కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతున్నది. ఆశ, అంగన్వాడీ, సమ గ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్ఎస్ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యో గులున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవిత బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు తదితర సౌకర్యాలు వీరికి వర్తించవు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వాలు వాటిని అమలుచేసే ఉద్యోగులను గాలికి వదిలేయడం విడ్డూరం. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా ఉండాల్సిన ప్రభుత్వాలే దశాబ్దాలుగా వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి.
ఈ పథకం కింద రెండు దశాబ్దాలుగా మన రాష్ట్రంలో సుమారు 19,350 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు, బీమా సౌకర్యం రిటైర్మెంట్ ఫలాలు లేక ఆధునిక బానిసత్వాన్ని, వెట్టిచాకిరి అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా అవి అమలు కావడం లేదు. సీఎం స్వయంగా హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా నెరవేరలేదు. దీంతో వారు పలు నిరసనలు చేపట్టి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు.
రెగ్యులరైజ్ చేయాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే. ఎందుకం టే వారు ప్రభుత్వం ద్వారానే జీతాలు పొందుతున్నారు. 21 రోజులు గా సమ్మె చేస్తున్నావారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం. కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని హైకోర్టు చెప్పిందని కొందరు మాట్లాడుతున్నారు. హైకోర్టు తీర్పు కాంట్రాక్టు జేఎల్ రెగ్యులరైజేషన్ విషయానికే వర్తిస్తుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాత పరీక్ష, రోస్టర్ కమ్ మెరిట్ ద్వారా నియామకమయ్యారు. సాంకేతికంగా హైకోర్టు తీర్పు సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణకు అడ్డు కాకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం వారి డిమాండ్లలోని న్యాయాన్ని గుర్తెరగాలి. పేద, అనాథ, సింగిల్ పేరెంట్ పిల్లలు గత 21 రోజులుగా విద్య కు దూరమై ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలకు పోతూ, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకోకపోడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.