హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కాంగ్రెస్ ‘ఒక్క చాన్స్’ ఇస్తే ఏడాదిలో భర్తీ చేసి చూపిస్తామని ఊరించింది. నమ్మించడానికి నోటిఫికేషన్ తేదీలతో నమూనా ‘జాబ్ క్యాలెండర్’ కూడా వెలువరించింది. ముసలి కాంగ్రెస్ నిరుద్యోగుల మీద బోలెడు మొసలి కన్నీరు కార్చింది. ఏకంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ల అడ్డా అయిన అశోక్‌నగర్‌లో తిప్పారు. అధికారం దక్కగానే కాంగ్రెస్ హామీలను మూటగట్టి అటక మీద పెట్టింది. అన్ని వర్గాలను ముంచినట్టుగానే నిరుద్యోగులనూ వంచించింది.
ఉద్యోగాల హామీ ఉత్తమాట అయ్యింది. జాబ్ క్యాలెండర్లో తేదీలు నిరర్థకమయ్యాయి. కాంగ్రెస్ ‘మార్కు’ ధోకాపై నిరుద్యోగులు పోరు బాట పట్టారు. ఆ పార్టీ చెప్పిన ‘ఏడాది కాలం’ ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయింది. రెండేండ్లు దాటినా నేటికీ ఉద్యోగాల జాడ లేదు. గత ఏడాది ఆగస్టులో తూతూమంత్రంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా అమలుకు మాత్రం అతీగతీ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు అశోక్‌నగర్ యుద్ధభూమిగా మారింది. ఉద్యోగాలు వస్తాయని నయా సర్కార్‌పై గంపెడాశలు పెట్టుకున్న నిరుద్యోగులు చివరకు ఓపిక నశించి ప్రభుత్వం పైనే కదం తొక్కుతున్నారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు. రాజధాని నగరంలో, జిల్లాల్లో వేలాది మంది ధర్నాలు, రాస్తారోకోలు చేయడం నిత్యకృత్యమయ్యాయి.
కాంగ్రెస్ ఇప్పటివరకు 60 వేల ఖాళీలు భర్తీ చేసినట్టు బుకాయిస్తున్నది. నిజానికి వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇదివరకటి బీఆర్ఎస్ హయాంలో జారీ చేసినవే. ఉద్యోగ పరీక్షలు కూడా పూర్తయి కేవలం నియామక పత్రాలు అందజేయడమే తరువాయి అన్న తరుణంలో ప్రభుత్వం మారింది. నీళ్ల్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాట నినాదాలు. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే కేసీఆర్ నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏడాది కాలంలోనే 13 నోటిఫికేషన్లు వెలువడటం ఓ రికార్డు. దాంతో ఉద్యోగాల భర్తీ ఉద్యమస్థాయిలో జరిగింది. దాదాపు దశాబ్ద కాలంలో వందకు పైగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సగటున ఏడాదికి సుమారు ఏడెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేస్తూ వచ్చింది.
2015 నుంచి 2022 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయడం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేసిన ఉద్యోగాలు పట్టుమని 24,086 మాత్రమే. అందులో తెలంగాణ పది జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. మనకి దక్కినవి కేవలం 10,080 ఉద్యోగాలే. అదే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అంటే 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అక్షరాల 1,60,083. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం మరోటి లేదు.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదల్లా తాను అధికారంలోకి రాకముందే జారీ అయిన నోటిఫికేషన్లలోని ఖాళీల సంఖ్యను కొద్దికొద్దిగా పెంచడం మినహా నిరుద్యోగులకు ఊరటనిచ్చే ప్రక్రియ ఇసుమంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం 50 3 గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో అదనంగా 60 ఖాళీలను చేర్చింది. డీఎస్సీ ఖాళీలను 5,089 నుంచి 10 వేలకు పెంచగలిగింది తప్ప, ఒరగబెట్టిందేమీ లేదు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు కల్పించడం అయ్యే పని కాదని చేతులెత్తేయడం గమనార్హం. సాక్షాత్తు చావు కబురు చల్లగా చెప్పడంతో నిరుద్యోగులు సర్కారుపై సమరభేరి మోగించారు. నిరుద్యోగులు సర్కారు హామీల అమలును డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు చేపట్టాల్సి రావడం విచారకరం.