గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు. తమ పిల్లాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకోవాలని ఉవ్విళ్లూరారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వారి ఆశలను చిదిమేస్తున్నది. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలను కృత్రిమ మేధ అమాంతం మింగేస్తుందన్న భయాలు నెలకొన్నాయి.
ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ ఇటీవల 400 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించడం ఏఐ ఇస్తున్న హెచ్చరికగానే భావించాలి. నిజానికి భారత్‌లో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నది ఐటీ రంగమే. అయితే, కృత్రిమ మేధ రాకతో ఇప్పుడు దీనిని గత చరిత్రగానే చెప్పుకోవాలి. నెలకు రూ.20 వేల నుంచి రూ. 25 వేలు అందుకున్న ఇద్దరు ఫ్రెషర్ల స్థానంలో రూ. 17 వేలు మాత్రమే చెల్లించి ఏఐతో వారి సేవలను భర్తీ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఐటీ కంపెనీలకు లభించింది. అదే నెలకు రూ. 17,500 ఖర్చు చేస్తే పీహెచ్డీ స్థాయి ఏఐ ఏజెంట్‌ను యాక్సెస్ చేసుకొని నెలకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వేతనం చెల్లిస్తున్న ఉద్యోగులను భర్తీ చేసుకోవచ్చు. బడా ఐటీ కంపెనీలకు ఈ విషయం రెండేండ్ల క్రితమే తెలుసు. 2022 ఏడాది చివరలో వచ్చిన ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పెను ప్రకంపనలే సృష్టించింది. టెక్ కంపెనీలకు ఇది ఒక రకంగా వరం కాగా, మరో రకంగా ముప్పు కూడా పొంచి ఉన్నది.
మరీ ముఖ్యంగా భారత్‌లోని ఐటీ కంపెనీలకు ఏఐ భయం పట్టుకుంది. ఇక్కడి సంస్థల్లో చాలావరకు విదేశీ కంపెనీలకు పనిచేస్తాయి. వారికి కావాల్సిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అందిస్తాయి. వారి డాటాను డిజిటలైజ్ చేస్తాయి. అయితే, ఇప్పుడు విదేశీ కంపెనీలు భారత్‌కు ఔట్ సోర్సింగ్ ఇవ్వడానికి బదులు చాట్‌జీపీటీకే ఆ పని అప్పగించే అవకాశం ఉన్నది. ‘స్టెబిలిటీ ఏఐ’ రూపకర్త ఇమాద్ మొస్టాక్ 2023 జూలైలోనే ఈ పరిణామాన్ని అంచనా వేశారు. ఏఐ వల్ల తొలుత ఉద్యోగాలు కోల్పోయేది భారత్‌లోని ఐటీ కోడర్లేనని హెచ్చరించారు. భారత్‌లోని కోడ్ రైటర్ల కంటే ఏఐ మరింత మెరుగ్గా పనిచేస్తుందని, భారతీయ కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
గత రెండేండ్లుగా చూసుకుంటే ఐటీ ఉద్యోగాల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో వంటివి 2023-24 నుంచి ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి. వేతన పెంపుదలను కూడా ఆలస్యం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం.. క్లరికల్ స్టాఫ్, టెక్నీషియన్లు కాకుండా ఇండియాలో దాదాపు రెండు కోట్ల మంది వైట్‌కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మేజర్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్-5లో కొనసాగుతున్నాయి.
ఐటీ ఉద్యోగాలు సాధిస్తే తమ బతుకులు గాడిన పడతాయన్న ఆశతో దేశంలోని మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వైపు బలవంతంగా పంపుతున్నారు. ఇందుకోసం సంపాదించుకున్న మొత్తాన్ని ఐటీ చదువులకు వెచ్చిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం13 లక్షల మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేస్తున్నారు. నిజానికి ఐటీ జాబ్ సౌకర్యవంతమైన జీవితానికి గ్యారెంటీ మాత్రమే కాదు.. విదేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగానికి అది తలుపులు తెరుస్తుంది.
విదేశీ కంపెనీలు భారత్‌లోని టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే భారత్‌లోని టెక్ కంపెనీలు చాలా తక్కువ ధరకే ప్రాజెక్టులు చేసి పెడతాయి. దీనినిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. రానున్న రోజుల్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరిగినా వేతనం మాత్రం తగ్గుతుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు మధ్యస్థంగా నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆఫర్ చేస్తున్నాయి. పదేండ్ల క్రితంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2015లో వాస్తవ కొనుగోలు శక్తి రూ. 25 వేలు ఉంటే ప్రస్తుతం అది రూ. 40 వేలుగా ఉన్నది. అప్పట్లో వేతన పెంపు కూడాఎక్కువగా ఉండటంతోపాటు క్రమం తప్పకుండా ఉండేది. ఇప్పుడా స్థాయికి చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది.
‘బ్లూమ్‌బర్గ్’ సర్వే ప్రకారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో వాల్‌స్ట్రీట్‌లో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యే అవకాశం ఉన్నది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను ఏఐ మింగేస్తుందని సర్వే అంచనా వేసింది. భారత్‌లోని మధ్యతరగతికి ఇది మరో ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకంటే వైట్‌కాలర్ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఆర్థిక రంగంలోనే ఉన్నాయి.
ఇక, తాజా పరిణామాలు మధ్యతరగతికి ఒక గుణపాఠంగానే భావించాలి. పిల్లలకు ఇష్టం లేకున్నా కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్లాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలి. గత రెండు దశాబ్దాలుగా ఐటీ ఉద్యోగాలు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, సూపర్ టాలెంట్ ఉంటే తప్ప ఇప్పుడు మనుగడ సాగించలేని పరిస్థితులున్నాయి. అయితే, ఇది ఒక్క ఇండియాకే పరిమితమైన సమస్య కాదు. ప్రతి చోటా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అమెరికాలో కొవిడ్‌కు ముందున్న కాలంతో పోలిస్తే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉద్యోగాలు 35 శాతం పడిపోయాయి. ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చాక ఉద్యోగాల్లో క్షీణత మొదలైంది. మరో చేదు నిజం ఏంటంటే.. ఏఐ ప్రభావం ఒక్క టెక్ రంగానికే పరిమితం కాదు, ప్రతి రంగంలోనూ ఇది ఉద్యోగాలను భర్తీ చేయగలదు.
‘బ్లూమ్‌బర్గ్’ సర్వే ప్రకారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో వాల్‌స్ట్రీట్‌లో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యే అవకాశం ఉన్నది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను ఏఐ మింగేస్తుందని సర్వే అంచనా వేసింది. భారత్‌లోని మధ్యతరగతికి ఇది మరో ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకంటే వైట్‌కాలర్ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఆర్థిక రంగంలోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఒక తరం.. వారి తల్లిదండ్రుల కంటే తక్కువ సంపాదించే ప్రమాదంలో పడింది. ఉద్యోగాలు రాని యువతీయువకులు వారి తల్లిదండ్రులపైనే ఆధారపడతారు. వివాహాలు ఆలస్యమవుతాయి. ఇది వారిని మానసికంగా కుంగదీస్తుంది. నిరాశ పెరుగుతుంది. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడటం సర్వసాధారణం అయిపోతుంది.
భారతదేశంలో నాలుగు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజలు ఐటీ కలల చుట్టూనే తిరుగుతున్నారు. కాబట్టి తర్వాతి తరమైనా ఆనందంగా జీవించాల్సిన అవసరం ఉన్నది. స్నేహితులతో గడపడం, పార్కులో ఓ సాయంత్రం అలా వాకింగ్ చేయడం, పుస్తకం చదవడం, ఆడిపాడటం ద్వారా ఆనందాన్ని వెతుక్కోవాలి. సూర్యుడు ఉదయించడానికి ముందు వచ్చే చీకటి కాలానికి మధ్యతరగతి ప్రజలు సిద్ధంగా ఉండాలి.
– ఎడిటోరియల్ డెస్క్