అరచేతిలో స్వర్గం హామీలతో సర్కారు మారి రైతన్న తలరాతే మారిపోయింది. నీళ్లిచ్చి, నిధులిచ్చి అన్నిరకాలుగా ఆదుకొన్న కేసీఆర్ సర్కార్ పోయి మాయమాటల కాంగ్రెస్ సర్కారు రాకతో సాగు సడుగులు ఇరుగుతున్నయి. పెట్టుబడికి గోస, విత్తనాలకు గోస, చివరకు నానా కష్టాలు పడి సాగుచేద్దామంటే ఎరువు కరువు ఆగమాగం చేస్తున్నది. ఎరువుల దుకాణాలు ‘కల్లోలిత ప్రాంతాల’వుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా రైతులు గుమిగూడటం, చెప్పులు, ఆధార్‌కార్డులు, పాస్ పుస్తకాలను లైన్లలో పెట్టడం షరా మామూలైపోయింది.
ఓపిక నశించి, దుకాణాలపై రైతులు రాళ్లు వేస్తే, దాడులు జరిపితే పోలీసులు రంగంలోకి దిగి ప్రతాపం చూపిస్తున్నారు. రైతురక్తంతో యూరియా తడుస్తున్న దుర్భర దృశ్యం అదుపు తప్పుతున్న పరిస్థితికి సంకేతం. భూమితో యుద్ధం చేసే రైతు యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావడం విషాదం. ‘ఒక్క యూరియా బస్తా’ కోసం అంటూ తెలంగాణ జానపదం ఈ విషాదంపై కైగట్టి, గొంతెత్తి బోరున విలపిస్తున్నది.
ఇదేం అనుకోని సమస్య కాదు. సీజన్‌కు ముందే ఎరువు సంగతి ఆలోచించాల్సిన సర్కారు పెద్దలు దైవాధీనంగా వ్యవహరించడం ఇవాళ రైతన్నకు శాపమై కూర్చుంది. బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల సౌకర్యం పెరిగి తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైంది. ఈసారి వర్షాలు కూడా దండిగా కురిశాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచి దండిగా నీరు విడుదల అవుతున్నది. ఈ ఉత్సాహంతో రైతులు పంటలు వేసుకున్నారు. ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగుచేశారు. సహజంగానే వాటికి యూరియా ఎక్కువగా అవసరమవుతుంది. కానీ, సర్కారు సకాలంలో మేల్కొనకపోవడం వల్ల ఎరువుల సరఫరాలో పీటముడి పడింది.
ఏడాది వానాకాలం సీజన్‌కు 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా కేంద్రం అందులో కొంత కోతపెట్టి 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మంజూరు చేసింది. అందులో ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్క ఆగస్టు నెలకే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా అందులో సగం, అంటే కేవలం 1.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. ఎరువుల కొరత వల్ల సుమారు 10-15 శాతం పంట దిగుబడి నష్టమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఎరువు దొరుకక రైతు గుండె కోతకు గురవుతుంటే సర్కారు మాత్రం రోజుకో సాకుతో కాలయాపన చేస్తున్నది. తుంటి మీద కొడితే పండ్లు రాలాయన్నట్టుగా కేంద్రం ఇవ్వడం లేదని ఒకసారి, ఆపరేషన్ సిందూర్ వల్ల అని ఇంకొకసారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అని మరోసారి తలాతోకా లేని కారణాలు చెప్తున్నది. రైతులు నిల్వలు పెట్టుకోవడం వల్లే కొరత ఏర్పడుతున్నదని తాజాగా ఓ మంత్రి అంటే, రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నరని మరో మంత్రి అంటున్నారు. ఏదేతేనేం చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎరువు కరువు నిజమేనని సర్కారు ఒప్పుకొంటున్నది. చూస్తుండగానే ఎరువు కరువు సాగుకు ఉరితాడు పేనుతున్నది. ముందస్తు ప్రణాళికతో ముందుకు పోకపోవడం రైతన్నకు శాపమైంది.
సమైక్య పాలనలో యూరియా కష్టాలు సర్వసాధారణంగా ఉండేవి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆ దృశ్యాలు పునరావృతం కారాదనే ఉద్దేశంతో ముందస్తుగా కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపుపై మాట తీసుకోవడమే కాకుండా, సరుకు గిడ్డంగికి చేరే వరకు యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తుండేవారు. రవాణాకు అవసరమైన గూడ్సు ర్యాకుల గురించి కూడా ఆయన ఆలోచించేవారు. అనునిత్యం సమీక్షించేవారు. అవసరమైతే అధికారులను ఢిల్లీకి పంపేవారు. దీంతో సీజన్‌కు అవసరమైన యూరియా సకాలంలో రాష్ర్టానికి చేరేది. తర్వాత సాఫీగా రైతులకు చేరేది.
ఎరువుల దుకాణాల దగ్గర రద్దీ అనేది పాత మాట అయ్యింది. ఇక రైతుబంధు, రైతు బీమా, పకడ్బందీ ధాన్య సేకరణలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. సాగు మహోద్యమంలా సాగి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది. అదీ రైతాంగంపై, సేద్యంపై ప్రేమంటే. కానీ, సాగు సోయి అంటుకు కూడా లేని కాంగ్రెస్ సర్కారు ప్రణాళికా లోపం, నిర్వహణా వైఫల్యంతో ఎరువు కరువు తెచ్చి రైతులకు నరకం చూపిస్తున్నది. రైతును గోస పుచ్చుతున్న సర్కారు సకాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు.