‘సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని
అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం
రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది
ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది
అనే ప్రగాఢ విశ్వాసంతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ప్రయాణం ఎన్నో మలుపుల మధ్య సాగింది. తెలంగాణ అన్న పదమే వినపడకూడదని నిరంకుశ రాజ్యం నడుస్తున్న నిశీధిలో ఒక కాగడా వెలుగులా ప్రజాస్వామిక, పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ ఒక కొత్త చరితను లిఖించింది.
తెలంగాణలో అప్పటిదాకా ఆట, పాట, మాటలన్నీ బంద్ అయినయ్. అలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తికి, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు, తెలంగాణ సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ ఒక వేదికగా మారింది. అప్పటికే ప్రజా ఉద్యమాల్లో ఉండి నిర్భంధానికి, అణచివేతకు గురవుతున్న యువతరానికి బీఆర్ఎస్ ఆసరాగా మారింది. అంతేకాదు, బీఆర్ఎస్ ఒక కొత్త రాజకీయ తరాన్ని సృష్టించింది. తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి నేటి వరకు వేలాది మంది నాయకులను తయారు చేసి, పాలనలో భాగస్వామ్యం కల్పించారు కేసీఆర్. అటెండర్‌గా ప్రస్థానం ప్రారంభించిన స్వామిగౌడ్, సింగరేణి కార్మికుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్, రైతు కుటుంబానికి చెందిన పద్మా దేవేందర్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి వంటివారు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టడం బీఆర్ఎస్లోనే సాధ్యమైంది.
జర్నలిస్ట్‌గా ఉన్న రామలింగారెడ్డి, విద్యార్థి నేతలు బాల్క సుమన్, గాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటివారు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. ఉద్యమ సమయంలోనైనా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలే కేంద్రంగా పనిచేయాలనే గొప్ప ప్రజాస్వామిక విలువలను కేసీఆర్ వారిలో పెంపొందించారు. రాజకీయాలంటే పదవులే కాదని, ప్రజల ఆకాంక్షల ముందు పదవులన్నీ తృణప్రాయమేనని అనేక ఉప ఎన్నికల్లో కేసీఆర్ నిరూపించారు. బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ.. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావించిన ప్రజలు ఆ పార్టీని ప్రతీ సందర్భంలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నా, తెలంగాణలో మళ్లీ స్వర్ణయుగం రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యం.
– మాదాసు శ్రీనివాస్