నిరుడు జూలైలో ఏర్పడి సంవత్సరకాలం పూర్తిచేసుకున్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ నిజ స్వరూపం ఏమిటో ఇప్పటికీ బోధపడటం లేదు. ఆ సంస్థ పనితీరు పట్ల వచ్చిన ఫిర్యాదులతో పాటు, ఆ కేసులు విచారణకు వచ్చిన సందర్భాలలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఆ సంస్థకు ఇచ్చిన ఆదేశాలను బట్టి చూడగా, దాని తీరు గురించి న్యాయమూర్తులకు సైతం బోధపడుతున్నట్లు లేదు.
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసివెళ్లిన హైడ్రా సిబ్బంది నర్సింహ బస్తీ, రాజరాజేంద్ర బస్తీ, ఆబిద్ బస్తీ, బాలయ్యనగర్ బస్తీలలో దాదాపు 275 ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. అవన్నీ కూలినాలి పనులు చేసుకునే పేదలవి. వాటిని కూల్చిన వేళకు ఆ పేదలు ఒకవైపు పనుల కోసం ఉదయమే వెళ్లేందుకు వంట పనులు మొదలుపెట్టుకున్నారు. మరొక వైపు ఆనాటి నుంచే మొదలుకానున్న బతుకమ్మ పండుగ జరుపుకునే ఆలోచనలలో ఉన్నారు. కనీస మానవత్వం, సంస్కారం ఉన్నవారు సరిగా అటువంటి వేళన పోయి ఇళ్లను కూలగొట్టరు. పేదలవే కావు, ఎవరివి కూడా. ఆ సమయంలో ఆ పనిచేయక తప్పని అగత్యం ఏదైనా ఏర్పడి ఉంటే అది వేరు. కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేరోజున మీడియాకు వివరించిన విషయాలలో అటువంటి అగత్యపు పరిస్థితి ఏదీ కన్పించలేదు.
కమిషనర్ చెప్పిన దానిని బట్టి, వారు 317 ఎకరాల ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించి, సుమారు 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడారు. ప్రభుత్వ భూమిలో వెలసిన వెంచర్లను, లేఔట్లను హైడ్రా తొలగించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆక్రమించిన కబ్జాదారులపై చర్యలు తీసుకుంది. కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఉన్నారు. ఆక్రమణలను, తాత్కాలిక ఏర్పాట్లను తొలగించిన తర్వాత ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఆ భూమిని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అప్పగించింది.
రాష్ట్రం విడిపోయినాక ఆస్తుల పంపకంలో జరిగిన జాప్యాన్ని వీలుగా చేసుకొని కొందరు ఆక్రమణలు చేశారు. తాము ఆరునెలల పాటు వేర్వేరు శాఖలతో పూర్తి విచారణ జరిపిన తర్వాత, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. కబ్జాదారులు ఆ భూమిని 60 గజాలు, 120 గజాలుగా ప్లాట్లు చేసి పేదలకు అమ్మారు. తాము ఇప్పటికే ‘శాశ్వత నిర్మాణం’ చేసుకొని అందులో వాస్తవంగా యజమానులు నివసిస్తున్న చోట్ల ఆ ఇళ్ల జోలికి వెళ్లలేదు. రౌడీలు, కబ్జాదారుల అధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ప్రహారీలు నిర్మించిన ప్లాట్లను మాత్రమే తొలగించారు. అక్కడ నివాసం ఉంటున్న పేదల ఇంటింటికీ వెళ్లిన హైడ్రా అధికారులు ఈ విషయం వారికి స్పష్టం చేశారు.
కమిషనర్ మరొకమాట కూడా చెప్పారు. ఆ భూమిలో ప్లాట్లు వేసినవారు, నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినవారిని వదలిపెట్టబోరు. వారిపై పూర్తి విచారణ జరిపి, చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు. ఆయన మరునాడు 22వ తేదీన కూడా మాట్లాడుతూ, ఇంతవరకు తాము 95 ఆపరేషన్లతో 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, దాని విలువ రూ.50 వేల కోట్లని ప్రకటించారు. ఇంకా అనేక విషయాలు ఇటువంటివే చెప్పారు.
