అది 1995వ సంవత్సరం. చంద్రబాబు కుట్రచేసి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసిన రోజులు! అల్లుడి ఘాతుకం మీద అగ్గిమీద గుగ్గిలమైన ఎన్టీఆర్ యుద్ధభేరి మోగించారు. ప్రజలను నమ్ముకున్నవాడు కాబట్టి న్యాయం, అన్యాయం ప్రజలే తేల్చాలని… ప్రజల ముందుకు వెళ్లేందుకు తొలిసభ ఉత్తరాంధ్రలో పెట్టారు. ఆనాడు ఎన్టీఆర్ మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోతున్నారు.
ఆయనకు జరిగిన ద్రోహం మీద మండిపడ్డ ప్రజలు ఆ సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎన్టీఆర్ సింహగర్జనకు ప్రజాగర్జన తోడై సభ యావత్తూ ఉద్వేగంతో ఊగిపోయింది. అయితే మర్నాడు మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఆ వార్త ఎక్కడా కనిపించలేదు.. మహాసముద్రాన్ని తలపించేలా ప్రజలు తరలివచ్చిన ఫొటోలూ కనిపించలేదు. మరోమాటలో చెప్పాలంటే పచ్చలాబీకి హోల్‌సేల్‌గా అమ్ముడుపోయిన పచ్చమీడియా ఎన్టీఆర్ వార్తల మీద అప్రకటిత నిషేధం పెట్టింది.
ఆయన వార్తలు జనంలోకి రాకుండా అడ్డు పడింది. ఆ వార్తలుగానీ.. ఫొటోలు గానీ జనంలోకి వెళ్లి ఉంటే నాదెండ్ల వెన్నుపోటు అనంతరం చెలరేగిన ప్రజల ఆగ్రహాగ్నిలో ఆ ప్రభుత్వం పతనమైన సీను రిపీట్ అయి ఉండేది. కానీ ఆనాడు టోకుగా అమ్ముడుపోయిన పచ్చ మీడియా ఆ వార్తలు ఆపేసింది. రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క ‘ఉదయం దిన పత్రిక’ మాత్రమే ఆ వార్తను, ఫొటోలను, ఎన్టీఆర్ ఆవేదనను, ఆగ్రహాన్ని, తనకు అల్లుడే ఏ విధంగా అన్యాయం చేశాడో ఆయన గద్గదస్వరంలో చెప్పుకున్న తీరును కండ్లకు కట్టినట్టు ప్రచురించింది. అయితే అప్పటికే ఆ పత్రిక సంక్షోభంలో చిక్కుకొని ఉండటంతో ఆ వార్త ప్రజలందరికీ చేర్చేందుకు దాని శక్తి చాలలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ అనేక సభలు పెట్టారు. ప్రెస్మీట్లు పెట్టారు. చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. తనకు జరిగిన అన్యాయం మీద కండ్లనీళ్లు పెట్టుకున్నారు. అయినా అవేవీ పచ్చ పత్రికలు, పచ్చళ్ల పత్రికలు, ఉంపుడు-దంపుడు పత్రికలు ప్రచురించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పచ్చపత్రికలన్నీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. చంద్రబాబు ఒక్క పోటుతో ఎన్టీఆర్‌ను గద్దె దింపితే.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ను నాశనం చేసే క్రమంలో పచ్చ మీడియా అదే ఎన్టీఆర్‌ను వందల కొద్దీ పోట్లు పొడిచింది. ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబును ఫోకస్ చేసేందుకు కలాల్లో ఇంకు ఇంకిపోయేదాక.. కథనాలు వండి వారుస్తూ భుజాలు పడిపోయే దాకా మోశాయి. ఆయనను ఇంద్రుడన్నాయి.. చంద్రుడన్నాయి. ‘ఆసియా లైట్’ అని ఒకడంటే స్ఫురద్రూపి (అర్థం తెలిసేవాడారా?) అని మరొకటి పోటీపడి బిరుదులిచ్చాయి. ఆ రకంగా పచ్చమీడియాగాళ్లు బాబుకు జీవితకాలపు దళారులుగా.. మేకప్మ్యాన్లుగా, ప్రమోటర్లుగా మారిపోయారు.
చరిత్ర పునరావృతమవుతుంది అంటారు. నిజమే! దళారి మీడియా దాన్ని మరోసారి రుజువు చేసింది. 31 ఏండ్ల తర్వాత దొంగలకోసం వార్తలు దాచేసే ఉదంతం మరోసారి పునరావృతమైంది. ఒక కేంద్రమంత్రి కొడుకు చేసిన దురాగతం మీద రాష్ట్రమంతా రచ్చ రచ్చ జరుగుతున్నా.. ప్రజలు ఛీ కొడుతున్నా.. ఎన్నో పరిణామాలు కండ్లముందే జరుగుతున్నా దళారి మీడియా ఒక్క వార్త కూడా వేయలేదు. పచ్చమీడియా
టీవీల్లో చర్చలు పెట్టలేదు.
మైనారిటీ తీరని అమ్మాయి మీద ఘాతుకం జరుగుతున్నా ఈ రొచ్చు మీడియా కిమ్మనలేదు. పైగా బాధితురాలిమీదనే నీలాపనిందలు వేయడానికి తెగించాయి. ‘హానీ ట్రాప్’ అంటూ పట్టపగలు గొంతులు కోసే బాధ్యతను తలకెత్తుకున్నాయి. ఆఖరుకు కోర్టులో స్టే దొరకదని నిర్ధారణ అయ్యాకగానీ మొదటి వార్త రాలేదంటే దాని వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అటు ఎన్టీఆర్ ఉదంతం కానివ్వండి.. ఇటు పోక్సో కేసు కానివ్వండి.. అప్పుడు ఇప్పుడూ ఈ దళారి మీడియా దుష్టత్వాన్నే మోసింది. ద్రోహులనే తలకెత్తుకున్నది. ‘చెట్టు చెడే కాలానికి కుక్క మూతిపిందెలు పుట్టినట్టు’ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పిలిపించుకునే మీడియాలో వ్యాపారలాబీలు చొరబడ్డ పాపానికి పత్రికా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది.
ఎన్టీఆర్ పదవీచ్యుతి ఉదంతం అనంతరం.. తాము ఎవరినైనా అధికారంలోకి తీసుకురాగలం. అవసరమైతే దింపేయగలం అని పచ్చ మీడియా మూకలు రెచ్చిపోయి విర్రవీగాయి. కానీ కాలం అన్నింటినీ మారుస్తుంది. పచ్చమీడియా అహంకారపు నడ్డి విరిచి, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తారు. మీడియాధిపతులు కనుబొమ్మలు ఎగిరేశారు. తెలంగాణ వార్తలకు అంగుళం స్థలం కూడా ఇవ్వలేదు. తొక్కిపారేస్తాం అనుకున్నారు. ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పచ్చమీడియా వేయని ఎత్తుల్లేవు.. తీయని గోతుల్లేవు. కానీ ఈసారి ప్రజలు తిరగబడ్డారు. తెలంగాణ వార్తలు వేయని పత్రికలను తగులబెట్టారు.. బహిష్కరించారు. ఊర్లకు ఊర్లు తెలంగాణ ప్రతిజ్ఞలు చేశాయి. తెలంగాణ ఉద్యమం రోజురోజుకూ బలపడి పచ్చమీడియా వెన్నులో చలి పుట్టింది. తెలంగాణ అనకపోతే దుకాణాలు మూతపడతాయన్న భయంతో మాత్రమే ఆ వార్తలను వేయడం ప్రారంభించాయి. దాంట్లోనూ వంకరబుద్ధులే. ఉద్యమానికి చిన్న విరామం వచ్చినా దాడులు చేశాయి. ఉద్యమం చల్లబడిందని, వేడి తగ్గిందని, జనం విసిగిపోయారని ఎన్నెన్నో విష ప్రచారాలు. అయినా ప్రతిసారీ కేసీఆర్ సభల నిర్వహణతో ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు రీఛార్జీ చేస్తూ వచ్చారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా.. ఉద్యమం గమ్యాన్ని ముద్దాడి స్వరాష్ట్ర పతాకాన్ని రెపరెపలాడించింది. పచ్చ మీడియాకు శృంగభంగం తప్పలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా పచ్చమీడియా బుద్ధి మారదుగదా! వచ్చిన తెలంగాణను విఫలరాష్ట్రంగా చూపాలని చేయని ప్రయత్నం లేదు.. చల్లని బురద లేదు. తెలంగాణ మీద పగబట్టినట్టు పచ్చ బానిస మీడియా తెలంగాణ పురోగమనానికి అడుగడుగునా అడ్డం పడుతూనే వచ్చింది. హైదరాబాద్‌లో ఏపీకి 10 ఏండ్ల హక్కు అంటూ.. గవర్నర్‌కు అధికారాలు అంటూ విష కథనాలు వేస్తూనే వచ్చింది. మెట్రో వెళ్లిపోతున్నదని ప్రచారం చేసింది. పరిశ్రమలు తరలిపోతున్నాయని కథనాలు రాసింది. కరెంటు కోతల మీద, కరెంటు ఉత్పత్తి హక్కుల మీద.. దాడులు చేసింది. ఓ ముసలి పత్రిక అయితే శ్రీశైలం ఎడమ గట్టు, కుడి గట్టు రెండూ ఏపీవేనని కథలల్లింది. ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ మీద.. చాలా తక్కువ ఖర్చుతో ఇంతకైనా మేలైన పథకం చేపట్టవచ్చునంటూ ఊరు పేరులేని సోదిగాడిని శాస్త్రజ్ఞుడనే తోక తగిలించి చెప్పించింది. కాళేశ్వరం మీద రాయి వేయని పచ్చ పత్రిక లేదు.. పచ్చటీవీ లేదు. తెలంగాణ నదుల నీళ్లు మళ్లించుకుంటుంటే నీటి హక్కులు, రైపేరియన్ రైట్స్ అంటూ అడ్డగోలు కథనాలు రాసుకున్నాయి. కండ్లు మూసినా తెరిచినా వాటి కి తెలంగాణ స్వరాష్ట్రం అనే వాస్తవం మింగుడు పడలేదు. ‘వీళ్లేమిటి?, రాష్ట్రం సాధించడమేమిటి?, బాబును కరకట్టలకు తరిమేయడమేమిటి’ అనే ఏడుపు వాళ్లకు నిద్ర రాకుండా చేసింది. దీనికి పరాకాష్ట.. ఓ టీవీ చానెల్ ఏకంగా తెలంగాణ శాసనసభ్యులను ‘పాచికల్లు తాగే ముఖాలు’ అంటూ ఓ వికృత కార్యక్రమం ప్రసారం చేసి తన పచ్చ కావరాన్ని ప్రదర్శించింది. ఇంకో ఉంపుడు పత్రిక ‘తెలంగాణ వాళ్లు కడుపు నిండితే చాలనుకుంటారు. టాక్సులు, బిల్లులు కట్టరు. ఏపీ వాళ్లది ఎంటర్ప్రైజింగ్ నేచర్. సంపదను సృష్టించుకుంటారు’ అని ముష్టి పలుకుల్లో రాసుకుంది. సరే.. ఐదేండ్లు తిరిగే సరికి ఏపీ వాళ్ల ఎంటర్ప్రైజింగ్ ఏపీలో ఏం కట్టలు కట్టిందో.. దేశంలో తెలంగాణ ఎలా తలెత్తుకు తిరిగిందో ప్రపంచానికి వెల్లడైంది. ‘ఆసియా లైట్’ పాలనలో అప్పులతో ఆర్థికంగా ఏపీ లైట్ ఆరిపోయింది. తెలంగాణ దగద్ధగాయమానంగా వెలుగులు విరజిమ్మింది. దేశంలోనే అత్యధిక ధాన్యం పండించి తెలంగాణ సత్తా చాటింది. కాళేశ్వరం, పాలమూరు పూర్తి చేసుకున్నది. ఏపీలో అదే పోలవరం ఓవైపు వేసిన కట్టలు మాటిమాటికీ కొట్టుకుపోతుంటే.. పాపం.. ఇప్పటికీ ఇంకా కిందామీదా పడుతూ కడుతూనే ఉన్నారు. ఈ లోపల ఆ నది నీళ్లు ఓ చెంబెడు, ఈ నది నీళ్లు ఓ చెంబెడు పట్టుకొని తీసుకెళ్లి కృష్ణాలో పోసి అదే నదుల సంగమం అని ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకునే స్థాయిలో ఉంటే, ఏపీ చెంబుల స్థాయిని దాటలేదు. తెలంగాణలో తొలిసారి పుష్కరాలు గోదావరి, కృష్ణానదుల పొడవునా లక్షలాది జనం తరలిరాగా వైభవంగా జరిగితే.. ఏపీలో నిర్వహణ చాతగాక ముప్ఫై మంది హరీమన్నారు.
