ఏ నాయకుడికైనా ‘ఇమేజ్ గ్రాఫ్’ ఒకసారి దిగజారిందంటే, ఇక రాజకీయ ప్రభ మసకబారుతున్నదనే లెక్క! అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకొంటూ వెళ్లే ‘కళ’ ఎంత ఉన్నదని అనుకున్నప్పటికీ, ప్రజల్లో తన పట్ల ఆరాధనా భావాన్ని సృష్టించుకోలేకపోతే అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐదారు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, పతాక శీర్షికలుగా మారుతున్న అంశాలు, వివిధ వర్గాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తులు కాంగ్రెస్ సర్కార్‌కు ప్రమాద సంకేతాలను పంపిస్తున్నాయి.
ఇంకా రెండున్నరేండ్లకుపైగా అధికారం ఉన్నప్పటికీ, టీ జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం, బీఆర్ఎస్లో చేరడం, జగిత్యాల బహిరంగ సభకు కేసీఆర్ హాజరవ్వడం, ఆ సభకు లభించిన భారీ స్పందన… రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి సూచిక! రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు హడావుడిగా మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసుకొని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సభ పెట్టుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
ప్రత్యేక ఇమేజ్ ఉన్న జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా కేసీఆర్ నిర్వహించిన సభ సందర్భంలోనే.. సీఎం రేవంత్‌రెడ్డి పోటీ సభ పెట్టడం దుస్సాహసమే! టీవీ చానల్స్ లైవ్ కవరేజీల్లో అధికారంలో ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయనే ఉద్దేశంతోనే తాను కూడా పోటీ సభ పెడితే, కేసీఆర్ సభ పెద్దగా హైలెట్ కాదని, న్యూస్ చానల్స్ తన వెంటే పరుగులు పెడుతాయని రేవంత్‌రెడ్డి ఆశించి ఉంటారు. కానీ, అందుకు భిన్నంగా మీడియా ఫోకస్, ప్రజల ఆసక్తి అంతా కేసీఆర్ సభపైనే కేంద్రీకృతమైంది.
కేసీఆర్ ప్రసంగాన్ని సభికులతోపాటు ఇండ్లలో ఉన్నవారు సైతం టీవీలు, సెల్ఫోన్లలో శ్రద్ధగా ఆలకించారు. ఆఖరికి ఛాయ్ దుకాణాల వద్ద కూడా కేసీఆర్ సభ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన విషయం తెలిసిందే. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సభలో ఉన్నవారు కూడా వెళ్లిపోవడం కనిపించింది. టీవీ చానల్స్‌తోపాటు లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ సీఎం ప్రసంగానికి ఆదరణ లభించలేదు. దీంతో రేవంత్‌రెడ్డి చేసిన ‘దుస్సాహసం’ చివరకు ‘కుర్రచేష్ట’గా మిగిలిపోయింది! ఆయన ‘సెల్ఫ్‌గోల్’ చేసుకొన్నట్టయ్యింది.
ఈ ఒక్క సభతో రాష్ట్రంలో మళ్లీ ‘కేసీఆర్ వేవ్’ మొదలైందని కాంగ్రెస్ క్యాడర్ సైతం చెప్తుండటం విశేషం. అయినప్పటికీ, బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వనని, రెండోసారి అధికారంలోకి వస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితిని చూస్తుంటే ఆయన తనను తాను అతిగా అంచనా వేసుకొంటున్నారని, తన పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న విముఖతను జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారనే అభిప్రాయం కలుగుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ఎటువంటి భేషజాలకు పోకుండా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలను కొనసాగించడమే కాకుండా మరింత విస్తృతం చేశారు. వృద్ధులకు ఆసరా పెన్షన్ల పెంపు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు, విద్యుత్తు సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించడం, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, కాళేశ్వరం లాంటి పెద్ద టాస్క్‌లను వేగంగా పూర్తి చేయడం, ఐటీ, ఫార్మా రంగాలకు మరింత సహకారం అందించడం, కంటి వెలుగు లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను చూరగొన్నారు. అయితే, రేవంత్‌రెడ్డి గత రెండున్నరేండ్లలో ఇలాంటి సానుకూలతలు ఏ మేరకు సాధించుకొన్నారనేది ప్రశ్న. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయి.
అన్నదాతల రైతుభరోసాకు మూడుసార్లు ఎగనామం పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశ చూపినవి ఇవ్వకపోగా, ఉన్న పథకాలను కూడా ఊడగొడుతున్నారనే ఆందోళన వివిధ వర్గాల్లో ఏర్పడుతున్నది.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఇలా ప్రతి వర్గంలోనూ అశాంతిని, అసంతృప్తిని రాజేసే విధానాలు అవలంబిస్తూ పదేండ్లు అధికారంలో ఉంటామని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు కలలు కనడంలో అర్థం ఉన్నదా? ఏప్రిల్ 20న ఎదురైన అనుభవాన్ని చూసిన తర్వాతనైనా సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయం అర్థం కావాలి. ‘నేను ఇచ్చే వాడిని.. మీరు పుచ్చుకొనే వారు.. నాకు తోచినప్పుడు.. నేను ఎంత ఇస్తే, ఏది ఇస్తే అది తీసుకోండి’ అనే రీతిలో వ్యవహరించడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఈ లక్షణమే కనిపిస్తున్నది.
– కందిబండ కృష్ణప్రసాద్ 9182777010