జూలై 8వ తేదీ రాత్రి… యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామం. 32 ఏండ్ల మైల సురేశ్ ఇంటి దూలానికి వేలాడుతున్నడు. ఎకరం పొలం… ఇంకొంత కౌలు… రూ.5.5 లక్షల బ్యాంకు అప్పు. పంట పండింది.. చేతికీ అందింది. కానీ కొనే దిక్కేది? దానికి గిట్టుబాటు ధర ఏది? గిట్టుబాటు లేదని అప్పులోడు ఆగుతడా! వడ్డీ మీద వడ్డీ పెరిగింది. అది రైతు మెడకు ఉరితాడై బిగిసింది. ఇది ఒక్క సురేశ్ వ్యథ కాదు. మొన్నటి ఎండాకాలంలోనే మెదక్‌లో రాజయ్య, ఖమ్మంలో సుధాకర్, సిద్దిపేటలో వెంకటేశ్, ఆదిలాబాద్‌లో మల్లేశ్… పేర్లు మారుతున్నయి, ఊర్లు మారుతున్నయి. కానీ చావులు కొనసాగుతున్నయి. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో రైతు ఎల్లయ్యను కదిలిస్తే.. ‘కేసీఆర్ జీవం పోసిన సాగుబడిని రేవంత్ సర్కార్ చంపేస్తున్నది గదరా! ఒక్క ఓటు వేసి ఎంత పాపం మూట గట్టుకుంటిమి‘ అనే ఆవేదన ఆయన నోటి నుంచి వచ్చింది.
ఉమ్మడి పాలనలో తెలంగాణ భౌగోళిక, జీవ వైవిధ్యాన్ని పూర్తిగా విస్మరించింన్రు. వరి పరిశోధనలన్నీ గుంటూరు, ఉభయ గోదావరి కేంద్రాలుగానే తిరిగినయి. అప్పటి 13 జిల్లాలల్ల పది జిల్లాలు సముద్రం ఒడ్డుననే ఉన్నందున, తీర ప్రాంతపు తేమ గాలికి తగ్గ వంగడాలే సృష్టించి, బలవంతంగా మన నెత్తిన రుద్దిన్రు. మన గాలి వేరు, మన నేల వేరు, మన ప్రకృతి వేరు. కానీ తెలంగాణ గతిలేక అవే కోస్తా విత్తనాలు సాగు చేసేటోళ్లు. మొలక అలికింది మొదలు.. పంట చేతికందేదాక దినదిన గండమే. ఉల్లికోడు, అగ్గి తెగులు, పేనుబంక అన్నీ వలస పాలన విత్తనాల పుణ్యమే. పంటతో కాదు.. వలస గింజతోనే రైతు ఓడిపోయేటోడు.
మన రాష్ట్రం మనకు వచ్చాక ఈ అన్యాయాన్ని సరిదిద్దిండు కేసీఆర్. చెరువుల పునరుద్ధరణతో తెలంగాణ జరంత నిమ్మలపడ్డ తర్వాత, మన గాలికి తగ్గ వరి వంగడాల సృష్టిపైనే సీఎంగా దృష్టి పెట్టిండు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను పురమాయిస్తే.. నికార్సయిన తెలంగాణ వంగడం ‘బతుకమ్మ‘ పేరుతో ఎదిగింది. పెద్దఎత్తున ధాన్యం పండింది. ఆ తర్వాత తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) వచ్చింది. ఇది దేశ ధాన్యం మార్కెట్‌నే కుదిపేసింది, క్వింటాకు రూ.3,545 దాకా ధర పలికింది. కర్నూల్ సోనా బియ్యం పక్కకు పోయి తెలంగాణ సోనా బియ్యం మార్కెట్లోకి చేరింది. అటు జల విప్లవం, ఇటు హరిత విప్లవంతో తెలంగాణ వ్యవసాయ రూపురేఖలే మారిపోయినయి. దీనికి తోడు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రికార్డు స్థాయి కొనుగోలు కేంద్రాల విస్తరణతోపాటు అన్నీ కలిసి తెలంగాణ రైతు తొలిసారి పంట బర్కతి చూసిండు.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి బోనస్ పేరుతో రైతు మెడకు కొత్త ఉచ్చు పేనిండు. ఏడు సన్న వంగడాలకే బోనస్ అంట. ఆర్ఎన్ఆర్-15048, బీపీటీ-5204, కేఎన్ఎస్-1638, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, వరంగల్-44, కేఎన్ఎం-7715. ఈ రకాలనే సాగు జేయాలె, ఆన్లైన్ల నమోదు జేయాలె అంటున్నరు. మిగతా 26 రకాల్ని ఒక్క కలం పోటుతో అవతల పడేసిన్రు. మిర్యాలగూడ రైతన్న తరతరాలుగా పండించే ’చిట్లు’ (చిట్టి ముత్యాలు)కు జన్యు ధ్రువీకరణ లేదని పక్కన పెట్టిన్రు.