తెలంగాణకు కరెంటు రాకుండా ఏపీ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడి నాయకులది గొప్ప మనసు కాబట్టి హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు అక్కడి కరెంటు వ్యవస్థే కుప్పగూలిపోతే తెలంగాణ విద్యుత్తు సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి సరఫరాకు మార్గం సుగమం చేశారు. అదంతా పాములకు పాలు పోసినట్టే అయిందని ఆ తర్వాత ఇక్కడ పాతుకుపోయిన పచ్చ మీడియా దాడులతో తేటతెల్లమైంది. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పొడవునా అవి విసిరిన రాళ్లు, పరిచిన ముళ్లూ చెప్పనలవి కాదు.
పొట్ట చేత పట్టుకొని బతకడానికి ఇక్కడికి వచ్చామన్న సోయి మరిచి, ఓ దళారి పత్రిక రైతుల ఆత్మహత్యలకు నంబర్లు వేసి మరీ పండుగ చేసుకున్నది. ఇంకో ముసలి పత్రిక తెలంగాణ మామిడి పండ్లలో విషరసాయనాలు అంటూ కథనం వేసింది. ఇక 2018 ఎన్నికలు వచ్చే సరికి పచ్చలాబీ మొత్తం ఏకమైంది.
కేసీఆర్‌ను గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో చరిత్రలో ఏనాడూ చూడని దాడులు మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్పటి నేత రాహుల్ సిగ్గూఎగ్గూ వదిలేసి తమ శత్రువైన టీడీపీతో చేతులు కలిపి తెలంగాణ మీద దండయాత్రకు దిగారు. అయితే పచ్చలాబీలు, పచ్చ మీడియా ఎన్ని కతలు పడ్డా 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. అప్పుడు ఏపీలో ‘ఆసియా లైట్’ మాడిపోయి.. ఆరిపోయి ఇంటి ముఖం పట్టింది. పసుపు లైటు పటేల్మంది!!
2018 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఈ పచ్చలాబీ తన విష ప్రచారాన్ని భారీగా బహుముఖంగా విస్తరించింది. వందలాది వెబ్సైట్లు, యూట్యూబ్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి కేసీఆర్ టార్గెట్‌గా వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ దశలో యూట్యూబ్‌లో వందకు వందశాతం కేసీఆర్‌కు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక వీడియోలే ఉండేవి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా సోషల్ మీడియాలో వేలకొద్ద్దీ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రతి ఐదునిమిషాలకు ఒకటి చొప్పున కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్లోని ఇతర ప్రముఖ నాయకులు టార్గెట్‌గా పోస్టుల పరంపర కొనసాగించారు. ఈ ప్రచారమంతా దాదాపు సెల్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి చేరింది. ప్రతి గృహిణికి చేరింది. ఒక అబద్ధాన్ని సృష్టించడం.. దాన్ని వివిధ అకౌంట్ల ద్వారా పదే పదే ప్రచారం చేయడం ఇదీ పచ్చ మీడియా వ్యూహం. దీనికి గుజరాతీ మూకల దాడులు తోడయ్యాయి.
ఒక అబద్ధం పదేపదే వివిధ రూపాల్లో ప్రచారం జరగుతుంటే బహుశా నిజమేనేమో అనే భ్రమ ఏర్పడుతుంది. ఇందులో పచ్చమూక సక్సెస్ అయింది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చలామణి అవుతున్న దళారి మీడియాలో కనీవినీ ఎరుగని రీతిలో కసిగా రాక్షస దాడులు మొదలు పెట్టారు.
