సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారో ప్రముఖ కవి. దీన్ని ఇప్పటి పరిస్థితులకు అన్వయిస్తే సబ్బుబిల్ల.. అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగుతూనే ఉన్నది. ఉత్పత్తిదారులు ప్రతి వస్తువు ధరను అమాంతం పెంచేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం అడ్డుచెప్పడం లేదు. పోనీలే కంపెనీలో కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తున్నారనుకుందాం. అయితే, నిర్మాతలు నష్టపోకూడదని సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతులిచ్చే ప్రభుత్వాలు.. రైతు వద్దకు వచ్చేసరికి సరైన ధర లభించేలా కృషి చేయడం లేదు. అంటే రైతుల కష్టానికి విలువ లేదా?
రైతులు పదేండ్ల కిందటి వరకు ఎడ్ల్లతో దుక్కి దున్ని చదును చేసి పంటలు పండించేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగాయి. యాంత్రీకరణ పుణ్యమాని వ్యవసాయానికి పెట్టుబడి భారంగా మారింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కూలీల కొరత వెంటాడుతున్నది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమే అందుకు కారణం. అయినా మొక్కవోని ధైర్యంతో దేశానికి అన్నం పెట్టడానికి రైతులు పొలాన్ని నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో విత్తు నాటిన నాటినుంచీ పంట చేతికొచ్చేవరకు చేసే కష్టానికి రైతే బాధ్యుడవుతున్నాడు. కానీ, పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు రైతుకు లేదు. దీంతో రైతు బతుకు ఏటా అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతున్నది. ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటిస్తున్నా అది రైతులకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. ఆసియాలో వరంగల్, ఆదిలాబాద్ పత్తికి ఎక్కువ ఆదరణ ఉన్నది. కానీ, మద్దతు ధర లేక రైతులు పస్తులుంటున్నారు.
పత్తి సాగులో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక దేశంలో తెలంగాణదీ అదే స్థానం. రాష్ట్రంలో అత్యధిక రైతులు పండించే పత్తి పంటకు కంటితుడుపు చర్యగా మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వాలు చేతులు దులుపుకొంటున్నాయి. ఏటా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దానికితోడు వాతావరణ, భూమి పరిస్థితులు పత్తి సాగుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు, తెలంగాణలో నూటికి 60 శాతం మంది కౌలురైతులే. దీంతో కౌలు చెల్లింపు అదనపు భారంగా మారుతున్నది. బ్యాంకుల నుంచి వచ్చే అప్పు సరిపోక వడ్డీకి తెచ్చి పంట సాగు చేస్తే చివరకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట నేలపాలవుతోంది. చేతికొచ్చిన కొంత పంటను మార్కెట్లో అమ్మేందుకు కష్టాలే. తేమ, గూడు, రంగు మారిందని సీసీఐ కొర్రీలు పెడుతున్నది. 8 నుంచి 12 శాతంలోపు తేమ ఉండాలన్న నిబంధన, రూ.7,525 మాత్రమే మద్దతు ధర నిర్ణయించడంతో ప్రైవేటు వ్యాపారులకు రూ.6,700- 6,900 ధరకే కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ విధంగా పత్తి రైతు దగా పడుతున్నాడు.
నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ ఏడాది పత్తిపంట ఎక్కువగా సాగైంది. అయితే, పత్తి సాగుకు ఎకరానికి అవుతున్న ఖర్చులను చూస్తే రైతుల దయనీయ స్థితి అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, వడ్డీ రూపంలో వ్యాపారులు రైతుల నడ్డి విరిచేయడం అందుకు ప్రధాన కారణం. పత్తి విత్తనాల ధరపై రూ.50కి పైగా పెంచి వ్యాపారు లు విక్రయించడంతో ఒక్కో ప్యాకెట్‌ను రూ. 760 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చిం ది. అంతేకాదు, రాశి 659 వంటి పత్తి విత్తనాలను వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో 900 వరకు చెల్లించాల్సి వచ్చింది.
పెట్టుబడి కోసం దళారుల వద్ద అప్పు తెస్తే నూటికి 25 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 వేల వరకు వడ్డీలకే పోతున్నది. ఈ లెక్కన ఎకరానికి సుమారుగా రూ.95 వేల వరకు ఖర్చవుతుంది. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడే వస్తుంది. చెలక అయితే 8 క్వింటాళ్లు, నల్లరేగడి భూమి అయితే 10-12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశముంది. అంటే సీసీఐ లెక్క ప్రకారం.. క్వింటాలు రూ.7,525 చొప్పున సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి అనుకుంటే రూ.90,300 వస్తాయి.
పెట్టుబడే సుమారుగా రూ.95 వేలు అవుతుంటే.. ఇక రైతుకు దక్కేదేముంది? ఇక దిగుబడి తగ్గితే ఇంకా అప్పుల్లో కూరుకుపోవాలి. ఇది సీసీఐకి విక్రయిస్తేనే. తేమ ఎక్కువగా ఉందని ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే రూ.6,700 లెక్కన రూ.80,400 మాత్రమే వస్తాయి. అంటే ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టపోవాల్సిందే. ఇక ప్రకృతి సహకరించకపోతే మరింత నష్టం వస్తుంది.
ప్రభుత్వం కనీస మద్దతు ధర అంటూ ఆర్భాటం చేస్తున్నా.. అది రైతుకు దక్కడం లేదు. కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకోగలుగుతున్నారో అలాగే పంట ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు రైతులకు కల్పించాలి. రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి. బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితి పెంచాలి. రైతుభరోసా, రుణమాఫీ అంటూ ఆర్భాటపు ప్రచారాలు కాకుండా రైతులకు ఏది అవసరమో.. పంట అమ్ముకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. నష్టమొస్తే దాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి. రైతుకు చేయాల్సింది సాయం కాదు, ధర నిర్ణయించుకునే నిర్ణయాధికారం ఇవ్వాలి. అప్పుడే రైతు రాజవుతాడు.
ప్రభుత్వం కనీస మద్దతు ధర అంటూ ఆర్భాటం చేస్తున్నా.. అది రైతుకు దక్కడం లేదు. కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకోగలుగుతున్నారో అలాగే పంట ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు రైతులకు కల్పించాలి. రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి. బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితి పెంచాలి. రైతులకు ఏది అవసరమో.. పంట అమ్ముకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి.