భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా రెండు ప్రాంతాలు వేరై సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఎక్కడికెళ్లినా భాషా సరళిలో పెనుమార్పులు జరిగినట్లు ప్రస్ఫుటమవుతున్నాయి. వాడుక భాషలో ఎన్ని మార్పులు చవిచూస్తున్నా లిఖిత భాష ప్రామాణికత, ప్రాధాన్యాలు మాత్రం తగ్గలేదు. పెద్దగా మార్పులు రాకపోవడం కొంతమేరకు సంతోషకరమే! దీనికి బలమైన కారణం మన తెలుగు భాషకు అన్యభాషా పదాలను పాలల్లో నీళ్లు కలిసిపోయిన రీతిగా విలీనం చేసుకొనే శక్తి ఉండటమే!
నేపథ్యంలో గ్రాంథిక భాష ప్రభావం బాగా క్షీణించిందనే చెప్పాలి. గ్రాంథిక భాష కోసం కొన్ని శతాబ్దాల కిందట స్వామినేని ముద్దు నరసింహం, చిన్నయసూరి బాల, ప్రౌఢ వ్యాకరణాలు సమకూర్చారు. వారిరువురూ వెలిగించిన వ్యాకరణ దీపం చాలా చిన్నదే అయినా.. నేడు మారిన మన భాషా సరళిలో దాదాపు ఉనికినే కోల్పోయే స్థితి ఏర్పడింది. 1982-92 పదేండ్ల మధ్య కాలంలో వాఙ్మయ మహాధ్యక్ష డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య గ్రాంథిక భాషలో సరికొత్త ఛందస్సును సృష్టించి, టీటీడీ వారు ప్రచురించిన సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత ఐదు సంపుటాలలో అనేక పద్యాలు అల్లారు. ఆయన సృష్టించిన పరిశోధనాత్మక ఛందస్సును ఉభయ తెలుగు రాష్ర్టాలలోని కవి పండితులెవరూ చదివి ప్రస్తావించకపోవడం విడ్డూరమే! సరికదా 1957లో తెలంగాణ ఆంధ్ర కవి పండితులు, అప్పటి ప్రభుత్వ అమాత్యుల సమక్షంలో ఆవిష్కృతమైన ‘వ్యావహారిక భాషా వ్యాకరణం’ ఉద్గ్రంథాన్ని వడ్లమూడి వారే అమోఘంగా రచించారు. ఈ వాడుక భాషా వ్యాకరణంలో ఆయన (ప్రస్తుత అక్షరమాలలోని తెలుగక్షరాలు కాక) అనేక కొత్త అక్షరాలను పరిశోధనాత్మకంగా సృష్టించి వెయ్యికిపైగా వ్యాకరణ సూత్రాలు అందించారు. సుమారు 345 పేజీలతో ఉన్న ఆ వాడుక భాష వ్యాకరణ గ్రంథాన్ని వేనోళ్ల కీర్తించిన వారిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, శ్రీశ్రీ, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ కోరాడ రామకృష్ణయ్య, సినారె, దాశరథి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఓగిరాల వీరరాఘవశర్మ, గురజాడ రాఘవశర్మ, యలవర్తి సీతారత్నం వంటి అప్పటి ప్రముఖులు అనేకులు సన్మాన వేదిక మీద, సన్మాన సంచికలో ప్రశంసించారు. శేముషి వడ్లమూడి గోపాలకృష్ణయ్య అంటూ ‘వాఙ్మయ మహాధ్యక్ష’ బిరుదునూ పంచగజ పంచానన గండ పెండేరాన్ని, సింహ తలాటాన్ని తొడిగి, నవరత్న ఖచిత బంగారు పతకంతో ఘనంగా సత్కరించారు. అప్పటినుంచి 1995 వరకు ఈ వ్యావహారిక భాషా వ్యాకరణమే ప్రామాణికంగా నిలబడింది. (ఆర్థిక ఇబ్బందుల వల్ల వడ్లమూడి వారు తమ వ్యాకరణ పుస్తకాన్ని మలిముద్రణ వేయలేకపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని కొందరు దుర్బుద్ధితో వ్యావహారిక భాషా వ్యాకరణం లేదనీ దుష్ప్రచారానికి తెరలేపారు.
వెయ్యికి పైగా సూత్రాలతో ఉన్న వ్యావహారిక భాషా వ్యాకరణ గ్రంథానికి మాండలిక పదాలతో సహా సూత్రాలు రూపొందించి జోడించాలనుకోవడం హాస్యాస్పదం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఉన్న వ్యాకరణ గ్రంథాలనే క్షుణ్ణంగా చదివి ఆదరిస్తే భవిష్యత్తులో తెలుగు వెలుగులకు ఢోకా ఉండదు.
– వి.రాజఫణి, 92479 37923