తెల్లారిలేస్తే రైతుబంధు మీద ఒకడు.. 24గంటల కరెంటు మీద ఇంకొకడు.. ప్రాజెక్టుల మీద మరొకడు.. ఆఖరుకు పండిన పంటల మీద కూడా విష కథనాలు.. వికృత కల్పనలు. ఓ దశలో ‘దొరహంకారం’ అంటూ ఓ దళారి పత్రిక ఒక కులాన్ని సూచించేలా అర్ధసత్యాలతో ఎల్లోగాళ్ల కండకావరం ప్రదర్శించింది. 2023 ఎన్నికల్లో అయితే యుద్ధమంతా పచ్చ మీడియానే నిర్వహించింది. పచ్చలాబీకి చెందిన నాయకులను ప్రోత్సహించి, దగ్గరుండి కాంగ్రెస్‌లో చేర్పించింది. ఏ పార్టీ ఏ వర్గం ఎవరితో కలిస్తే బీఆర్ఎస్ను ఓడించవచ్చో సూచిస్తూ కథనాలు రాసింది. ఒక కొత్త రాష్ట్రం సహజంగా ఎదుర్కొనే బాలారిష్టాలనే భూతద్దంలో చూపి గోరంతలు కొండంతలు చేసింది. ఇంతా చేసి సాధించింది ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి అత్తెసరు మెజారిటీ మాత్రమే! తెలంగాణ సొమ్మును తినమరిగిన దొంగలముఠాను ఇక్కడి ప్రజలు తరిమేసి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకుంటే.. చంద్రబాబు బంటును… పట్టపగలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన మధ్యవర్తిని పచ్చ మీడియాగాళ్లు మోసి మోసి తెలంగాణ అధికారపీఠం మీద కూచోబెట్టి, తెలంగాణ తాళాలు బాబుకు ఇచ్చారు.. ఈ రకంగా బాబు పరోక్ష పాలనకు దళారి మీడియా తెర తీసింది. వాళ్లకు కావల్సిందీ అదే! గేదె ఎవడిదైతేనేం మన దొడ్లో ఈనితే చాలు.. అన్నట్టు!
పచ్చ పత్రికల కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రిక ఇవాళ తెలంగాణలో ప్రభుత్వమై అధికారం చెలాయిస్తున్నది. తోలుబొమ్మలన్నీ తెలంగాణవే. కానీ పాలన మాత్రం పక్కోడిది. దానికి ఉదాహరణలెన్నో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజులకే తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద ఆంధ్రా మూలాలున్న ఓ ఎమ్మెల్యేకు చెందిన గూండామూక వందలాది వాహనాల్లో ర్యాలీగా వెళ్లి దాడులు చేసింది. ఆ ర్యాలీ నిరాఘాటంగా వెళ్లేలా ప్రతి చౌరస్తాలో ట్రాఫిక్ నిలిపారట. అంటే తెలంగాణ నడిగడ్డ మీద, తెలంగాణ ప్రజాప్రతినిధి ఇంటి మీద ఆంధ్రా గూండాల దాడి! ఎవడి అండ చూసుకొని ఈ దాడి? ఎవడి మద్దతుతో జరిగింది ఈ దాడి? ఇది పోరాడి తెచ్చుకున్న తెలంగాణాయేనా? ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? అనే ప్రశ్న ప్రజల్లో మెదిలితే అది వారి తప్పు కాదు.
కేసీఆర్ హయాంలో ఎన్నడైనా ఇలా జరిగిందా? తెలంగాణోడి మీద చెయ్యెత్తినోడున్నాడా? నోరెత్తినోడున్నాడా? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ హయాంలో ఇలాంటి దాడులకే దిగి ఉంటే ఇతర ప్రాంతాల వాళ్లు హైదరాబాద్ నగరంలో ఉండగలిగేవాళ్లా? ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల మదిలో మెదిలిన ప్రశ్నలివి.. ఈ నగరంలో మనమెవరం? అసలీ నగరం ఎవరిది? ఎవడి మీద ఎవడు పెత్తనం చేస్తున్నాడు?!
