బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ ఇచ్చిన సమాధానాల వార్తలు గత వారాంతంలో వెలువడ్డాయి. నాయకుల గురించి, వారి శక్తి సామర్థ్యాల గురించి ప్రశ్నలకు మనుషులు తమ అభిప్రాయాలు తెలియజేయటం మనకు ఇంతవరకు తెలిసిన విషయం. ప్రపంచం అత్యాధునిక సాంకేతిక యుగంలోకి ప్రవేశిస్తున్న దశలో యంత్రాలు ఆ పని చేయటం ఒక కొత్త అనుభవం. విచిత్రమైన అనుభవం కూడా. కేసీఆర్ గురించి ‘గ్రోక్’ ఇచ్చిన వివరణలు ఇంతకాలం రికార్డులలో నమోదై, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నవే. అందుకు ఇప్పుడిది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ధృవీకరణ అన్నమాట. అయితే, కేసీఆర్ నాయకత్వం గురించి ప్రజలు గాని, ‘గ్రోక్’ గాని శాస్త్రబద్ధంగా చేయని విశ్లేషణలు కొన్నున్నాయి. అవేమిటో చూద్దాం.
బీఆర్ఎస్ పార్టీ స్థాపితమై 25 ఏండ్లు పూర్తవుతున్న వేళ ఈ నెల ఆఖరున వరంగల్‌లో రజతోత్సవ సభ జరుపుకోనున్నది. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ గురించి, నాయకత్వం గురించి, పార్టీ ప్రభుత్వం గురించి చెప్పుకోవలసినవి అనేకం ఉంటాయి. అవన్నీ వర్తమానానికి, భవిష్యత్తుకు అవసరమైనవే గాక, గత చరిత్రలో భాగం కూడా కనుక. తెలంగాణ చరిత్ర, తెలుగు వారి చరిత్ర, దక్షిణాది చరిత్ర, భారతదేశ చరిత్ర, రాష్ర్టాల చరిత్ర, ఫెడరలిజం చరిత్ర, అభివృద్ధి సంక్షేమాల చరిత్ర, పరిపాలనా చరిత్రలతో పాటు నాయకత్వ చరిత్రలలో కూడా ఇవి భాగమవుతాయి. అవి ఏవి? ఏ విధంగా? అన్నది రజతోత్సవ సభలలోగా రాసుకోవటం సాధ్యం కానిది గనుక, ఆ పని ఆ తర్వాతనైనా జరగాలి.
ప్రస్తుతానికి వస్తే, ‘గ్రోక్’ సమాధానాల వివరాలు ఏవైనప్పటికీ అవి ప్రధానంగా రెండు కోణాలను స్పృశించాయి. ఒకటి, యథాతథంగా కేసీఆర్ నాయకత్వం. రెండు, తన పరిపాలన. ‘గ్రోక్’ పేర్కొన్న వివిధ విషయాలన్నీ ఈ రెండింటిలోకి ఇమిడిపోతాయి. మొదట అనుకున్నట్టు పరిపాలన గురించిన వివరాలు రికార్డులలో నమోదైనవి, ప్రజలు మాట్లాడుకుంటున్నవి, దానితో పాటు ఇప్పుడు ‘గ్రోక్’ సమాధానాలలోనూ ప్రస్తావనకు వచ్చినవే అయినందున ఇక్కడ మళ్లీ రాయనవసరం లేదు. అయితే ఒకటి, ఈ తెలిసిన విషయాలైనా స్థూలంగా, చెదురుమదురుగా మాట్లాడుకుంటున్నవి, రికార్డులలో సబ్జెక్టుల వారీగా విడివిడిగా పేర్కొంటున్నవి మాత్రమే. వాటన్నింటిని ఒకచోట చేర్చి, ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించి, సమగ్ర రూపం ఇచ్చే ప్రయత్నం ఇంకా జరగవలసి ఉన్నది.
