నేపాల్‌లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షం అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఈ దేశంలో నేపాల్ తరహా విప్లవం ఎప్పటికీ రాదు. నేపాల్ అనేది మన దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఒక రాష్ట్రం లాంటిది. ఒక రాష్ట్రంలో నేపాల్‌ను మించిన విధ్వంసం జరగవచ్చు.. కానీ ఇది సువిశాల భారతదేశం. ఇక్కడ ఏదో ఒక రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినంత మాత్రాన దేశంలో నేపాల్ లాంటి విప్లవం వస్తుందని కలలు కంటే దేశం గురించి అవగాహన లేనట్టే. ఒకవైపు నేపాల్ తరహా విప్లవం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే మావోయిస్టుల నుంచి ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.
రెండుమూడు దశాబ్దాల క్రితం జర్నలిస్టులు నక్సల్ నాయకుడిని ఇంటర్వ్యూ చేసి వస్తే ఆJournalistకు హీరో ఇమేజ్ వచ్చేది. నక్సల్ నాయకుడి ఇంటర్వ్యూ మీడియాలో హైలైట్ అయ్యేది. అలాంటిది మావోయిజానికి ఆయుధం ఊపిరి లాంటిది. అలాంటి ఊపిరినే వదిలేస్తాం అని మావోయిస్టులు ప్రకటిస్తే మీడియాలో పెద్దచర్చలు లేవు. ఒకరోజు మామూలు వార్త తప్ప అంతకుమించి ప్రచారం లేదు. ఒకవేళ ఈ ప్రకటన మావోయిస్టుల పేరుతో ఎవరో విడుదల చేసిన తప్పుడు ప్రకటనా? అనే అనుమానం రావడం సహజం. అలా తప్పుడు ప్రకటన అయి ఉంటే అదేరోజు లేదా మరుసటి రోజు ‘ఆ ప్రకటన మేం విడుదల చేయలేదు, తప్పుడు ప్రకటన’ అని మావోయిస్టులు ఖండన విడుదల చేసేవారు.
సెప్టెంబర్ 17న ప్రకటన విడుదలైతే ఐదురోజులు గడిచినా వారి నుంచి ఖండన ప్రకటన రాలేదు. కాబట్టి అది మావోయిస్టుల ప్రకటన అనే నిర్ధారణకు రావచ్చు. ఆయుధ పోరాటాన్ని నిలిపివేసి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లేదా వారి ప్రతినిధులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రకటనకు ముందే అమిత్ షా గతంలో దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉంటే ఇప్పుడు ఆరుకు పడిపోయాయని, 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించనున్నట్టు ప్రకటించారు. నక్సలిజం సంపూర్ణ నిర్మూలనకు కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుండటం తో కొంత ఊపిరి పీల్చుకొనే అవకాశం కోసం మావోయిస్టులు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధం అవుతున్నట్టు భావించవచ్చు.