చిట్లు ఇప్పటి వడ్లు కాదు.. అవి కృష్ణదేవరాయల కాలం నుంచి వారసత్వంగా వచ్చాయని ఈ పాలకులకు ఎవరు చెప్పాలి? కావేరి వద్దంట… జెయింట్ బీపీటీ వద్దంట.. రైతు తన నేలకు, తన అనుభవానికి, తన మార్కెట్‌కు తగ్గ గింజను తానే ఎంచుకొని పండిస్తానంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంగీకరించదట. ఉమ్మడి రాష్ట్రంలో కోస్తా వంగడాలు రుద్దినట్టే… ఇప్పుడు సచివాలయంలో కూర్చొని నిర్ణయించిన ఏడు వంగడాలనే తెలంగాణ రైతుపై మళ్లీ రుద్దుతున్నరు. ఇది బోనస్ విధానమా? లేక రైతు స్వేచ్ఛకు సంకెళ్లు వేసే మంత్రాంగమా?
ఇదొక్కటే కాదు.. జూన్ నెలలో 58% లోటు నమోదైందని చెప్తున్నరు. 15 జిల్లాల్లో 59% మైనస్ వర్షపాతం కురిసిందని, ’ సంవత్సరాల్లో ఎన్నడూ లేని అనావృష్టి’ అని చెప్తున్నరు. ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటే ఎట్లుండేది? దేవుడు ఇచ్చిన వరంలా నిలబడేది. తాజా లెక్కల ప్రకారం.. మేడిగడ్డ వద్ద గోదావరిలో 70 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతున్నది. ఆ నీటిని అన్నారం, సుందిళ్ల మీదుగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ, మధ్యమానేరు వంటి రిజర్వాయర్లకు ఎత్తిపోస్తే.. తెలంగాణ అంత నారుమళ్లుతో పచ్చగా ఉండేది.
కానీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షతో ప్రాజెక్టును పక్కన పెట్టిండు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపేయడం వల్ల నష్టపోయింది కేవలం నీటి పారుదల వ్యవస్థ కాదు… తెలంగాణ రైతు భరోసా అని కాంగ్రెస్ పాలకులు గుర్తించాలి. పంట పండించినా రైతుకు గిట్టుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వం మక్కకు క్వింటాకు రూ.2,410 మద్దతు ధర ప్రకటించినా, గన్నీ బ్యాగులు, రవాణా, అదనపు తూకాల పేరుతో రైతు చేతికి అందేది రూ.2,050 వరకే. కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలే లేక దళారులకు రూ.1,700-1,750కే అమ్ముకోవాల్సి వస్తున్నది. పసుపు రైతుదీ ఇదే దుస్థితి.
ఎంఎస్పీ కాగితాలకే పరిమితమైంది. వరి పండించిన కౌలు రైతుల్లో కేవలం 17-20 శాతం మంది, పత్తి రైతుల్లో 6.7 శాతం మంది మాత్రమే ప్రభుత్వానికి నేరుగా విక్రయించగలుగుతున్నరు. మిగతావాళ్లంతా దళారుల దయా దాక్షిణ్యాల మీద పంట అమ్ముకుంటున్నారని తెలంగాణ కౌలు రైతుల సర్వే-2026 తేల్చి చెప్పింది. ఐదు ఎకరాల లోపు రైతు రూ.3-5 లక్షల అప్పులో చిక్కుకొంటే ఆత్మహత్యల ప్రమాదం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నరు. ‘దేశంలో రైతుల సగటు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తేల్చి చెప్పాయి.