కేసీఆర్ నాయకత్వ విశ్లేషణ అన్నది కూడా ఇందులో భాగమైనదే. ‘గ్రోక్’ తన సమాధానాలలో ఆయన నాయకత్వం గురించి ఒకటి రెండు మాటలు ప్రశంసాపూర్వకంగా ప్రకటించింది. అవి ఈ విధంగా ఉన్నాయి. ‘శూన్యం నుంచి రాజకీయ శక్తిని సృజించి, తెలంగాణను జాగృతం చేసి, ఉద్యమాన్ని నడిపించి, రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి చేసి చూపించిన గొప్ప నాయకుడు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నాయకత్వ లక్షణాలకు చిరునామాగా కేసీఆర్‌ను చెప్తాను. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ముందుండి నడపడంలో, కేసీఆర్ అన్నీ తానై నిలిచారు. ఆయనకు దూరదృష్టి, పట్టుదల, దార్శనికత అపారంగా ఉన్నాయి’.
పరిపాలన గురించిన మాటలు అనేకం ఉన్నప్పటికీ, ప్రస్తుతం చర్చిస్తున్నది నాయకత్వ కోణం గురించి మాత్రమే అయినందున, అందుగురించి ‘గ్రోక్’ అన్నదేమిటో పైన చూశాము. ఆ మాటలను గమనించినప్పుడు అందులోని ఒక్కొక్క సూక్ష్మమైన మాట వెనుక కనిపించేది చాలా ఉంటుంది. అదే సమయంలో, మొదట అనుకున్నట్లు, కేసీఆర్ నాయకత్వం గురించి ‘గ్రోక్’ చెప్పనివీ, ప్రజలు గుర్తించనివీ అయిన శాస్త్రీయమైన కోణాలు, విశ్లేషణలు కొన్ని ఉంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాము.
నాయకత్వానికి మొత్తం 12 కోణాలుంటాయి. అవేమిటో ముందు చెప్పుకొని, తర్వాత వివరాలలోకి వెళదాము. అదే క్రమంలో వాటిని కేసీఆర్‌కు వర్తింపజేసేందుకు ప్రయత్నిద్దాము. కోణాలనేవి, 1. విషయ అధ్యయనం, 2. ఆ అధ్యయనం ప్రకారం సిద్ధాంతీకరణ, 3.తనతో ఏకీభవించే ఒక చిన్న బృందాన్ని తొలి దశలో వెంట చేర్చుకోవటం, 4.భావజాల వ్యాప్తి, 5.పార్టీ నిర్మాణం, 6.ప్రజలను కదిలించటం, 7.కదులుతున్న ప్రజలను సంఘటితపరచటం, 8. ఉద్యమ నిర్వహణ, 9.ఉద్యమాన్ని విజయవంతం చేయటం, 10. ఉద్యమ దశ నాటి దార్శనికత ప్రకారం పరిపాలన. 11.ఓటమి ఎదురైనట్లయితే పునరుజ్జీ వం. 12.కొత్త తరం నాయకత్వ తయారీ.
కేసీఆర్ ప్రయాణ క్రమాన్ని మొదటినుంచి గమనించినట్లయితే ఈ 12 కోణాలు కూడా మనకు అందులో కనిపిస్తాయి. వీటిని స్థూలదృష్టితో చూసినట్లయితే కొన్నింటి మధ్య తేడా తోచకపోవచ్చు. కానీ, సూక్ష్మదృష్టికి, ఆచరణాత్మకమైన దృష్టికి మాత్రం వాటి మధ్య తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ 12లో ప్రతి ఒక్కదానిని సమర్థవంతంగా, సక్రమంగా నాయకత్వం నిర్వహించగలిగితే మాత్రమే భవన నిర్మాణంలో ఇటుకలు ఒక్కొక్కటి సరిగా కుదురుకొని గోడ నిలిచే పద్ధతిలో ఉద్యమం తొలిదశ నుంచి చివరివరకు విజయవంతంగా సా గుతుంది. మధ్యలో ఏ ఒక్క ఇటుకను సరిగా పేర్చకున్నా నిర్మాణమంతా భంగపడినట్లుగానే ఉద్యమ విషయంలోనూ జరుగుతుం ది. ఈ పన్నెండు కూడా ఇంజిన్ వెనుక రైలు పెట్టెల వలె ఆటోమేటిక్‌గా సాగేవి కావు. ప్రతి ఒక్క దశను సమర్థవంతంగా నిర్వహిస్తేనే తర్వాత దశ సక్రమంగా ఏర్పాటై నిలిచి నడుస్తుంది.
