హిందీని జాతీయ భాషగా చేస్తే దేశంలో సమైక్యత ఏర్పడుతుందని ఆ భాష సమర్థకులు అంటుంటారు. కానీ, ఇప్పుడు దేశంలో అనైక్యతకు హిందీ కారణమవుతున్నది. భాషపై ఆవేశకావేశాలు రగులుతున్నాయి. మరోసారి దేశంలో హిందీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇదేదో తమిళులకు పరిమితమైన సమస్య కాదు. ఇప్పుడిది మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్లో అగ్గి రాజేస్తున్నది. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని మహారాష్ర్టులు కొంతకాలంగా తిరుగుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్ధవిరోధులుగా ఉన్న ఠాక్రే సోదరులు భాషా సమస్యపై ఏకతాటిపైకి వచ్చి చేతులు కలుపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బీజేపీకి హిందీ పట్ల గల ప్రత్యేక అభిమానం జగమెరిగినదే. దీన్ని భాషా ప్రేమ అనే కన్నా రాజకీయం అనడమే సముచితం. ఒకే దేశం, ఒకే ఎన్నిక తరహాలో ఒకే భాష ఉండాలనేది వారి అభిమతం. ఈ హిందీ భాషాభిమానమే ఆ పార్టీని చాన్నాళ్లు హిందీ ప్రాంతాలకే పరిమితం చేసిందనేది వేరే విషయం. అయితే, ఇటీవలి కాలంలో హిందీని మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. నూతన విద్యా విధానం కింద త్రిభాషా సూత్రం ద్వారా హిందీయేతర ప్రాంతాలపై హిందీని రుద్దేందుకు విద్యానిధుల నిలిపివేతకు సైతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఈ అంశంపై తమిళనాడు న్యాయపోరాటం సాగిస్తున్నది. మహారాష్ట్ర వివాదం తర్వాత, తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ హిందీ వ్యతిరేక ఎజెండాతో కేంద్రంపై సమర శంఖం పూరించారు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హిందీపై పోరు రాజకీయ రంగు పులుముకుంది. బెంగాలీ భాషపై జరుగుతున్న దాడికి, హిందీ భాషోన్మాదానికి వ్యతిరేకంగా వంగ భాషా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించడం ద్వారా ఆమె ఒక రకంగా ఎన్నికల ఎజెండాను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ‘భాషా ఉగ్రవాదం’ అనే మాటను దీదీ ఉపయోగించడం గమనార్హం.
హిందీ అనేది ఏకైక జాతీయ లేదా అధికార భాషగా ఉండాలా, వద్దా అనే దాని చుట్టూనే భారతదేశంలో భాషా చర్చ తిరుగుతుంది. రాజ్యాంగ సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత హిందీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంగ్లిష్‌ను 15 సంవత్సరాల పాటు అనుసంధాన భాషగా కొనసాగించవచ్చనే సర్దుబాటు జరిగింది. ఆ సర్దుబాటునే నిరంతరంగా పొడిగిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు గడిచిన తర్వాత ఈ కంప్యూటర్-ఇంటర్నెట్ యుగంలో ఇంకా హిందీని పట్టుకుని వేలాడటం అర్థరహితమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీయేతరులపై హిందీ భాషను రుద్దడం ఆచరణాత్మకం కూడా కాదు. బహు భాషలు, బహుళ సంస్కృతుల దేశంలో ఒకే భాష ఉండాలనడం.. ఒకే రకం వస్త్రధారణ, ఒకే రకం ఆహార నియమాలు ఉండాలనడం లాంటి వెర్రి ఆలోచనే ఇది కూడా! జాతీయ సమైక్యత కోసం హిందీని ఎంతగా రుద్దాలని చూస్తే అంతగా భాషా అనైక్యత ఏర్పడుతుందనేది అసలు నిజం.