పరిపాలన ప్రజల సంక్షేమం కోసం సాగాలి. అభివృద్ధి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అంతేతప్ప ఎవరి మీదో అక్కసుతో నకారాత్మక వికారాలు పోతే అంతిమంగా బెడిసికొడుతుంది. కేసీఆర్ వెంట తెలంగాణ నడిచింది. స్వరాష్ట్రం సాధించుకున్నది. తొలి రెండు విడతలు రాష్ట్ర పగ్గాలు కేసీఆర్‌కే అప్పగించింది. ప్రగతి, సంక్షేమాల్లో అద్వితీయమైన ముందంజ సాధించింది. ఈ రెండు అంశాలు చరిత్ర నమోదు చేసిన ప్రత్యక్షర సత్యాలు. కాదన్న మాదన్నలు ఎంతగా బురద చల్లాలని, బట్టకాల్చి మీదేయాలని చూసినా పప్పులుడకవు.
కేసీఆర్ పాలనకు కాళేశ్వరం ప్రాజెక్టు జలకేతనం లాంటిది. నీటి గోసతో తపించిన నేలను జలభాండంగా మార్చిన భగీరథ తపస్సు ఫలితంగా కాళేశ్వరం అనే బృహత్తరమైన ఎత్తిపోతల సమాహారం సాకారమైంది. అది తెలంగాణ జలభద్రతకు కేసీఆర్ అందించిన భరోసా. ఆ కీర్తిని, ఆ స్ఫూర్తిని మసకబారేలా చేయాలని కాంగ్రెస్ పాలకులు పన్నుతున్న పన్నాగాలు ఇన్నీఅన్నీ కావు. నక్కలు బొక్కలు వెతుకును అన్నట్టుగా రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తలాతోకా లేని వాదనలు వండివార్చారు.
ఒక అబద్ధాన్ని పదేపదే వల్లిస్తే నిజం కాదు గానీ, ప్రజలు నమ్మస్తారేమోననే వెర్రిమొర్రి ఆశలతో వెంపర్లాడుతున్నారు. కానీ, దేశ సర్వోన్నత న్యాయస్థానం పెద్దల మాటలతో కాంగ్రెస్ ఆరోపణలు పటాపంచలైపోయాయి. లేని అవినీతిని తవ్వి తీసేందుకు వారు కమిషన్ల పేరిట వేస్తున్న ఎత్తులు దూదిపింజల్లా తేలిపోయాయి. ‘కాళేశ్వరం అద్భుతం.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకం..’ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ అన్న ఈ రెండు మాటలు చాలు విషం కక్కుతున్న నోళ్లు మూయించడానికి. ఇది రాజకీయ రచ్చ కాదు, నిజం నిగ్గు తేల్చే ధర్మపీఠం మాట. జనహితం కోసం జరిగిన జల తపస్సుతో తెలంగాణ సుక్షేత్రమైంది.
అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం తగదని అంటూ న్యాయమూర్తి అక్షింతలు వేయడం గమనార్హం. పాలమూరుపై సీబీఐ దర్యాప్తు అవసరమే లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడం విశేషం. అసలు ఇలాంటి పిటిషన్లు విచారించాల్సిన అవసరమే లేదన్నారు మరో న్యాయమూర్తి నాగరత్న. హైకోర్టు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇదివరకే అవినీతి ఆరోపణల్లో పసలేదని నిగ్గుతేల్చాయి. దానినే సుప్రీంకోర్టు సమర్థించింది.
కాళేశ్వర కీర్తి కేసీఆర్‌కు దక్కి తీరుతుంది. కనుక ఆ ప్రాజెక్టును పండబెడదాం. పచ్చబారిన తెలంగాణను ఎండబెడుదాం. ఇదీ కాంగ్రెస్ ధోరణిగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆధునిక దేవాలయాలను భ్రష్టుపట్టించే ఎత్తుగడలు గతంలో కనిపించేవి కావు. ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకన్నా ముందరి ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని చూశారు తప్ప పడావు పెట్టలేదు. రాజకీయ మరుగుజ్జులు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఇదే అసలు సిసలు విధానమవుతున్నది.
తట్టెడు మట్టి తీయని, జిట్టెడు గోడపెట్టని కాంగ్రెస్ సర్కార్ రెండు పిల్లర్లు కుంగాయని మొత్తంగా జలప్రదాయినినే బలిచేస్తున్నది. ప్రతీకారేచ్ఛతో ప్రజా ప్రయోజనాలను నాశనం చేయాలని చూస్తున్నది. తెలంగాణ తల్లి మెడలో కేసీఆర్ వేసిన జలహారాన్ని తెంపి ముక్కలు చేసేందుకు దుర్మార్గంగా తెగిస్తున్నది. మరమ్మతులు చేయకుండా దర్యాప్తుల పేరిట కాలహరణం చేయడం తెలంగాణ జల ప్రయోజనాలను తెగనమ్మడమే. ఇది ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ఇప్పటికే పుణ్యకాలం చాలానే గడిచిపోయింది.
కాంగ్రెస్ లక్ష్యం కాళేశ్వరాన్ని ఎండబెట్టడం మాత్రమే కాదు, తెలంగాణకు గోదారి జలాలను ఎప్పటికీ అందకుండా చేయాలనే కుట్ర దీనివెనుక పొడసూపుతున్నది. కాళేశ్వరం పోతే మళ్లీ గోదారి జలాలను ఒడిసిపట్టే రోజు ఎప్పుడో ఎవరికీ తెలియదు. కమిషన్లతో పబ్బం గడుపుకొనే కాలక్షేపపు పాలనలో ప్రాజెక్టులు వస్తాయని గానీ, జలాలు ప్రవహిస్తాయని గానీ ఎవరూ అనుకోవడం లేదు. ఇప్పుడే యథేచ్ఛగా గోదారి జలాలు పక్క రాష్ర్టానికి నిరాఘాటంగా తరలిపోతున్నాయి.
ఇంకా అటునుంచి నదుల అనుసంధానం పేరిట కావేరి బేసిన్‌కు తరలించుకుపోవాలనే కేంద్ర పాలకుల ఎత్తుగడలకూ రాష్ట్ర సర్కారు అడ్డుకట్టలు వేస్తున్న దాఖలాలు లేవు. పొరుగు పాలకుల అంతేవాసి, కేంద్రంలోని బడేభాయ్కి చోటేభాయ్నని చెప్పుకొనే రేవంత్ పాలనలో గోదారి సంతర్పణ దిగ్విజయంగా పూర్తయ్యే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తున్నది. తెలంగాణ సోయిలేని పాలకులు ఎంతకైనా తెగిస్తారు. తస్మాత్ జాగ్రత్త!