పై 12 కోణాలు, లేదా సూత్రాల ప్రకారం మొదటినుంచి చివరివరకు వ్యవహరించటంలోనే కేసీఆర్ నాయకత్వ అసాధారణ ప్రతిభ మనకు కనిపిస్తుంది. ఆ 12 సూత్రాలకు అనుగుణంగా ఆయన ఎప్పటికప్పుడు ఏమేమి చేస్తూ వచ్చారో ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన సన్నిహిత సహచరులు కొందరున్నారు. అదే ప్రణాళిక ప్రకారం వారు పూనుకొన్నట్లయితే, ఈ రజతోత్సవ కాలంలో ఈ సాధారణ చరిత్ర రచన సిద్ధించగలదు.
మన దేశంలో అనేకానేక ఉద్యమాలు జరిగాయి. పలువిధాలైన లక్ష్యాలతో సాగాయి. స్వాతంత్య్రానికి ముందు వలస పాలనకు, రాచరికాలకు వ్యతిరేకంగా. ఆ తర్వాత వేర్వేరు అంశాలపై. వీటన్నింటికి అనేకమంది నాయకులు కనిపిస్తారు. కాని ఈ మొత్తం 12 కోణాలు కూడా వ్యక్తిగత స్థాయిలో వర్తించేవారు కేసీఆర్ గాక మరెవరున్నారు, ఎందరున్నారు అంటే మాత్రం ఆలోచించవలసి వస్తుంది కొందరికి కొన్ని వర్తిస్తాయి. కానీ అన్నింటికి అన్నీ అంటే మాత్రం తప్పకుండా ఆలోచించవలసిన విషయమే. కాదంటే, అట్లా అనేవారు ఆ పేర్లను ముందుకు తేవటం ఉపయోగకరమవుతుంది.
ఆ కోణాలన్నింటిని కేసీఆర్‌కు వర్తింపజేస్తూ వివరంగా రాయటం ఇక్కడ వీలయ్యేది కాదు. నా అతి పరిమిత జ్ఞానంతో నాకది సాధ్యమయ్యేదీ కాదు. అంతకుమించి, పైన అనుకున్నట్లు, ఆ పని చేయటం ఆయనకు మొదటినుంచి సన్నిహితులుగా ఉండి గమనించినవారికి మాత్రమే సాధ్యమయ్యే పని. అందువల్ల, మనకు తోచినంత వరకు, అది కూడా అతిక్లుప్తంగా చెప్పుకుందాం.
1. విషయ అధ్యయనం. ఇతరత్రా కూడా అధ్యయన శీలి అయిన కేసీఆర్, తెలంగాణ గురించిన చరిత్ర, ఆర్థికం, సమాజం, సంస్కృతి, రాజకీయం, భౌగోళికం, గత ప్రభుత్వాల పాలనలు, అన్యాయాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో పాటు ఇతర ఉద్యమాలు, పోరాటాలు, వనరులు, ప్రజల ఆకాంక్షలు, మనస్తత్వాలు, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల పద్ధతులు, కేంద్ర విధానాలు మొదలైనవాటిపై నిరంతరం అధ్యయనం చేశారు. సుదీర్ఘ చర్చలు సాగించారు. ఆ పని ఇప్పటికీ చేస్తారు గాని ఇక్కడ చర్చిస్తున్నది ఉద్యమకాలం గురించి గనుక అందుకు పరిమితమవుతున్నాము. ఈ విధమైన సమగ్ర అధ్యయనం ఆయనకు తెలంగాణపై మరెవ్వరికీ లేని సమగ్ర అవగాహనను తెచ్చిపెట్టింది. ఆ తర్వాతి కాలానికంతా ఒక బలమైన బౌద్ధిక పునాదిగా పనిచేసింది.
2. సిద్ధాంతీకరణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న భావన కేసీఆర్ కన్న ముందునుంచి ఉన్నదే. కాని గతకాలపు ఉద్యమాల బలాబలాలను, లోటుపాట్లను, వైఫల్యాలను, నాయకత్వాల కారణంగా వాటి రాజీలను అర్థం చేసుకోవటమన్నది మొదలు చేయవలసిన పని. వర్తమాన పరిస్థితులను పరిశీలించి అందుకు ఈ అవగాహనను, అనుభవాలను వర్తింపజేసి, అందుకు అనుగుణంగా సాగి ఉద్యమాన్ని విజయవంతం చేయటం ఎట్లాగన్న సిద్ధాంతీకరణ రెండవ పని. వ్యూహరచన గాని, ఆ తర్వాత అనుకూల-ప్రతికూల పరిస్థితులను బట్టి ఎత్తుగడలు గాని అందుకు అనుగుణంగా ఉంటాయి. ఎప్పుడైనా ఎత్తుగడలలో పరిస్థితులను బట్టి మార్పులుండవచ్చు గాని, వ్యూహం, సిద్ధాంతం స్థిరంగా ఉంటాయి.
