రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులు అశాస్త్రీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడిన కులాలకు ఇందులో తీవ్ర అన్యాయం జరిగింది. వర్గీకరణను మొక్కుబడిగా చేపట్టిన రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్రతిష్ఠపాలైంది. 59 ఎస్సీ కులాల్లో మాదిగల జనాభానే అధికం. ఒకవేళ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పంపిణీ చేస్తే అందులో ఎక్కువ వాటా దక్కాల్సింది మాదిగలకే. 17 లక్షల మంది మాలలకు ఐదు శాతం కేటాయిస్తే, అదే నిష్పత్తిలో 32 లక్షలున్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలి. కానీ, ఇచ్చింది 9 శాతం మాత్రమే.
కమిషన్ నివేదిక ప్రకారం మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాల్ని గ్రూప్-3లో చేర్చి వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రూప్-3లో ఉన్న కులాల జనాభా 33 శాతం. అంటే 33 శాతం ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే 63 శాతం ఉన్న గ్రూప్-2కి దక్కాల్సింది 10 శాతం కానీ, 9 శాతం ఇచ్చారు. ఇక, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకుబడిన కులాలుగా ఉండి గ్రూప్-1లో ఉన్న కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్సీ జనాభాలో వారిది 3 శాతం. ఈ లెక్కన చూసినా మాదిగలకు జరిగింది అన్యాయమే.
గ్రూప్-1లో దశాబ్దాలుగా మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాల్ని చేర్చి మాదిగలు, మాదిగ ఉపకులాలతో సహా ఇతర అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు అన్యాయం చేశారు. పంబాల కులస్తుల జనాభా చాలా తక్కువ. మిగతా ఎస్సీలతో పోల్చినప్పుడు విద్యా, ఉద్యోగ రంగాల్లో వారు ముందున్నారు. ఇక, డక్కలి వాళ్లు రిజర్వేషన్ల ఫలితాలు పొందకుండా ప్రభుత్వ కుట్ర పన్నింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబీసీడీ వర్గీకరణ సమయంలో 29 వేల జనాభా ఉన్న మన్నె కులం గ్రూప్-సిలో ఉండేది. వాళ్లని ఇప్పుడు గ్రూప్ 1లో కలిపారు.
1.11 లక్షల మంది ఉన్న బుడగ జంగాల్ని గ్రూప్-2లో చేర్చి రిజర్వేషన్ను 11 శాతానికి చేర్చవచ్చు. కానీ ఆ పని చేస్తే గ్రూప్-1, గ్రూప్-3లో ఉన్న కులాలకు లబ్ధి జరగకపోవచ్చని భావించి వారిని గ్రూప్-1లో కలిపారు. బేడ, బుడగ జంగాలు గతంలో మాదిగలతో పాటు ఒకే గ్రూప్లో ఉన్నారు. ఇక నేతకాని కులాన్ని గ్రూప్-3లో చేర్చాలన్న సిఫార్సుని ప్రభుత్వం ఆమోదించడం సరికాదు. ఎందుకంటే, 1.33 లక్షల మంది జనాభా ఉన్న ఆ కులంలోని ప్రజలు విద్యారంగంలో చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారిని గ్రూప్-1లో చేర్చాలి. కానీ, గ్రూప్-3 రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవడానికి వారిని గ్రూప్-3లో చేర్చారు. కమిషన్ నివేదికను చూస్తే జనాభాను, వెనుకబాటుతనాన్ని అంచనా వేసి వర్గీకరణను చేసినట్టుగా లేదు. అందుకే మూడు గ్రూపులుగా ఉన్న వర్గీకరణను నాలుగు గ్రూపులుగా చేయాలి. మాదిగలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వంపై ఉన్నది.