Kodangal | ప్రతీక్ జైన్.. మా వికారాబాద్ జిల్లా కలెక్టర్. మంచి మనసున్న ఆఫీసర్. నియోజకవర్గ సమస్యల మీద ఆయనను కలిసిన నాయకుల అనుభవంలో కలెక్టర్ గారు చాలా డౌన్ టు ఎర్త్ మనిషి! తాము లేవనెత్తిన సమస్యల గురించి సావధానంగా వినడం, పరిష్కారం కోసం ప్రయత్నించడం గురించి తాండూరులో మంచిగా చెప్తుంటరు.
కేసీఆర్ హయాంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రతీక్ జైన్ అందించిన సేవలను అక్కడి గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. పాలకుడు దార్శనికుడు, సహృదయుడు అయితే అధికారులతో గొప్ప పనులు చేయించవచ్చు. భావోద్వేగియే కానీ, అవినీతి, అక్రమాల మరకలంటని ఎన్టీఆర్ హయాంలోని ఆఫీసర్లు యూబీ రాఘవేంద్రరావు, శ్రవణ్ కుమార్ (వీద్దరూ సీఎస్‌లు) సహా ఆ తర్వాతి కాలంలో మోహన్ కందా, మొహంతి, కాకి మాధవరావు వంటి ఎందరో అధికారులు పాలనకు వన్నె తెచ్చారు. ఆరోపణలకు ఎదురొడ్డి నిలిచి సోమేశ్‌కుమార్, రామకృష్ణారావు లాంటి కార్యనిర్వాహకులు శాసన వ్యవస్థకు దన్నుగా నిలబడ్డారు.
ఏ విలువలూ లేని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ తప్పిదాలకు మంచి ఆఫీసర్లు బలవుతున్నరు. ‘నాపై జరిగింది దాడిగా చూడవద్దు’ అని కలెక్టర్ ప్రతీక్ అన్నారంటే ఆయన మనసు ఎంత తడి ఉండాలి? ఇప్పుడు ఆయనపై కూడా రైతు వ్యతిరేకి ముద్ర వేయించింది కాంగ్రెస్ సర్కారు. వాస్తవానికి, రైతులు దాడి చేసింది ముఖ్యమంత్రిపై. ఆయన సీన్లో లేడు కాబట్టి, అధికారి వెంకటరెడ్డిపై దాడి చేశారు కడుపు మండి. కలెక్టర్‌ను కారు ఎక్కించి క్షేమంగా తిరిగి పంపించారు.
రగచర్ల ఘటన తర్వాత సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి మాట్లాడిన మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఎవరు అడ్డు వచ్చినా పరిశ్రమలు ఆగవు’ అంటున్నరాయన. ఒక పదవి, ఒక ప్రోటోకాల్ లేని తిరుపతిరెడ్డి అట్లా మాట్లాడుతున్నా.. అవి వింటూ పోలీసులు, మీడియా, మేధావులూ మౌనంగా ఉన్నారు. వారి మౌనాన్ని చూసి పేద ప్రజలు భయపడరా? బిక్కుబిక్కుమనరా? ఆ మధ్య వారి సోదరుల దాష్టీకం గురించి రేవంత్‌కు చెబుదామని పోయిన ఒక కాంగ్రెస్ నాయకునితో.. ‘ఈ రాష్ర్టానికి నలుగురు ముఖ్యమంత్రులమయ్యా. చల్..’ అంటూ అంటూ ఇక్కడ రాయలేని మాటలు అన్నరట. ఆ నాయకుని వలపోత ఇది. ఇది ‘hearsay’ కావచ్చు గానీ, ‘ప్రభుత్వ ఉద్యోగులు మన పక్షాన ఉన్నర’ని పొన్నం ప్రభాకర్ అంటే.. అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ స్పందించడం మనమంతా చూశాం, విన్నాం కదా!
సీఎం, ఆయన సోదరుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వారికి జంకి అధికారులు కూడా మౌనముద్ర వహిస్తున్నారు. అధికారులపైకి పేపర్లు విసిరిన రాజగోపాల్‌రెడ్డి, సీఐ సీటులో కూర్చొని రుబాబ్ చూపిన సురేఖ లాంటి ఉదాహరణలు చదువరులకు ఎన్నో తడతాయి.
మొన్న ఒక అంశంపై అన్యాయపు అభియోగాలు ఎదుర్కొంటున్న కేటీఆర్ అప్పటి తమ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రభుత్వం చెప్పిందే చేశారు తప్ప, ఆయన తప్పేమీ లేదని చెప్పడం నాయకుల ఉదాత్తతకు నిదర్శనం. కేసీఆర్ వారసత్వం ఉన్న కేటీఆర్ మాత్రమే కాదు; కేసీఆర్ తాత్విక చింతన తెలిసిన, ఒంటబట్టించుకున్న ఆయ న సహచరులు, అనుచరులు ఎవ్వరూ అధికార, ప్రతిపక్ష బాధ్యతల్లో లక్ష్మణ రేఖ దాటి ఎరుగరు. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా సీఎం కుటుంబం, క్యాబినెట్ ఇష్టం వచ్చినట్టు కూస్తున్నరు. బీటలు వారుతున్న వారి పాలనాసౌధానికి రిపేర్లు సాధ్యం కావు. బీఆర్ఎస్ నాయకులో, కార్యకర్తలో చెబితే అధికారులపై దాడులు చేసేంతగా ప్రజలు రోసిపోయి ఉంటే… రాబోయే ఎన్నికల్లో 119 సీట్ల గెలుపు బీఆర్ఎస్కు నల్లేరు మీద నడకే!
సర్వ భ్రష్టతనొందిన కాంగ్రెస్ సర్కార్‌ను కొడంగల్ ఉరికించి కొట్టింది. ఇంట ఓడిన ఓ రచ్చ రాజా.. బయటా పరాభవాలకు సిద్ధపడు!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల 90309 97371