రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడ ట.. మన సీఎం రేవంత్ తీరూ అచ్చం అలాగే ఉన్నది. రాష్ట్రంలో కుంటలు, చెరువులు అడుగంటి, పొలాలు ఎండిపోతుంటే ఆయన తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వేసవి ఎండల కారణంగా పంటలు ఎండిపోతే తానేం చేయాలని, తననెందుకు తిడుతున్నారని బాహాటంగా చెప్పి ఆయన తన అసమర్థతను బయటపెట్టుకున్నా రు. సీఎం హోదాలో రేవంత్ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిందిపోయి, చేతులెత్తేసి నిస్సహాయతను వ్యక్తపరచడం విడ్డూరం.
వలస పాలనలో దశాబ్దాల పాటు చవిచూసిన కరువు రోజులను సీఎం రేవంత్ మళ్లీ అనుభవంలోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల బాధలు వర్ణనాతీతం. రేవంత్ పాలనలో సాగు సడుగులు విరిగిపోయాయి. సమయానికి పెట్టుబడి సాయం అందకపోయినా అప్పో సప్పో చేసి రైతులు సాగు చేశారు. పుండు మీద కారం చల్లినట్టు.. కరెంటు కోతల రూపంలో రేవంత్ సర్కార్ రైతులపై కక్షగట్టింది. వాస్తవానికి ఈ వానకాలంలో భారీ వర్షాలు పడ్డా యి. వరదలూ వచ్చాయి.
రాష్ట్రంలోని కుంటలు, చెరువుల తో పాటు చిన్నాచితకా ప్రాజెక్టు లు మొదలుకొని నాగార్జునసాగర్ సహా అన్ని జలాశయాలు నిం డాయి. రెండు నెలలపాటు నిరంతరంగా కృష్ణమ్మ సముద్రంలోకి ఉరకలెత్తింది. గోదార మ్మ పోటెత్తింది. అయినా అన్నదాతలకు ఈ పరిస్థితి దాపురించడం రేవంత్‌రెడ్డి వైఫల్యానికి నిదర్శనం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాళేశ్వరం సహా కేసీఆర్ సర్కారు కట్టించిన చిన్నాచితకా ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ సర్కారు అవగాహనరాహిత్యం వల్ల కురిసిన చినుకు కురిసినట్టే సంద్రం పాలైంది.
అందుకే నేడు రాష్ట్రంలో చుక్కనీరు లేని పరిస్థితి తలెత్తింది. దీనంతటికీ రేవంత్‌రెడ్డి కారణం కాదా? నీళ్లివ్వడం చేతకాని సీఎం ఎండాకాలం, ఎండలు అని కాకమ్మ కథలు చెప్పడం హాస్యాస్పదం. ఎండాకాలంలో ఎండలే ఉంటాయి. వానకాలంలో వర్షాలు కురిసి, వరదలు వస్తాయి. ఆ నీటిని చుక్క చుక్క ఒడిసిపట్టి ఎండాకాలంలో పంటలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించిన రేవంత్‌రెడ్డి నేడు తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడం అతని చేతకానితనానికి నిదర్శనం. పంటలు ఎండి, గుండెలు మండి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే సీఎంగా ఉన్న రేవంత్‌కు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికందక, అప్పులపాలై అన్నదాతలు తనువుచాలిస్తున్నా తానేమీ చేయలేనని చెప్పడం సిగ్గుచేటు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సాకులు చెప్పకుండా వ్యూహ చతురతతో ఆదుకునేవాడే అసలైన పాలకుడు. కేసీఆర్ ఆ కోవకు చెందినవాడే. ఉమ్మడి ఏపీలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ ఎంతో మేధోమథనం చేసి, ప్రాజెక్టులు కట్టి, చెయ్యి పట్టి పైకి తీసుకొచ్చారు. కానీ, నేడు రేవంత్ తన వల్ల కాదని తప్పించుకుంటున్నారు. తన అసమర్థత వల్ల రోజుకొకరి చొప్పున ఇప్పటికే 430 మం దికి పైగా అన్నదాతలు కాడికి వేలాడారు. అనేకమంది తమ కుటుంబ పెద్దలను కోల్పోయారు. రేవంత్ చేసిన పాపం శాపంగా మారి అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. ఆ కుటుంబాల ఉసురు రేవంత్‌రెడ్డికి తప్పక తగులుతుంది.
– అనిల్ కుర్మాచలం, ఎఫ్డీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్