మనింటి సొమ్ము తిని పొరుగింటి పాటపాడే దగుల్బాజీలు తయారైండ్రు. నయవంచనతో నీటి దోపిడీకి తెగబడ్డ దొంగలకు సద్దులు గట్టెటోల్లు అన్నిటిని ఇడిసిపెట్టిండ్రు. రానురాను అంటూనే వగలొలికిస్తూ పోయిన శిష్యుడు గురువుకు దక్షిణగా మన నీటిహక్కులను ధారవోసిండు. అక్కడి సకిలింపులకు ఇక్కడి ఇకిలింపుల జోడీ కుదిరింది. పిట్టపోరు, పిట్టపోరు పిల్ల తీర్చినట్టు కేంద్రం మధ్యవర్తిత్వం.. బనకచర్ల అపహాస్యం.. పొరుగు నేత పన్నాగం..
తెలంగాణ నీటి హక్కులను తెగనమ్మే దుర్మార్గం. కప్పుకొన్న శాలువాల్లో కత్తులు చేతులు మారాయి. గోదావరిని ఎగరేసుకుపోయేందుకు పావులు కదులుతున్నాయి. తెలంగాణ జల సౌభాగ్యాన్ని అమాంతంగా మింగేసే కుట్రలకు తెరలేచింది. మన కండ్లముందే.. మనల్ని నమ్మించి, మన గొంతు కోస్తున్న తీరు ఊసరవెల్లులకు పాఠాలు నేర్పుతుంది. మన నీళ్లు మనకు దక్కకుండా చేసేందుకు తోడేళ్లు నాలుకలు తడుపుకొంటున్నాయి. మనోడే తలుపు తీసి ద్రోహులకు స్వాగతం పలుకుతున్నాడు.
నీళ్లు, నిధులు, నియామకాలు.. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ పొరుగువాడికి తాకట్టు పెట్టేందుకు తెగిస్తున్నాడు. నిన్నటిదాకా ముసుగుండేది.. ఇప్పుడు అంతా ఖుల్లం ఖుల్లా. పాలూ, నీళ్లూ వేరయ్యాయి. బనకచర్ల బండారం బయటపడిపోయింది. ఈ మోసంపై, ఈ దగాపై, ఈ వంచనపై పోరాడుదాం. పోరాటం మనకు కొత్త కాదు. ప్రజల పోరాటానికి కవులారా మీ కలాలను అండగా నిలుపండి. రండి, గళమెత్తండి. మీ కవితా ఖడ్గాలకు పదును పెట్టండి. ఆంధ్ర జలదోపిడీపై కలంతో బరిగీసి కొట్లాడుదాం.
బనకచర్ల ద్రోహంపై కవితలు పంపాల్సిన చిరునామా: నమస్తే తెలంగాణ 8-2-603,1/7,8,9 కృష్ణాపురం, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
99590 59041 e-mail: editpage@ntnews.com