పాఠాలు నేర్చుకొని ఉంటే ఏమి చేయవలసింది? నిజాయితీ కూడా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునేవారు? అక్కడి పేదల ఇళ్ల నిర్మాణాలు అక్రమం అయి, ఆ భూమిని ప్రభుత్వం కోసం కాపాడదలచుకుంటే, అక్కడి కబ్జాలపై ఆరు నెలల పాటు విచారణ జరిపామన్న హైడ్రా కమిషనర్, మొదటగా తానన్న రాజకీయ నాయకులు, రౌడీషీటర్లు, అధికారులు ఎవరో గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలి.
కమిషనర్ మాటల గురించి ఇప్పుడు కొద్దిగా విచారిద్దాం. యథాతథంగా చూసినప్పుడు ఆయన చెప్పినవి ఎంతో హేతుబద్ధంగా, నిజాయితీగా తోస్తాయి. కానీ కొద్దిగా పరిశీలించినా అందులో ప్రశ్నార్థకాలు అనేకం తలెత్తుతాయి. స్వయంగా తను చెప్పిన దానిని బట్టే ఆ భూమిని కబ్జాదారులు 60 గజాలు, 120 గజాల ప్లాట్లుగా చేసి పేదలకు అమ్మారు. ఆ పని అనేక సంవత్సరాల క్రితమే జరిగింది. ఇప్పుడు ఇళ్లు కోల్పోయినవారు చెప్తున్న దానినిబట్టి, లోగడ ఒకసారి రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చగా, మళ్లీ కట్టుకునేట్టు చేయటమే గాక, కరెంటు తదితర వసతులు కూడా వారే కల్పించారు. అధికారులు లంచాలు తీసుకున్నారు. వీరికి పట్టాలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇక్కడినుంచి 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చినట్టు ఇళ్లు కోల్పోయినవారు చెప్తున్నారు.
జేసీబీలు కూల్చిన నిర్మాణాల ఫొటోలను బట్టి, అవి కమిషనర్ చెప్తున్నట్టు కేవలం ప్రహారీ గోడలో, తాత్కాలిక నిర్మాణాలో కావు. పైగా వారు పేదలని, వారికి ఆ ప్లాట్లను కబ్జాదారులు అమ్మారని ఆయనే అంటున్నారు. ఆ పనిచేసిన వారిపై, అందులో పాత్ర గలవారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయగలమని చెప్తున్నారు. ఆ విధంగా ఆయన పేదల జోలికి పోలేదని తను అన్న మాటలను తానే ఖండించుకుంటూ, తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యాలు ఇంకా సృష్టించుకుంటున్నారు. ఇవి ఎవరైనా కోర్టులో చూపగల సాక్ష్యాలు కాకపోవచ్చు. కానీ, సమాజపు పరిశీలనకు నిలిచేవే. అంతే కాదు. ఒకసారి హైడ్రా గత రికార్డుల్లోకి వెళ్తే, దా ని చర్యలు అనేకం కోర్టు పరిశీలనకు కూడా నిలువలేదు. కనుకనే కమిషనర్‌తో పాటు, హైడ్రాతో అనుసంధానమై చర్యలు తీసుకున్న ఇతర శాఖ అధికారులు సైతం న్యాయస్థానం నుంచి తీవ్రమైన మందలింపులకు, చర్యలు తీసుకోగలమనే హెచ్చరికలకు పలుమార్లు గురికావలసి వచ్చింది. అయినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని గాజుల రామారం ఘటనలు చూపుతున్నాయి.
పాఠాలు నేర్చుకొని ఉంటే ఏమి చేయవలసింది? నిజాయితీ కూడా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునేవారు? అక్కడి పేదల ఇళ్ల నిర్మాణాలు అక్రమం అయి, ఆ భూమిని ప్రభుత్వం కోసం కాపాడదలచుకుంటే, అక్కడి కబ్జాలపై ఆరు నెలల పాటు విచారణ జరిపామన్న హైడ్రా కమిషనర్, మొదటగా తానన్న రాజకీయ నాయకులు, రౌడీషీటర్లు, అధికారులు ఎవరో గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలి. ఆ ఇళ్లకు కరెంటు తదితర వసతులు కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. వారికి పట్టాలిస్తామంటూ హామీ ఇచ్చి ఓట్లు సంపాదించి గెలిచి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికారం అనుభవిస్తూ, ఈ విధమైన వ్యవహరణతో ఆ పేదలను మోసగిస్తున్న నాయకునిపై చర్య తీసుకోవాలి. ఆ తర్వాత, ఆ పేదలకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేయాలి. విషయం వారికి వివరించి అక్కడకు తరలించాలి. మూసీ తీరపు కూల్చివేతల నుంచి అర్థం చేసుకోవలసింది ఇటువంటిది చాలా ఉన్నది. అర్థం చేసుకొని చేయవలసింది ఏమీ చేయకుండా, ఇప్పుడు గాజుల రామారం పేద బస్తీలపైకి జేసీబీలు నడుపుతూ తిరిగి అవే తప్పులు చేస్తున్నారు. అంతేకాదు, తిరిగి ఆ రోజుల నాటి నిజాయితీ లేని మాటలనే అప్పజెప్తున్నారు.
ఇటువంటి మాటలు, చర్యల కారణంగానే కమిషనర్ రంగనాథ్‌తో పాటు, హైడ్రా సంస్థతో పాటు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే తీవ్రమైన అప్రతిష్టకు గురయ్యాయి. హైదరాబాద్ నుంచి మొదలుకొని రెండు తెలుగు రాష్ర్టాలలోని గ్రామ ప్రాంతాల వరకు, దేశ రాజధాని ఢిల్లీ వరకు ఆ అప్రతిష్ఠ వ్యాపించింది. ఇటువంటి కూల్చివేతలూ, అధికారులపై గాని, ఒరిజినల్ కబ్జాదారులపై గాని మాటలు తప్ప చేతలు లేనితనం ఒకటి కాగా, అధికారపక్షానికి చెందినవారు లేదా సమర్థకులైన పెద్దల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కళ్లెదుట కనిపిస్తున్నా, ఏదో సాకుతో చర్యలు తీసుకోకపోవటం మరొకటిగా ప్రజల చర్చలలో గత ఏడాదిగా నానుతున్నది.
కబ్జాదారులపై, అధికారులపై గత ఏడాదిగా తీసుకున్న చర్యలేమిటో కమిషనర్ ప్రకటించగలరా? అయినప్పటికీ ఈ ప్రస్తుత సందర్భంలోనూ ఒక అధికారపక్ష నాయకుని కబ్జాపై తీసుకోని చర్యలపై తిరిగి అదే చర్చ మొదలైంది. ఆ భూమికి కంచె వేశామన్నారు. ఆ కంచెను తన మనుషులు కొన్ని గంటలలోనే నిర్భయంగా కూల్చివేస్తే హైడ్రా నుంచి కదలిక లేదు. ఈ విధంగా పలు సందర్భాలలో కనిపించిన వైఖరి గురించి వస్తున్న సూటి ప్రశ్నలకు కమిషనర్ ఎప్పుడు కూడా సూటి జవాబులు ఇచ్చినట్టు కనిపించదు. అందువల్లనే, గత సంవత్సర కాలపు తీరుతెన్నులను గమనించిన మీదట, హైడ్రా నిజరూపం ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. అందుకు కమిషనర్ వివరణ ఇవ్వగలరా?
– టంకశాల అశోక్