రైతుకు విత్తనపు గింజ ఎంపిక స్వేచ్ఛను పాలకులు కుదించిండ్రు. సన్న వడ్ల బోనస్‌పై ఆంక్షలు పెట్టిన్రు. కాళేశ్వరం నీళ్లను దూరం చేసిన్రు. కొనుగోలు వ్యవస్థను నిర్వీర్యం చేసిన్రు. రైతు భరోసాను వాయిదాల పాల్జేసిన్రు. యాప్ పెట్టి యూరియా అందకుండా చేసిన్రు. కేసీఆర్ వేసిన వ్యవసాయ పునాదులను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ సాగుబడినే సంక్షోభంలోకి నెట్టడం రాష్ర్టానికి శుభసూచకం కాదు.
ఇంకెన్ని కడగండ్లు దాటితే తెలంగాణ వ్యవసాయం తేరుకుంటుంది? ’సాగుబడిని చంపేస్తిరి గదరా!’ అని అన్నారం ఎల్లయ్య గుండె లోతుల నుంచి వచ్చిన మాట వెనుక ఎంత వేదన, ఎంతటి చేదు అనుభవం దాగి ఉన్నదో తెలంగాణ పల్లెల్లో తిరిగితే అర్థమవుతుంది. యూరియా దగ్గరా రైతు ఆందోళన తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ ఖరీఫ్‌లో తెలంగాణకు 11.5 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వమే అంచనా వేసింది. కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులకే ఒప్పుకోవడంతో సీజన్ మొదలయ్యే నాటికే 1.5 లక్షల టన్నుల లోటు స్పష్టమైంది.
ఇదే సమయంలో గత 125 ఏండ్లలోనే అత్యల్ప వర్షపాతం నమోదవడంతో 17 జిల్లాల్లో సాగు ఆశించిన స్థాయికి చేరలేదు. అయినా జూలై మొదటి వారానికే సుమారు 2.38 లక్షల టన్నుల యూరియా రైతుల చేతికి వెళ్లినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. అసలు యూరియా వినియోగంలో అత్యంత కీలకమైన జూలైఆగస్టు నెలలు ఇప్పుడే మొదలవుతున్నయి. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారమే ఈ రెండు నెలల్లో ప్రతి నెలా మరో 1.5 నుంచి 3 లక్షల టన్నుల వరకు అదనపు అవసరం ఉంటుంది. అంటే వర్షాలు ఆలస్యమైనంత మాత్రాన రైతు అవసరం తగ్గలేదు… వాయిదా పడింది అంతే. ఆ వాయిదా పడిన డిమాండ్ వానలు కుదిరిన వెంటనే ఒక్కసారిగా విరుచుకుపడటం ఖాయం.
యాప్‌లు, గణాంకాలతో ప్రభుత్వం మభ్యపెడుతున్నది. అవసరమైన బఫర్ నిల్వలు పెంచడం, అదనపు కేటాయింపులు ముందుగానే రాబట్టడం, జిల్లాల వారీగా రైతుకు స్పష్టమైన భరోసా కల్పించడం వంటి చర్యలు కనిపించడం లేదు. ఎరువుల కొరత అనేది వచ్చిన తర్వాత ఎదుర్కొనే సంక్షోభం కాదు… సంక్షోభం వచ్చిన తర్వాత సమీక్షలు పెట్టడం పరిపాలన ధర్మం కాదు. ముందే అంచనా వేసి నివారించాల్సిన బాధ్యత. ఆ వైఫల్యం చివరికి యూరియా కొరతగా కాదు… రైతు గుండె కోతగా బయటపడుతుంది. రెండు పాలనల మధ్య తేడాను గణాంకాలు మాత్రమే చెప్పడం లేదు. కేవలం నాయకుల ప్రసంగాలు మాత్రమే చెప్పడం లేదు… పంట పొలమే చెప్తున్నది. కేసీఆర్ నేలకు తగ్గ గింజ ఇచ్చిండు… నీళ్లిచ్చిండు… పెట్టుబడికి, గిట్టుబాటుకు భరోసా ఇచ్చిండు. రేవంత్‌రెడ్డి పాలనలో ఇప్పుడా సాగుబడి పునాదులు కదులుతున్నయనే ఆవేదనే రైతు మాటల్లో వినిపిస్తున్నది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు