ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్నది. కొందరు న్యాయమూర్తు ల ప్రవర్తన, తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం కారణంగా అనుకోకుండా బయటపడిన సగం కాలిన నోట్ల కట్టల ఉదంతంతో దేశం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు న్యాయవ్యవస్థపై వివాదాలెన్నో వచ్చాయనేది కాదనలేం. కానీ, ఇది అలాంటిది కాదు. డబ్బుతో ముడిపడిన అంశం కావడమే అందుకు కారణం. ఈ ఘటనపై నిజానికి మొత్తంగా న్యాయవ్యవస్థే ప్రకంపనలకు గురైనట్టు కనిపిస్తున్నది. ప్రథమ స్పందనల్లో వ్యక్తమైన గందరగోళం, తత్తరపాటు అలాంటి అభిప్రాయం కలగడానికి కారణమని చెప్పవచ్చు.
ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామక ప్రక్రియ, తొలగింపు పద్ధతులు సంక్లిష్టంగానూ, గోప్యంగానూ ఉంటాయనేది తెలిసిందే. వీటిని పర్యవేక్షించే కొలీజియం ఉన్నపళంగా జస్టిస్ వర్మను అలహాబాద్‌కు బదిలీచేసింది. నిజానికి బదిలీ అనేది జరిగినదానికి ఒక పరిష్కారంగా ప్రజలు చూడటం లేదు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది న్యాయమూర్తి అధికార నివాసానికి ఎలా చేరింది? అనేది తేల్చుకునేందుకు సుప్రీంకోర్టు ఒక దర్యాప్తు సంఘాన్ని వేసింది.
తర్వాత ఒకవేళ అవినీతి జరిగినట్టు తేలితే ఏం చేయాలనేది ప్రశ్న. ఎం దుకంటే ఒక హైకోర్టు జడ్జీని తొలగించాలంటే అది రాష్ట్రపతి ద్వారానే జరగాలి. అది కూడా ఉభయ సభల్లో తీర్మానం జరిగిన తర్వాతనే. ఆ సంగతి అలా ఉంచితే జస్టిస్ వర్మ ఆ డబ్బుతో తనకు సంబంధం లేద ని ఖండిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండానే తనను దోషిగా మీడియా తేలుస్తున్నదని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ సం గతి తేల్చుకునేందుకే సుప్రీం నియమించిన మూడు రాష్ర్టాలకు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల దర్యాప్తు కమిటీ జస్టి స్ వర్మ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించింది. ఘటనల క్రమా న్ని బట్టి ఇదొక అసాధారణమైన కేసు అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పవచ్చు.
సహజంగానే న్యాయమూర్తి ఇంటి నోట్ల కట్టల వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. జాతీయ రాజకీయపక్షాలు ఎవరికి వారు తమదైన దృష్టికోణంలో నుంచి ఈ వ్యవహారాన్ని చూస్తున్నాయి. ముందుగా బీజేపీ గురించి ఆలోచిద్దాం. ఆ పార్టీ నిగూఢంగా ఉండే కొలీజియం వ్యవస్థను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నదన్నది తెలిసిన సంగతే. న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్రం చేతుల్లో పెట్టే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం (ఎన్‌జేఏసీ)ని తెచ్చింది అందుకే. దానిని సుప్రీంకోర్టు కొట్టేయడంతో అది అమలులోకి రాకుండానే కాలగర్భంలో కలిసింది.
ఇప్పుడు మరోసారి కొలీజియంపై దాడికి పాలక పక్షం ప్రస్తుత ఉదంతాన్ని వాడుకోవాలని చూస్తున్నది. ఆ పార్టీ నేతలు కొలీజియం గోప్యతను దుయ్యబడుతూ చేస్తున్న ప్రకటనలే అందుకు తార్కాణం. జరిగినదానికి బాధ్యతను కేంద్రంపైకి, బీజేపీ నాయకత్వంపైకి తోసేయాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తున్నది. ఏదేమైనప్పటికీ దేశానికి న్యాయం చెప్పే న్యాయవ్యవస్థ ఇప్పుడు ఆత్మపరిశీలన జరుపుకోవాల్సిన సందర్భం ఎదురైంది. ప్రజల సందేహాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశ చరిత్రలోనే సంచలనాత్మకమైనదిగా మిగిలిపోయే ఈ కేసులో ఎలా వ్యవహరిస్తుంది? ఇటీవలే కళ్లకు గంతలు తొలగిపోయిన న్యాయదేవత ఈ ‘అగ్నిపరీక్ష’లోంచి ఎలా బయటపడుతుంది?అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.