3. ఏకీభావం గల చిన్న బృందం. కార్యాచరణ దిశగా అడుగులు ముందుకు పడేందుకు తొలి దశలో ఒక చిన్న సహచర బృందం వెంట నిలవటం అవసరం. అనేక మహా ఉద్యమాలు, పార్టీలు మొదట చిన్న బృందాలు గానే ఆరంభమై విస్తరించాయి. ఆ బృందంలో మేధావులు, కార్యాచరణ చేసేవారు, నమ్మకమైన సహచరుల వంటి వారుంటారు. ఉద్యమ సంస్థ, లేదా పార్టీ నిర్మాణంలో ఇది తొలి దశ.
4. భావజాల వ్యాప్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు అంతకుముందు జరిగినప్పటికీ 25-30 సంవత్సరాలు గడిచేసరికి పరిస్థితులు మా రాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయపరంగా. సమస్యలను బట్టి కూడా. అట్లానే ఒక కొత్త తరం ఉనికిలోకి వచ్చింది. ఆలోచనలు మారా యి. నక్సలైట్ ఉద్యమం తెలంగాణను ఒక ఊపు ఊపిన వెనుక మందగించినా ఆ భావజాల ప్రభావాలు కొంత ఇంకా మిగిలి ఉన్నా యి. బీసీ, దళిత, మహిళా చైతన్యాలు కొత్తగా ముందుకొచ్చాయి. రైతాంగం, యువకుల సమస్యలు తీవ్రమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కోరిక గతం కన్న ఇంకా మారుమూలకు, కొత్త వర్గాలలోకి వ్యాపించి బలపడింది. ఈ మార్పులన్నింటిని పరిగణనలోకి తీసుకుంటూ భావజాలాన్ని రూపొందించటం, దానిని ప్రజలలో వ్యాపింపజేయటం. ప్రత్యర్థుల భావజాలాన్ని, ప్రచారాలను ఎదుర్కొనటం. కొత్త కొత్త వర్గాలను తమ భావజాల పరిధిలోకి తేవటం. తెలంగాణ రాదేమోనన్న నిరాశలను పోగొట్టడం.
5. పార్టీ నిర్మాణం, నిర్మించటంలో భాగంగా వీలైనంత మందికి అవకాశాలు కల్పించటం, పార్టీని మారుమూలలకు తీసుకువెళ్లటం, కార్యకర్తలు, స్థానిక నాయకుల తయారీ.
6. ప్రజలను కదిలించటం వేర్వేరు పద్ధతులలో జరుగుతుంది. రాజకీయ ప్రసంగాలు, ఇతరత్రా ప్రచారాలు, కళారూపాలు, వేర్వేరు తరగతుల వారి సమస్యలను అజెండాపైకి తేవటం, వారిని ఉద్యమంలో భాగస్వాములను చేయటం వంటి మార్గాలలో. ఒకసారి కదిలిన ప్రజలు ఇతరులను కదిలించటం కూడా ఇందులో భాగమే. వారికి అటువంటి ప్రేరణ నాయకత్వం కలిగిస్తుంది. ప్రజలను కదిలించటం ఉద్యమాలలో నిరంతర ప్రక్రియ.
7. ప్రజలను కదిలించటం వేరు, కదిలిన వారిని సంఘటితపరచటం వేరు. అట్లా సంఘటితం కూడా ఐనప్పుడు వారు ప్రేక్షక, వీక్షక పాత్ర నుంచి కార్యాచరణ వైపుకు కదలుతారు. ఉద్యమంతో వారి బంధం స్థిరపడుతుంది. ఆసక్తికరం ఏమంటే, అటువంటి బంధం ఏర్పడినప్పుడు ఒక వేళ ఉద్యమం ఎప్పుడైనా దారి తప్పినట్లు తమ దృష్టికి తోస్తే వత్తిడి చేసి దారిన పెట్టజూశారు. సంఘటితత్వం ప్రభావాలు పలు విధాలుగా ఉంటాయి.