అయితే ‘పూర్తిగా నిర్మూలించే అవకాశం చేతిలో ఉన్నప్పుడు చర్చలు ఎందుకు? సమస్యను శాశ్వతంగా లేకుండా చేసుకోవాలి’ అనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు. అందుకే స్పందించడం లేదేమో. నేపాల్‌లో కూలిపోయిన ప్రభుత్వం అంతకుముందు తీవ్రవాదాన్ని నమ్ముకొన్న నక్సలైట్లదే. ఓ రెండు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ నేపాల్ కారిడార్, శ్రీలంక కారిడార్ అంటూ నక్సల్స్‌కు సంబంధించిన వార్తలు తెలుగు మీడియాలో సైతం తెగ కనిపించేవి. ఆంధ్రప్రదేశ్ – నేపాల్ మావోయిస్టుల మధ్య బంధం ఎంత బలంగా ఉండేదో కానీ తెలుగు మీడియాలో మాత్రం వీరి బంధంపై కథలుకథలుగా వార్తలు కనిపించేవి. నక్సల్స్ చేతికి అధికారం వస్తే ఎలా పాలిస్తారో నేపాల్ పాలకులు బాగా అర్థం అయ్యేట్టు చూపించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా ప్రజలకు తమ ఓటు ద్వారా పాలకులను శిక్షించే అవకాశం ఉంటుంది. మార్చే అవకాశం ఉంటుంది. ప్రజల అభిమానం పొంది అధికారంలోకి రావడం వేరు, ఆయుధం చేపట్టి భయపెట్టి అధికారం చెలాయించడం వేరు. నేపాల్‌లో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోవడం, అదే సమయంలో పాలకుల పిల్లల విచ్చలవిడి జీవన విధానం నేపాల్ నవతరాన్ని విప్లవానికి ప్రేరేపించింది. మన దేశంలో అవినీతి లేదా? నాయకులు, వారి పిల్లలు విలాసవంతమైన జీవితం గడపటం నిజం కాదా? అంటే నేపాల్‌ను మించిన అవినీతి ఉండవచ్చు, నాయకులు, అధికారులు, వారి సంతానం అంతకుమించి అక్రమ సంపాదనతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండవచ్చు. అయినా ఇక్కడ విప్లవం రాదు. దేశంలోని మెజారిటీ ప్రజలు సంస్కరణలను స్వాగతిస్తారు.
ఈ దేశం జీన్స్‌లోనే మార్పునకు, సంస్కరణలకు స్వాగతం పలికే తత్త్వం ఉంది.మార్పునకు స్వాగతం పలికే తత్వం, సంస్కరణలను స్వీకరించే తత్వం ఉన్న చోట విప్లవానికి అవకాశం లేదు. అత్యవసర పరిస్థితిని దేశమంతా వ్యతిరేకించి, శక్తివంతమైన నాయకురాలు ఇందిరాగాంధీని సైతం ఓడించారు. రెండేండ్లు గడిచిన తర్వాత అదే ఇందిరాగాంధీని అందల మెక్కించారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక తరహాలో పాలకులను హత్య చేయడం, ఉరి తీయడం, పార్లమెంట్ భవనాన్ని తగులబెట్టడం ఇక్కడ ఊహించలేం. లోపాలుంటే ఉండవచ్చు, నిరక్షరాస్యత ఉండవచ్చు. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో కొంత పరిణతి చెందింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు అంటే మనకు దేవాలయాలంత పవిత్రమైనవి.
మరోవైపు ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోని యువతలో ఎక్కువగా కెరీర్ పట్ల ఆసక్తితో పెరిగింది. తెలంగాణలో ఒకప్పుడు తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆర్థ్ధిక సంస్కరణల తరువాత పూర్తిగా మారింది. గతంలో తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా తీవ్రవాదుల ప్రభావం కనిపించేది. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్న యువత గురించి వింటున్నాం.
అంతేకాకుండా మన దేశంలోని ఒక రాష్ట్రం అంత ఉండే నేపాల్‌లో విప్లవం పేరుతో అరాచకం సాధ్యమైంది. కానీ, సువిశాల భారతదేశంలో సాధ్యం కాదు. మణిపూర్, పంజాబ్, కాశ్మీర్ వంటి రాష్ర్టాల్లో కొన్ని అరాచక సంఘటనలు జరగకపోలేదు. ఇలాంటి సంఘటనలు ఆ ఒక్క రాష్ట్రమే కాదు మొత్తం దేశం తన శక్తిని ఉపయోగించి అణచివేస్తుంది. అందువల్ల నేపాల్ విప్లవ ప్రభావం మీడియా వార్తల్లో తప్ప ప్రజల్లో పెద్దగా ఉండదు. ఇప్పుడు యువత అడవుల గురించి కాదు కెరీర్ గురించి ఆలోచిస్తోంది.
– బుద్ద మురళి