సరే.. అది రాజకీయం. మరి పరిపాలన పరిస్థితి ఏమిటి? పాలన తెలంగాణ చేతిలోనే ఉన్నదా? రాష్ట్రంలో నీటిపారుదల జలవనరుల సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్ అట. ఎవరాయన? అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రధాన కార్యదర్శి హోదాలో తెలంగాణలో ప్రతి ప్రాజెక్టు మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి అడ్డం పడ్డ వ్యక్తి. ఆయనను తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల సలహాదారుగా తెచ్చి పెట్టిందెవరు? ఎవరి మేలు కోసం? దాని ఫలితం ఏమిటి? గత రెండేండ్లలో నదుల నీటి వినియోగంలో తెలంగాణకు జరిగిందేమిటి? తెలంగాణ నీళ్లు ఏపీ మళ్లించుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వ సలహాదారు ఏం చేస్తున్నాడు? వచ్చే రెండేండ్ల కాలంలో తెలంగాణకు నీటి వాటాలు మిగులుతాయా? ఇక్కడి ప్రాజెక్టులు ఎండబెట్టి ఏపీకి నీళ్లన్నీ తరలిస్తారా? ఇవీ సాగునీటిరంగ నిపుణుల్లో తలెత్తుతున్న అనుమానాలు! అవి నిజమేనని తేలిపోవడానికి పెద్ద సమయం కూడా పట్టలేదు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాలు సమసిపోయాయోచ్ అంటూ ఓ ముష్టిపత్రిక తాజాగా కథనం రాసి సంబురపడింది. కేంద్రం ఏవో షరతులు పెట్టిందట. దానికి ఇరు రాష్ర్టాలు అంగీకరించాయట. ఓ దిక్కుమాలిన కథనం పరిచేసి ఆనంద బాష్పాలు కార్చేసింది. ఇంతకీ ఆ షరతులేంటట? అంగీకారాలు దేనికట? పాలమూరు- రంగారెడ్డికి ఏపీ అంగీకరిస్తుందట. గోదావరి -కావేరి అనుసంధానానికి తెలంగాణ ఒప్పుకుంటుందట. అసలు పాలమూరును అంగీకరించడానికి ఏపీ ఎవరు? దానికి ఏపీ అంగీకారంతో పనేంటి? దానిమీద ఏపీ పెత్తనమేమిటి? ఆ అంగీకారం పేరుచెప్పి గోదావరి నీటిని ఎవడబ్బ సొమ్మని ఎవడు ధారపోస్తాడు? అవి ఎవరి నీళ్లు? ఎవరి హక్కులు ? ఎవరు ఎవరికి ధారపోస్తారు? అలా జరుగుతూ ఉంటే తెలంగాణ చేతులు ముడుచుకొని కూచుంటుందా? రాష్ట్ర రైతులు నోరు మెదపకుండా పడి ఉంటారా? గురువు మీద గౌరవముంటే ఇంటికి పిలిచి ఓ పూట భోజనం పెట్టాలి. అంతేగాని రాష్ట్ర హక్కులను వదిలేయడమేమిటి? హక్కులే లేని చోట ఏపీ వాళ్లు హక్కులు క్లయిమ్ చేయడమేమిటి? వీళ్లు డూడూ బసవన్నల్లా తలాడించడమేమిటి? భవిష్యత్ తరాలకు నీళ్లు లేకుండా చేసే హక్కు ఎవరికీ లేదు.. వాళ్లు ఎంత పెద్ద పదవిలో ఉన్నా! నీళ్లు మళ్లించుకుంటుంటే కండ్లు మూసుకుంటామా? తెలంగాణ ఉద్యమం వంటి మరో ఉద్యమానికి దిగకుండా ఉంటామా? తెలంగాణ ఆత్మలేని ఆంధ్రాబానిస ప్రభుత్వం తెలంగాణ హక్కులను వదులుకుంటుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాలు సమసిపోయాయోచ్ అంటూ ఓ ముష్టిపత్రిక తాజాగా కథనం రాసి సంబురపడింది. కేంద్రం ఏవో షరతులు పెట్టిందట. దానికి ఇరు రాష్ర్టాలు అంగీకరించాయట. ఓ దిక్కుమాలిన కథనం పరిచేసి ఆనంద బాష్పాలు కార్చేసింది. ఇంతకీ ఆ షరతులేంటట? అంగీకారాలు దేనికట? పాలమూరు- రంగారెడ్డికి ఏపీ అంగీకరిస్తుందట. గోదావరి -కావేరి అనుసంధానానికి తెలంగాణ ఒప్పుకుంటుందట. అసలు పాలమూరును అంగీకరించడానికి ఏపీ ఎవరు? దానికి ఏపీ అంగీకారంతో పనేంటి? దానిమీద ఏపీ పెత్తనమేమిటి? ఆ అంగీకారం పేరుచెప్పి గోదావరి నీటిని ఎవడబ్బ సొమ్మని ఎవడు ధారపోస్తాడు? అవి ఎవరి నీళ్లు? ఎవరి హక్కులు ? ఎవరు ఎవరికి ధారపోస్తారు? అలా జరుగుతూ ఉంటే తెలంగాణ చేతులు ముడుచుకొని కూచుంటుందా?
ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పరిపాలన ఎలా సాగుతున్నది? వివిధ విభాగాల సర్క్యులర్లలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తున్నది. సమాచారశాఖ సైట్లలో ఏపీ మ్యాప్ కనిపిస్తున్నది. అంటే రాష్ట్రంలో పరోక్షంగా సమైక్యపాలనే సాగుతున్నదని అర్థం. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదా? అనేది తెలంగాణవాదుల అనుమానం. అయితే ఇలా ఎందుకు జరుగుతున్నది?
ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలక పోస్టులన్నింటిలోనూ ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్‌లు, మాజీ న్యాయమూర్తులు, అధికారులే తిష్ట వేసి ఉన్నారు. రాష్ర్టానికి కీలకమైన విభాగాలన్నింటా ఏపీ నేటివిటీ ఉన్న అధికారులు నేరుగా నియామకాల ద్వారానో, లేదా పదవి పొడిగింపు ద్వారానో కొనసాగుతున్నారు.
తెలంగాణ నీటిపారుదల జలవనరులశాఖ అంశాలను ఇపుడు ఏపీ మాజీ సీఎస్ నిర్ధారిస్తారు. ఆయన కా అంటే కా, కీ అంటే కీ. అంతే! అదే జరగకపోతే పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ అంగీకారం- గోదావరి- కావేరీ అనుసంధానం మీద కేంద్ర స్థాయిలో చర్చల దాక ఆ అంశాలు వెళ్లేవా? అంటే సమాధానం దొరకడం కష్టం. ఒకరకంగా ఇపుడు రాష్ట్ర ప్రభుత్వంలో రహస్యం అంటూ ఏదీ లేనట్టే. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే అది తెలంగాణ మంత్రుల కంటే ముందుగా పక్క రాష్ర్టానికే సమాచారం హాట్లైన్లో వెళ్తుంది. ఏపీ అధికారుల దాడి ఏ స్థాయిలో ఉందంటే సెక్రటేరియట్లో, విద్యుత్తుశాఖలో, నీటి పారుదలశాఖలో.. అన్నింటా ఏపీ అధికారులే బాస్‌లుగా ఉన్నారు. సీఎం ముఖ్యకార్యదర్శి పోస్టునే ఏపీ వ్యక్తికి కట్టబెట్టారు. విద్యుత్తుశాఖలో తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పదవిలో ఏపీకి చెందిన కె.నందకుమార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. టీజీ జెన్కో థర్మల్ డైరెక్టర్‌గా కడప జిల్లాకు చెందిన రాజశేఖర్‌రెడ్డితో నింపారు. హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ కుమారరాజా కూడా ఏపీనే. పీ అండ్ ఎంఎం సీఈ కూడా ఏపీ వ్యక్తే. నీటిపారుదలశాఖలో సెక్రటరీ తర్వాత కీలకమైన పోస్టు అయిన టెక్నికల్ జాయింట్ సెక్రటరీ పోస్టులో ఏపీ అధికారిని నియమించారు. ఈ శాఖలో ఐదుగురు ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇస్తే అందులో ముగ్గురు ఏపీ వాళ్లే. ఈఎన్సీగా ఉన్న ఏపీకి చెందిన రమేశ్‌బాబుకు మరో ఆరునెలలు పొడిగింపు ఇచ్చారు. ఎస్ఈ గా ఉద్యోగవిరమణ చేసిన ఏపీకి చెందిన భీం ప్రసాద్‌ను మంత్రి ఉత్తమ్ ఓఎస్డీగా వేశారు. ఓ అండ్ఎం పోస్టులో ఏపీకి చెందిన మధుసూదన్‌రావును వేశారు. హైదరాబాద్ సీఈ పరిధిలో 106 మంది తెలంగాణ ఇంజినీర్లను ఒకేసారి బదిలీ చేసి ఏపీకి చెందిన వారిని నియమించారు. వీళ్లంతా కలిసి తెలంగాణ తాజా ప్రాజెక్టు పనులను పడుకోబెడుతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సీఈవోగా నెల్లూరుకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. తెలంగాణలోని విలువైన భూముల కేటాయింపులు జరిపే ఈ కీలక పోస్టులో ఏపీకి చెందిన వారిని నియమించడమేమిటనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర జవాబు లేదు.
రాయలసీమకు చెందిన ఆంజనేయరెడ్డికి బుద్ధవనం ప్రాజెక్టు అప్పగించారు. అసెంబ్లీ సలహాదారుగా అయ్యదేవర ప్రసన్నకుమార్, రెడ్కో ఎండీగా నెల్లూరుకు చెందిన వావిల్ల అనిల, ప్రభుత్వ సలహాదారుగా ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ శ్రీనివాస్‌రాజు, ఆస్కీ డైరెక్టర్ జనరల్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, టీజీఎస్పీడీసీఎల్లో ముగ్గురు ఆంధ్రా అధికారులు డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావును, రాష్ట్ర కాలుష్యమండలి అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా ఏపీకి చెందిన సాంబశివరావును, మానవహక్కుల కమిషన్ సభ్యుడిగా ఆంధ్రాకే చెందిన బి.కిశోర్‌ను నియమించారు. ఆఖరికి యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా, శిల్పారామం కల్చరల్ సొసైటీ ప్రత్యేకాధికారిగా కూడాఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ ఎస్.వెంకటరావును ప్రభుత్వం నియమించగా, ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ నియామకాల్లో దళారి మీడియా పైరవీల పాత్రను కొట్టివేయలేం. ఎందుకంటే తెలంగాణ ఒక స్వతంత్ర రాష్ట్రంగా మనుగడ సాగించడం పచ్చమీడియాకు ఏ మాత్రం మింగుడు పడని అంశం. రాష్ట్రం విడిపోయినా సరే.. పాలన మాత్రం ఏపీ చేతిలోనే ఉండాలనుకుంటారు. ఇలా రాష్ట్రంలోని కీలక పదవులన్నింటిలో ఏపీ వారినే నియమించడం వెనుక ఎవరున్నారో.. ఎవరి ఆదేశాలను ఇక్కడి పాలకులు తల దాల్చారో చెప్పడం కష్టమేమీ కాదు. కాకపోతే ఇక్కడ సచివాలయంలో తయారయ్యే ఏ ప్రతిపాదన అయినా ముందుగా పచ్చ మీడియాకే అందుతున్నది. ఎందుకంటే అంతా నీది తెనాలి… నాది తెనాలి వ్యవహారమే కదా!
మీడియాను గౌరవించాలనేది అకడమిక్ అంశం మాత్రమే. దాని తీరుతెన్నులను బట్టి ప్రతిస్పందన ఉండాలనేదే నికార్సయిన వాస్తవం. గంగలో మునిగినా కాకి హంస కొబోదు, గాడిద గంగిగోవూ కాబోదు. పచ్చమీడియా అంతే. అదెప్పుడూ మారదు. దాని ధోరణీ మారబోదు. తెలంగాణ మీద.. తెలంగాణ నాయకత్వం మీద దాడులు చేయకపోతే అది బతకదు. అస్తమానం మేం బురద చల్లుతాం.. మీరు తుడుచుకోవాలి.. అనేదే దాని విధానం. అదీ ఎల్లకాలం సాగదు. దేనికైనా పరిధులు ఉంటాయి. ఆ మధ్య ఇలాంటి బురద చల్లిన ఓ టీవీ చానెల్‌కు గట్టి సమాధానం దొరికింది కూడా. బీఆర్ఎస్ కూడా 26 ఏండ్లుగా ఇక్కడి మీడియా తీరుతెన్నులు ఆమూలాగ్రం పరిశీలించి చూసింది. కాబట్టి రేపు అధికారం చేపడితే మీడియా విషయంలో ఒక స్పష్టమైన విజన్‌తో పాలసీ రూపొందించుకోవడం అవసరం. తెలంగాణ బాగును పచ్చ మీడియా ఓర్చుకోదు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ నాయకులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తే భరించలేదు. దీనికీ ఉదాహరణలున్నాయి. కాబట్టి ఇకనైనా కేవలం తెలంగాణ పత్రికలను మాత్రమే పత్రికలుగా గుర్తించడం. తెలంగాణ సోయి ఉన్న మీడియాను మాత్రమే ప్రోత్సహించడం అవసరం. తెలంగాణ మీద విషం చిమ్మే దళారి దందాగాళ్ల పత్రికలకు జయలలిత హయాంలో మాదిరిగా లక్ష్మణరేఖలు గీయడం అంతకన్నా అవసరం. ఈ విషయంలో బీఆర్ఎస్ 3.O భిన్నంగా ఉండాలన్నదే తెలంగాణవాదులందరి కోరిక!!
– సవాల్ రెడ్డి