8. ఉద్యమ నిర్వహణ. ఇందులో ఉద్యమ లక్ష్యం చేరుకునేవరకు వ్యూహం, ఎత్తుగడలు, రాజీ పడకపోవటాలు, ఉద్యమం పట్లా, లక్ష్యం చేరుకోగలమనే నినాదం పట్లా ప్రజలకు నమ్మకం నిలిచి ఉండేట్లు చేసుకోవటం, ఎదురు దెబ్బలు తగిలినా పట్టు విడవక సాగటం, తెలంగాణ వ్యతిరేకులలో ఆందోళనలను పుట్టించి పెంచటం, వారి రకరకాల ఎత్తుగడలను చిత్తు చేయటం, వారెన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకపోవటం, ప్రజలు ఎప్పుడైనా నిరుత్సాహ పడితే తిరిగి ఉత్సాహ పరచటం, ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ వారి పట్టుదలను పెంచటం వంటి అనేకానేకం ఉద్యమ నిర్వహణలో భాగమవుతాయి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటినీ చాకచక్యంగా ఎదుర్కోవాలి.
9. ఉద్యమ విజయం. పైన పేర్కొన్నవన్నిటి విషయంలో నాయకత్వం సమర్థవంతంగా చేయటంపైన ఉద్యమ విజయం ఆధారపడి ఉంటుంది. అన్నీ చేసినా ఒక్కోసారి విజయం సమకూరకపోవచ్చు. పరిస్థితుల బట్టి. కాని విజయం కోసం మాత్రం ఈ మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది.
10. పరిపాలన. ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా పాలన సాగించిన నాయకత్వమే, రాష్ర్టా న్ని అవి నెరవేరి రూపుతీసుకునే విధంగా అభివృద్ధి సంక్షేమాల మార్గంలో తీసుకువెళ్లగలదు. ఆ పని జరిగినట్లు లెక్కలేనన్ని రికార్డులు చెప్తూ, ప్రజలు మాట్లాడుకుంటుండగా ఇప్పుడు ‘గ్రోక్’ కూడా అదే అభిప్రాయాన్ని ప్రతిధ్వనిస్తున్నది.
11. పార్టీకి ఇప్పుడొక ఎదురుదెబ్బ తగిలింది. నాయకత్వానికి ఒక పరీక్ష ఎదురవుతున్నది. దానిని ఎదుర్కొనేందుకు తనలో, పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్న ఆత్మవిశ్వాసంతో, ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో, నేర్చుకున్న పాఠాలతో నాయకత్వం సమాయత్తమవుతున్నది. ఒకసారి అది జరిగితే, పార్టీ ఆరంభం నుంచి ఇప్పుడు పునరుజ్జీవన దశ వరకు ఒక వలయం పూర్తయినట్లు. విజయవంతంగా పూర్తయినట్లు. అటువంటి విజయం యావత్తుగా కేసీఆర్ నాయకత్వానిది అవుతుంది. 12.కొత్తతరం నాయకత్వం. ఆ తయారీ భవిష్యత్తుకు సంబంధించినది. ఆ పని ఏ విధంగా జరుగుతున్నదో కనిపిస్తున్నదే.
అనేక విషయాలు, సమస్యలు, లక్ష్యాలు, ఉద్యమాలు, నాయకత్వాలు, విజయాల గురిం చి మనం విన్నాము. కాని, మొదటినుంచి చివరివరకు పైన పేర్కొన్న మొత్తం 12 అంశాలనూ కలగలుపుతూ సాగిన నాయకత్వం ఏదీ దృష్టికి రాదు. ప్రత్యేకంగా గుర్తించవలసింది ఏమంటే, కొన్ని సైద్ధాంతిక పార్టీలు, సమష్టి నాయకత్వాలు, లేదా భారత స్వాతంత్య్రోద్యమంలో వలె దశాబ్దాల పాటు సాగిన యాగంలో ఒక తరం తర్వాత మరొకటిగా వచ్చిన సందర్భాలలో ఈ 12 అంశాలలో కొన్నో, అన్నో కనిపించవచ్చు. కాని కేసీఆర్ విషయంలో, నాయకత్వ స్థాయిలో, ఇది యావత్తూ ఒంటి చేతిపైన జరిగింది. జరుగుతున్నది. ఇదీ ఆయన నాయకత్వం విశ్లేషణ.
– టంకశాల అశోక్