దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. బీసీలకు ఒక మంత్రిత్వశాఖ ఉంటే వారి సంక్షేమం పట్ల, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి అధికారిక వేదిక అవుతుందని బీఆర్ఎస్ మొదటి నుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నపుడు కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ అవసరాన్ని కేంద్రానికి పలుమార్లు గుర్తు చేయడమే కాకుండా బీసీ మంత్రిత్వశాఖకు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ ప్రభుత్వం బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినప్పటికీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు వారికి లభించడం లేదు. బీసీ కులాలకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేకపోవడమే ఇందుకు ఒక కారణం. ప్రణాళిక లేని గణాంకాలతో, గణాంకాలు లేని ప్రణాళికలతో ప్రయోజనం ఉండదని అంటారు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’గా పేరుగాంచిన మహాలనోబిస్.
1953లో ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్, ఆ తర్వాత వచ్చిన అనేక కమిషన్లు బీసీ వర్గాల జనగణనకు సిఫారసు చేశాయి, భారత తొలి ప్రధాని నెహ్రూ నుంచి, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వరకు ఎవరి ప్రభుత్వమూ ఆయా కమిషన్ల సిఫారసులను పట్టించుకోలేదు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయ ం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తగిన వివరా లు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాట ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికా రచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా ఒకే ఒక్క రోజులోనే నిర్వహించారు. అభివృద్ధి ఫలాల పంపిణీలో జరిగే అవకతవకలన్నింటికీ నిర్దిష్టమైన గణాంకాలు లేకపోవడమే ప్రధాన కారణమని కేసీఆర్ పదే పదే అంటుంటారు. సామాజిక గణాంకా ల ఆవశ్యకత, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాధా న్యం తెలిసిన నాయకుడు కావడం వల్లే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. నేడు దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే నిర్దిష్టమైన, సమగ్రమైన, స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపొందించడం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లుగా అట్టడుగుస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించగలిగింది.
బీసీల వివరాల సేకరణ విషయంలో గతేడాది సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం తన అశక్తతను వ్యక్తం చేసింది. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన బీసీల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇక ముందు ఈ వివరాలను సేకరించలేమని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. బ్రిటిష్ హయాంలో మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడటం ఆశ్చర్యం. పరాయి పాలకుల స్థాయిలో కూడా మనం వివరాలు సేకరించుకోలేమా? ఈ కీలకమైన అంశంపై బీజేపీ ఎన్నికల ముందు ఒకతీరు, తర్వాత మరో తీరుగా మాట మార్చడం గర్హనీయం.
కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థం లేని వాదన. సామాజిక అంతరాలు తొలగించి, సామరస్యం సాధించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడే వైషమ్యాలు చోటుచేసుకుంటాయి. అంతే గానీ గణాంకాలు సేకరించడం వల్ల కాదు. జనగణన అంటే అడవిలో జంతువులను లెక్కించినట్టు కాదు. ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలువకుండా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమంటే చీకట్లో బాణం వేసినట్టే ఉంటుంది. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలున్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో బీసీ వర్గాల జనాభాతోపాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జనాభాను కూడా తక్కువగా చూపించి అన్యాయం చేశారని, సర్వే అంతా తప్పుల తడకగా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీసీ వర్గాల జనగణనను కేంద్రం అధికారికంగా జరపనంత వరకు బీసీ వర్గాలకు ఇలాగే తీరని అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచి, తక్షణమే బీసీ వర్గాల జన గణనను చేపట్టి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.