాను. గంధమల్ల ప్రాజెక్టు గురించి కేసీఆర్ చెప్తుంటే అమర్ ఏదో డౌట్ అడిగారు. తుర్కపల్లితో పాటు చుట్టుపక్కల ఏయే గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు లభిస్తుందో కేసీఆర్ గ్రామాల పేర్లతో చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆ గ్రామాల పేర్లు నేను చిన్నప్పుడు విన్నవి. తుర్కపల్లి నేను పుట్టిన ఊరు. పుట్టిన తర్వాత హైదరాబాద్‌కు రావడం వల్ల గ్రామం గురించి తెలియదు కానీ, మా నాన్న నోటి నుంచి ఆ గ్రామాల పేర్లు ఎన్నోసార్లు విన్నాను. అది మా ఊరు అని చెప్పాలనిపించినా, ఊరు గురించి ఏమైనా అడిగితే తెలియదంటే బాగోదని మౌనంగా ఉన్నాను. మరోసారి తెలంగాణ వచ్చిన కొత్తలో నిజామాబాద్‌లో ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్‌తో పాటు హెలికాప్టర్లో వస్తుంటే ఒక చోట పచ్చని పొలాలు కనిపించాయి. ‘ఇది ఏ ఊరు సార్ పచ్చగా ఉంది. హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు వంద కిలో మీటర్ల వరకు భూములు పడావుపడి ఉంటాయి’ అని అడిగితే పచ్చగా ఉన్న ఆ గ్రామాల పేర్లు అప్పటికప్పుడు హెలికాఫ్టర్‌లోనే చెప్పారు. తెలంగాణ అణువణువు గురించి ఇంతగా అవగాహన ఉన్న మరో నాయకుడు తెలంగాణలో కనిపించరు. గ్రామ రాజకీయాలు మొదలుకొని శాసనసభ్యులు, మంత్రి, పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉన్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ వెంటనే పదవి చేపట్టలేదు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో రోజుల తరబడి సమావేశమై ఒక విద్యార్థిగా వారి వారి శాఖల గురించి అడిగి తెలుసుకున్నారు. నేను సీఎంను అధికారులతో శిక్షణ తీసుకోవడం ఏమిటనే అహానికి పోలేదు.
అదే రేవంత్ విషయానికి వస్తే మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకొనే ఆసక్తి లేదు. రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా? నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినవాడిని అని సీఎం పదవి చేపట్టిన కొత్తలో రేవంత్‌రెడ్డి చెప్పిన మాట. మిగిలిన విషయాలెలా ఉన్నా తనకు అనుభవం ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్నైనా బాగు చేశాడా? అంటే అదీ లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నిండా ముంచేశారు. తమిళనాడులో పార్టీల మధ్య రాజకీయాలు తీవ్రంగా ఉంటాయి. జయలలిత చీరను నిండు సభలో లాగారు. వయో వృద్ధుడు అని కూడా చూడకుండా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయి. తెలంగాణకు అదేం దురదృష్టమో రాష్ర్టానికి మేలు చేసే విషయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు చేతులు కలపడం లేదు. కానీ, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేతులు కలిపి పనిచేస్తున్నాయి.
‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది’ అని ఎన్నికల ముందు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తం కూలిపోతే బాగుండు అని కోరుకుంటుంది. కానీ, తెలంగాణకు మేలుచేసే ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేద్దామనే సోయి లేదు. విచారణ పేరుతో బురద జల్లాలనేది కాంగ్రెస్ ఎత్తుగడ. కానీ, పదేండ్ల కిందట తెలంగాణ ఎలా ఉండేది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ రంగంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజల్లో చర్చ జరిగేందుకు ఈ విచారణ-నోటీసులు ఉపయోగ పడుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను విచారణ పేరుతో వేధించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందేమో కానీ కరువు కాటకాలతో విలవిలలాడిన తెలంగాణ సస్యశామలంగా ఎలా మారిందనే చర్చ జరగడానికి ఈ విచారణ దోహదం చేస్తున్నది.