రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు భాషా ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. అధికారులు స్వతంత్రంగానే తీసుకుంటున్నారా? లేక ప్రభుత్వ పాలసీలుగా చూపిస్తున్నారా? ఈ విషయంలో కమిటీలు వేసి, ఆ కమిటీ నివేదిక ఆధారంగా అమలు చేస్తున్నారా? ఒకవేళ ఏదైనా కమిటీ వేస్తే సభ్యులుగా ఎవరున్నారు? ఏ వర్సిటీ వారిని, ఏ సాహితీవేత్తలను సంప్రదిస్తున్నారు? తెలంగాణలో తెలుగును కనుమరుగు చేయాలని ఏమైనా కంకణం కట్టుకున్నారా? పోనీ వీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇతర భాషలను సంపూర్ణంగా నేర్పించే అవకాశం ఏమైనా ఉన్నదా? అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్న విద్యార్థులు ఇంటర్‌కు వచ్చేసరికి ద్వితీయ భాషగా తెలుగు తీసుకుంటున్న సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తెలిసినవారు కావడం వల్లనో, కొంచెం స్థాయి పెరిగినదనో కఠినంగా ఉండే పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడి నుంచి డిగ్రీ, ఆ తర్వాత పీజీకి వచ్చేసరికి అత్యున్నత స్థాయిలో పాఠ్య ప్రణాళికలుంటున్నాయి. మన రాష్ట్రంలో మాత్రమే ఎక్కువగా చదువుకునే తెలుగును మనమే చులకన చేస్తే ఎలా? తెలుగులో సరైన శిక్షణను ఇవ్వకపోతే ఇతర ప్రాంతాల్లో తెలుగు విద్యార్థులకు అసలు అవకాశాలే ఉండవు. తెలుగు ప్రాంతాల్లో తెలుగును తప్పనిసరి చేసి, అన్ని ప్రాంతాల విద్యార్థులతో తెలుగును చదివించాల్సిన అవసరం ఉన్నది. పొరుగున కన్నడ, తమిళ రాష్ర్టాలు తీసుకునే నిర్ణయాలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే అప్పటివరకు తెలుగు చదువుకున్న విద్యార్థులను ఇంటర్‌కు వచ్చేసరికి సంస్కృతానికి మారుస్తున్నారు? దానివల్ల విద్యార్థులకు ఒనగూడే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ తతంగమంతా ప్రభుత్వ కళాశాలల కేంద్రంగా జరుగుతుండటమే విషాదం. మనం విద్యార్థులకు సాహిత్యాన్ని అందిస్తున్నామా? లేకుంటే ఏ భాషా పూర్తిగా రాకుండా నాశనం చేస్తున్నామా? అనే విషయాన్ని ఇటు పాలకులు, అటు అధికారులు ఆలోచించాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లేని సంస్కృత భాషను ఒకేసారి ఇంటర్లో పెడితే విద్యార్థులు ప్రాథమిక స్థాయి వరకు నేర్చుకోగలుగుతున్నారు. పోనీ విద్యార్థులు అదే భాషలో నేర్చుకొని పూర్తిగా అదే భాషలో రాస్తున్నారా అంటే అదీ లేదు. ఇతర భాషల్లో రాస్తున్నారు. అటు సంస్కృతం పూర్తిగా రాక, ఇటు తెలుగూ పూర్తిగా రాకుండా విద్యార్థులు అసంపూర్ణంగా మిగిలిపోతున్నారు.
పాఠ్య ప్రణాళికల్లో అత్యంత ప్రాథమిక స్థాయిలో ఉండటం వల్ల అధ్యాపకులు వందకు వంద మార్కులు వేసి విద్యార్థులను సంతృప్తి పరుస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కళాశాలలు కూడా మార్కుల కోసం అదే సబ్జెక్టును తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తద్వారా విదార్థులకు ఇటు తెలుగు, అటు సంస్కృతం ఏదీ రాకుండా పోతున్నది. దాని ద్వారా అందాల్సిన ఫలాలేవీ విద్యార్థులకు అందడం లేదు. అంతేకాదు, ఇతర భాషల్లో ద్వితీయ భాష చదివే ఏ సబ్జెక్టు విషయంలోనైనా అంతే. అందువల్ల ఇంటర్ బోర్డు ఏం ప్రయోజనం సాధిద్దామనుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఫ్రెంచ్ లాంటి భాషల్లోనూ ఇటువంటి నిర్ణయాలే ఉంటున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ ప్రస్తుతం సంస్కృతం ద్వితీయ భాషగా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై అధికారులు ఇప్పటికైనా కొంచెం శ్రద్ధ తీసుకొని సమీక్షించాల్సిన అవసరం ఉన్నది.
ఈ సందర్భంలో ఉస్మానియా వర్సిటీ తెలుగుశాఖ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులందరూ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతున్నారు. ఉన్నత స్థాయి ఆచార్యులతో కమిటీ వేసి అసలు ద్వితీయ భాష వ్యవహారాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకు సరైన పాఠ్య ప్రణాళిక లేకుండా, మార్కుల కోసమే ఏర్పడే ద్వితీయ భాషలను వెంటనే సమీక్షించాలి.
– ఆచార్య సాగి కమలాకర శర్మ
97042 27744