నిరంతరం అభద్రతతో మిడికే భీరువు అసహనంతో అందరిపైనా కేకలు వేస్తాడు. అందునా సంస్కారం కొరవడితే అవాకులు, చవాకులతో ఎగిరెగిరి పడుతాడు. సీఎం రేవంత్‌రెడ్డి తీరు అలాగే ఉన్నది. ఈ ధోరణి రోజురోజుకూ శ్రుతిమించుతున్నది. బీభత్స, భయానక పదజాలాలతో ఆయన విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే విస్మయం కలుగకమానదు. ‘బొందపెడ్తా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, లాగుల తొండలు ఇడుస్తా’ ఇవీ ఆయన నోటి నుంచి జాలువారుతున్న ఆణిముత్యాలు. తాజాగా ఆయన ‘బీఆర్ఎస్ నేతలను కోసి రక్తాన్ని పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి’ అనడమైతే ఈ వికృత ధోరణికి పరాకాష్ట అని చెప్పాలి. మరీ ఇంత హింసోన్మాదమా అని ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ‘యథా సీఎం తథా క్రైమ్’ అన్నట్టుగా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగాయి.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే కొయ్యాలె, నరుకాలె అంటూ ఉన్మాద భాష మాట్లాడుతుంటే, దాని నుంచి స్ఫూర్తి పొంది మరోవైపు నేరస్తులు కూడా అడ్డూఅదుపు లేకుండా తెగబడుతున్నారు. రాష్ట్రంలో 2023లో 1,83,644 కేసులు నమోదు కాగా 2024లో 2,17,976కు (18.7 శాతం వృద్ధి) పెరిగాయి. ఇక భయంకర నేరాలైతే 2023లో 10,069 నుంచి 2024లో ఒక్కుమ్మడిగా 27,447కు పెరుగడం (273 శాతం వృద్ధి) రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నది. మరీ ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు పెరుగడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మహిళలపై నేరాల గ్రాఫ్ పైపైకి పోయింది.
ఇటీవల ఓ సీనియర్ మహిళా పోలీసు అధికారి మారువేషంలో సంచరించినప్పుడు ఆకతాయిలు ఆమెను వేధించడం రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉన్నదో కండ్లకు కట్టింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మూడు హత్య కేసుల్లో ఒకటి మహిళపైనే జరుగుతున్నట్టు నమోదవుతున్నది. మహిళల హత్య కేసులు 213 నుంచి 241కు (13 శాతం వృద్ధి), మహిళల కిడ్నాప్‌లు 884 నుంచి 1,122కు ( 26.92 శాతం వృద్ధి), మహిళలపై లైంగిక దాడులు 2,284 నుంచి 2,945కు (28.94 శాతం వృద్ధి) పెరిగాయి. పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రావడం వంటివి శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ నియంత్రణ లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు పెరిగినా శిక్షలు తగ్గడం మరో సమస్య. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గమనిస్తే సీఎం హింసోన్మాద ప్రేలాపనలు నేరస్తులకు ప్రేరణ కలిగిస్తున్నాయా? స్ఫూర్తిగా నిలుస్తున్నాయా? అనే సందేహాలు కలుగక మానవు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమాల్లో కొత్తపుంతలు తొక్కిన తెలంగాణ ఇప్పుడు నేరాల్లో తారస్థాయికి చేరుకుంటున్నది. దేశంలో మొదటి పదిస్థానాల్లో మన రాష్ట్రం ఉండటం దిగ్భ్రమ కలిగిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమాలకు శాంతిభద్రతలే కీలకం. అందుకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చారు. షీ టీమ్స్ ప్రవేశపెట్టి ఆడబిడ్డల రక్షణను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు అదంతా గత చరిత్ర. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలకు ఆలవాలమైన రాష్ట్రం, నేడు దేశంలో నేరాలకు సంబంధించిన ర్యాంకుల్లో అగ్రస్థానానికి ఎగబాకడం దురదృష్టకరం. సీఎం రేవంత్ స్వయంగా హోంశాఖ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఆయన పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతున్నది.