పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ పెను ప్రభావాలకు లోనవుతున్నదని, ప్రజలంతా పొదుపు సూత్రాలు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశభక్తి ప్రదర్శిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని ఉపదేశాలు ఇవ్వడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. జీఎస్టీ తగ్గించాం.. వస్తువులు కొనండి, దీపావళి, విజయదశమి పండుగ సంబరాల్లో మునగండని, నిన్నమొన్నటివరకు దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని ప్రగల్భాలు పలికిన ప్రధాని హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ‘బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆదా చేయండి, రైతులు ఎరువులను, ప్రజలు వంట నూనెలను తక్కువగా వాడాలంటూ ’ అంటూ పొదుపు సూత్రాలు వల్లించారు.
ప్రధాని మోదీ స్వభావాన్ని పన్నెండేండ్లు గా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. విజయం ఆయన ఖాతాలో, వైఫల్యాలను ఇతరుల ఖాతాలో జమ చేయడం ఆయన థియరీ. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమై సుమారు రెండున్నర నెలలు గడుస్తు న్నా, యుద్ధంతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకకు మోదీ సరైన చర్యలు తీసుకోలేదు. దాదాపు 80% శాతం చమురు, గ్యాస్ వంటివి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇందులో అత్యధికంగా హొర్ముజ్ జలసంధి ద్వారా మనకు చేరుతాయి. అయినా ప్రధాని దృష్టి సారించలేదు.
పశ్చిమాసియా సంక్షోభం, రాబోయే కాలం లో భారత్ ఎదుర్కొనే గ్యాస్, చమురు, ఎరువులు, వంట నూనెల కొరత, ముఖ్యంగా విదేశీమారక నిల్వలు తగ్గుదల వంటి పలు సమస్యల పరిష్కారం కోసం అని చెప్తూ ప్రజలకు ప్రధాని పొదుపు సూత్రాలు బోధించారు. ఇటువంటి సమస్యలు వస్తాయని ఆయనకు ముందే తెలుసు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పాటు చేయడానికి, ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు, విభజన రాజకీయాలు చేసి, వారు అనుకున్న రాష్ర్టాల్లో అధికారం కోసం వాస్తవాలు దాచిపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితిపై నిజాలు దాచటం ఎంతవరకు సమంజసం? ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలను మోసం చేయటమే! ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తకుండా దేశభక్తి, మత క్రతువుల పేరుతో తప్పించుకోవటం బీజేపీ నేతలకు అలవాటే. ప్రజలు, ముఖ్యంగా జెన్జీ యువత ఈ విషయం గ్రహించాలి. పెద్దవాళ్లు యువతకు అర్థమయ్యేలా చెప్పాలి.
2016లో అర్ధరాత్రి ఆగమేఘాలపై ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు నిర్ణయం ప్రకటించారు. అప్పుడు ప్రారంభమైన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, కోవిడ్ కాలంలో మరింత క్షీణించింది. ఇటీవలి కాలంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ ప్రతీకార సుంకాలు, వలస వ్యతిరేక విధానాలు, తాజాగా అమెరికా-ఇరాన్ యుద్ధంతో మన దేశం అన్నిరంగాల్లో వెనుకబాట పట్టడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి దాపురించింది. నిన్నమొన్నటి వరకు దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నదని, జీడీపీ, బిలియనీర్ల్ల సంఖ్య పెరుగుతున్నదని గొప్పలు చెప్పుకొని జబ్బలు చరుచుకున్న కేంద్ర పాలకులు యూటర్న్ తీసుకున్నారు.
ఆర్థిక రంగ వైఫల్యంపై ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రధాని పొదుపు సూత్రాలు వల్లించారు.ఎన్నికలు అయిపోయాయి కనుక అతి త్వరలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉన్నది. ఇక నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరలు పెరిగి, దేశ ప్రజానీకం యావత్తు బతకడానికి ముప్పుతిప్పలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేనా మోదీ పన్నెండేండ్ల పాలనలో ప్రజలకు ఇచ్చే అచ్చేదిన్? ఏమి కొనాలి, ఏమి తినాలి అనే స్థాయికి దేశం దిగజారింది. నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ఉపాధి లేమితో లక్షలాది కుటుంబాలు కునారిల్లుతున్నాయి.
పుండుమీద కారం చల్లినట్టు మోదీ పొదుపు సూత్రాలు ప్రజల్లో మరిన్ని భయాలు సృష్టిస్తున్నాయి. అరవై ఏండ్లపాటు కాంగ్రెస్ పాలనలో దేశం ఏమీ అభివృద్ధి చెందలేదని చెప్పి, 2014లో కేంద్రంలో గద్దెనెక్కిన మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పన్నెండేండ్ల పాలనలో ఏమి సాధించిందో ఇకనైనా తెలుపాలి. 2014లో రూపాయి మారకం విలువ 58 రూపాయలుగా ఉంటే.. నేడు 95.80కు పతనమైంది. మోదీ అధికారం చేపట్టే నాటికి విదేశీ రుణం 446 బిలియన్ డాలర్లు ఉంటే.. నేడు 755 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. నాడు ప్రతీ భారతీయుడిపై రూ.48,296 అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.1,48,000 ఉన్నది.
దేశంలో ఏదైనా సంక్షోభం వస్తే చేతులెత్తేయడం, నీట్గా దేశభక్తి ముసుగు తొడిగి మోదీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేండ్ల క్రితం కొవిడ్ కాలంలో, నేడు పశ్చిమాసియా సంక్షోభంలో ఇదే ధోరణిని మోదీ ప్రదర్శిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్, గతిశక్తి, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి నినాదాలతో దేశం పరుగులు పెడుతున్నదని లేని గొప్పలు చెప్పుకోవటం పరిపాటిగా మారింది. సమస్యలు, సంక్షోభాలు ఏర్పడితే చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంటున్నారు. మోదీ పాలనలో కార్పొరేట్ దిగ్గజాలు భారీ సంపదను పోగేసుకుంటున్నాయి. కానీ దేశంలో సుమారు 80 శాతం ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు ఏమీ మెరుగుపడలేదని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని పాలకులకు ధ్యాస లేదు. అందువల్లనే మన దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ గాలిబుడగలా తయారైంది.
ఇకనైనా ప్రజలు, యువ త పాలకుల విధానాలను, అసలు రంగును గ్రహించాలి. తమ జీవితాలకు, తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు మెరుగుకు కృషి చేసే వారికి అధికారం ఇవఇవ్వడానికి తమ వంతు పాత్ర పోషించాలి. కుల, మత, వర్గ, ప్రాంతీయ భాషా తదితర అంశాల ఆధారంగా ఓట్లు దండుకునే పార్టీలను, నేతలను దూరంగా ఉంచడం మంచిది. జెన్జీ యువత తమ ఆకాంక్షలు నెరవేర్చే వారికే అధికారం ఇవ్వాలి. కట్టబెట్టడం ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం. పౌర సమాజమా..నేటి పాలకుల విధానాలు వాస్తవరూపంలో విశ్లేషణ చేయాలి. మహనీయుడు లెనిన్ ఇలా చెప్పాడు ‘పాలకుల విధానాలు, మాటల్లోని అంతరార్థం ప్రజలు గ్రహించలేనంత కాలం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు’. సుమారు శతాబ్దం క్రితం ఆయన చెప్పిన మాటలు నేటికీ వాస్తవమే కదా!
– ఐ.ప్రసాదరావు 6305682733